
కొన్నేళ్లుగా కాలుమోపని రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత పార్టీని సరైన దిశలో నడిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఒడిశాలో కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ రెండో స్థానం దక్కించుకోవడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గుతుండటం, కాంగ్రెస్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని భావించి రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈసారి ఒడిశాలో ఎలాగైనా పవర్ చేపట్టాలన్నది రాహుల్ ఆలోచన. ఈ దిశగా ఆయన పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు.
ఒడిశాపై ప్రత్యేక దృష్టి…..
రాహుల్ గాంధీ ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఒడిశా పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్, ప్రతిపక్ష నేత నర్సింగ్ మిశ్ర కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒడిశాలో పదిహేనేళ్లుగా బిజూ జనతాదళ్ అధికారంలో ఉండటం ప్రభుత్వ వ్యతిరేక ఖచ్చితంగా పనిచేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అలాగే శక్తిగా ఎదుగుదామనుకుంటున్న భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కూడా ఇటీవల కాలంలో పడిపోవడంతో వచ్చే శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో తమకు అనుకూలమని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఒడిశాలో రాహుల్ పర్యటన జరగనుంది.
గత ఎన్నికలలో…..
గత ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిస్తే… ఇక్కడ బిజూ జనతాదళ్ కూ ఒడిశా ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు. మొత్తం 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో గత ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు 117 స్థానాలు దక్కించుకుంది. తర్వాత ప్లేస్ కాంగ్రెస్ లో ఉంది. అయితే కాంగ్రెస్ కు వచ్చిన స్థానాలు కేవలం 16 మాత్రమే. అంతకు ముందు జరిగిన ఎన్నికల కంటే 11 స్థానాలను కాంగ్రెస్ గత ఎన్నికల్లో కోల్పోయింది. ఇక భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల్లో పది స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు 43.4 శాతం ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కు 25.7 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 18 శాతం ఓట్లు లభించాయి. దీంతో ఓటింగ్ శాతం ఒడిశాలో పెంచుకునేందుకు ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశా పర్యటనలు తరచూ చేస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు తరచూ ఒడిశాను పర్యటిస్తున్నారు.
కాంగ్రెస్ కు కష్టమే…..
ఈమధ్య కాలంలో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఓటమి కూడా కాంగ్రెస్ శ్రేణులను కుంగదీసింది. బీజపూర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ కు పట్టుంది. వరుసగా మూడుసార్లు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ గెలిచింది. . అయితే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగితే బిజూ జనతాదళ్ అభ్యర్థి రీటా సాహు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ రెండో స్థానంలో ఉంది. నాయకుల వైఫల్యమేనని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా భావిస్తుంది. అందుకే పార్టీకి కాయకల్ప చికిత్స చేసేందుకు రాహుల్ నడుంబిగించారు. అయితే బలంగా ఉన్న నవీన్ పట్నాయక్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. కనీసం రెండో స్థానానికైనా ప్రయత్నించడం, పార్లమెంటు ఎన్నికల్లో కనీస స్థానాలను దక్కించుకోవడం ఇప్పుడు హస్తం పార్టీ లక్ష్యంగా కన్పిస్తోంది.
Leave a Reply