రాహుల్ నీళ్లు చల్లారే….!

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలపై నీళ్లు చల్లారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పేశారు. ఇది వాస్తవమే. అయితే ఒక పార్టీ అధినేత నోట నుంచి ఆ మాట రావడంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు హతాశులయ్యారు. ఈ వ్యాఖ్యలు పొత్తులపై ప్రభావం చూపుతుందేమోనన్న అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారంలోకి రాలేమని, కాకుంటే బలపడతామని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో చర్చనీయాంశమైంది.

కొంత మెరుగుపడుతుందనుకుంటున్న……

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయింది. గత ఎన్నికలలో ఒక్కసీటును కూడా గెలుచుకోలేక పోయింది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ ఊపిరి పోసుకుంటుంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారికిరణ్ కుమార్ రెడ్డి వంటివారు పార్టీలోచేరడంతో కొంత పరిస్థితి మెరుగుపడుతుందని అంచనాకు వచ్చింది. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్కసీటు కూడా రాదని భావించిన కాంగ్రెస్ పార్టీ పొత్తులతో వెళ్లేందుకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామలను బట్టి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తుకు సాహసించకపోవచ్చు.

ఆపరేషన్ స్వగృహ……

అయినా ఒక ఆశతో ఏపీ కాంగ్రెస్ నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘‘ఆపరేషన్ స్వగృహ’’ కు ద్వారాలు తెరిచారు. కాంగ్రెస్ వీడిన నేతలందరూ తిరిగి సొంత గూటికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీలోకి ఆహ్వానిస్తూ కిరణ్ ఫోన్ లు చేస్తున్నారు. దాదాపు 30 మంది నేతలు తిరిగి పార్టీలో చేరతారన్నది కిరణ్ అంచనా. దీంతో కనీసం పది నుంచి ఇరవై స్థానాల్లోనైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవచ్చన్నది ఆయన అంచనా.

ఇక ఎవరూ రారా?

కాని రాహుల్ వ్యాఖ్యలతో ఇక పార్టీలోకి ఎవరు వస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీలో పొత్తుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోతే ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుంది. జనసేన, కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్ తో కలసి పనిచేయవు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ను దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. ఈ నేపథ్యంలో పొత్తులేకుండా ఒంటరిగా వెళ్లాలంటే బలమైన నేతలు కొందరైనా అవసరమవుతారు. కానీ రాహుల్ వ్యాఖ్యల ప్రభావం కారణంగా నేతలు పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోవచ్చన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 38942 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*