
భారత జాతీయ కాంగ్రెస్ లో ఎప్పుడూ లేని విధానానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ అనుసరిస్తున్న విధానానికి పార్టీలో మంచి మార్కులే పడ్డాయి. పార్టీకి చెందని అగ్రనేతలు ఒకింత అసహనం ప్రదర్శిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రాహుల్ నిర్ణయానికి సానుకూలత వ్యక్తమవుతోంది. గతంలో మాదిరిగా కాకుండా కొత్త సంప్రదాయానికి రాహుల్ తెరదీయడం పార్టీకి మంచిరోజులొచ్చేసినట్లేనన్నది పార్టీ నేతల భావన. ఎందుకంటే గతం కంటే భిన్నంగా రాహుల్ ప్రయాణిస్తున్నారు కాబట్టి.
ఇందిర నుంచి ……
ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకూ తీసుకుంటే కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక కొందరి కనుసన్నల్లోనే జరిగేది. వారి కోటరీలోని ముఖ్యులే అభ్యర్థులను నిర్ణయించేవారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పక్కనపెట్టి ఊహించని వారికీ గతంలో బీఫారంలు లభించిన ఉదాహరణలున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అనేక ఆరోపణలను ఎదుర్కొంది. సమర్థనేతలను పక్కన పెట్టి లాబీయింగ్ చేసే నేతలకు, పార్టీ ఫండ్ ఇచ్చే లీడర్లకే బిఫారంలు ఇచ్చే సంప్రదాయం ఇందిరాగాంధీ నాటి నుంచే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండేదన్నది అందరికీ తెలిసిందే.
సోనియాగాంధీ కూడా…..
సోనియాగాంధీ కూడా ఈ కోటరీ నుంచి తప్పించుకోలేక పోయారు. అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ వంటి నేతలు టిక్కెట్ల విషయంలో చక్రం తిప్పేవారు. అసలు వారికి ఎందుకు టిక్కెట్ ఇచ్చారో అర్థంకాక పార్టీ శ్రేణులు జుట్టుపీక్కునే స్థితికి వచ్చేవి. అయితే రాహుల్ గాంధీ హయాం వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీనియర్ నేతలను పక్కన పెట్టారు. తనకూ కోటరీ ఉన్నప్పటికీ నమ్మకమైన నేతలకే స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలను అప్పగించారు. నిబద్ధత కలిగిన నేతలు, నిజాయితీని బేరీజు వేసుకుని వారికి స్క్రీనింగ్ కమిటీ లో నియమించారు.
శక్తియాప్ ద్వారా…..
మరోవైపు శక్తి యాప్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను రాహుల్ తెలుసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సయితం రాహుల్ శక్తి యాప్ పై ఆధారపడటం, భక్త చరణ్ దాస్ వంటి నిజాయితీ ఉన్న నేతలకు బాధ్యతలను అప్పగించడం అందులో భాగమేనంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ లేనివిధంగా టిక్కెట్ దక్కని వారిని కూడా తానే స్వయంగా పిలిచి బుజ్జగిస్తుండటం గత సంప్రదాయాలకు భిన్నమే. సమర్థత ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి టిక్కెట్ దక్కకపోవడతో వారితో నేరుగా మాట్లాడతుండటం మంచి పరిణామమంటున్నారు. ఇదే సంప్రదాయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అమలుపరుస్తుండటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని కల్గిస్తోంది.
Leave a Reply