ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు…?

rahulgandhi-indian-nationalcongress

కాంగ్రెసు పార్టీ సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్టు చేయాలనే వర్గం ఒకవైపు బలంగా లాగుతోంది. మరొక వైపు ఇంకొక వర్గం ముందుగా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని వాదిస్తోంది. ఇందుకోసం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలంటోంది. తురుపుముక్కగా భావిస్తున్న ప్రియాంక గాంధీని కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా వేచి చూడటం అనవసరమని యువ నాయకత్వం చాలా గట్టిగానే పట్టుపడుతోంది. రాహుల్ నాయకత్వ మార్కు విజయాలు తక్కువ కావడంతో 2019 ఎన్నికల వరకూ సంయమనం పాటించడమే మంచిదని పార్టీ లోని మరొక మెజార్టీ వర్గం సలహానిస్తోంది. ఏదేమైనప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి అజెండా లేకుండా ముందుకు వెళితే ఎలా ఉంటుందనే చర్చసాగుతోంది. పార్టీ బలానికి తోడు ఎప్పటికైనా ప్రధాని అభ్యర్థి గా రాహుల్ ను ముందు పెట్టాల్సిందే. 2014లో సైతం పరోక్షంగా పార్టీ అధికారంలోకి వస్తే తనే ప్రధాని అని ప్రచారం సాగిన అంశం అందరికీ తెలిసిందే. కానీ వాతావరణం కలిసి రాలేదు. మోడీతో పోలికలో బాగా వెనకబడి పోయాడు. నాలుగున్నరేళ్లుగా ఈ పోలిక కొనసాగుతూనే వస్తోంది. ఏడాదికాలంగా రాహుల్ బాగా పుంజుకున్నారు. మొదట్లో వీరిద్దరి ప్రధాని అభ్యర్థిత్వాల మధ్య ప్రజామోద అంతరం 30 శాతం వరకూ ఉండేది. ఇప్పుడది 15 శాతానికి తగ్గింది. రాహుల్ ప్రధాని కావాలని కోరుకునే వారు 27శాతం మంది వరకూ ఉంటే, మోడీకి ఆమోదముద్ర వేస్తున్నవారు 42 శాతం వరకూ ఉన్నట్లుగా తాజా అంచనా. ఎటూ తేల్చి చెప్పని వారు 18శాతం వరకూ ఉన్నారు. మమత, మాయా, పవార్ , చంద్రబాబు వంటి వారిని ప్రధానిగా చూడాలనుకుంటున్నవారి మొత్తం శాతం 13 . అంటే రేసులో మోడీకి దీటుగా నిలుస్తున్నది రాహుల్ మాత్రమే. అయితే విపక్షాలు దీనిని అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడమూ కాంగ్రెసుకు సమస్యాత్మకంగా మారింది.

ఫస్టు ప్రయారిటీ…

మోడీతో పోటీలో రాహుల్ బాగా పుంజుకుంటున్నారు. ఆరేడు నెలలకాలంలోనే ఆయన రేటింగు పదిశాతం పైగా పెరిగింది. మరొక మూడు నెలల కాలంలో ఇది మరింత మెరుగు కావచ్చనేది పార్టీ వర్గాల అంచనా. అదే జరిగితే మోడీ, రాహుల్ మధ్య పోటాపోటీ, ముఖాముఖి పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల స్వింగ్ ఓటర్లు, తటస్థ ఓటర్లను కాంగ్రెసు ఆకర్షించగలుగుతుంది. ఇటువంటి స్థితిలో ఇప్పుడు రాహుల్ పోటీలో లేరన్నట్లుగా చెబితే కాంగ్రెసుపార్టీకి అది ఆత్మహత్యా సదృశమని కొందరు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకునిగా నిలదొక్కుకోవాలంటే ఇదే సరైన సమయమని యువనాయకత్వ కోటరీ పేర్కొంటోంది. మొదటి ప్రాధాన్యంగా దేనిని తీసుకోవాలనే అంశంలో కొంత తడబాటు కనిపిస్తోంది. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్టు చేయడాన్ని అన్నింటికంటే ప్రాధాన్య అంశంగా కాంగ్రెసు తీసుకోవాలా? లేకపోతే మొత్తం విపక్షాలన్నీ కలిసి మోడీని ఓడించడాన్నే ప్రధానాంశంగా చేసుకోవాలా? అన్న విషయంలో వైరుద్ధ్యం కనిపిస్తోంది. మోడీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అన్ని పార్టీలు కలిసి రావాలంటే కొంత రాజీపడాల్సి ఉంటుంది. తమ అధినేత ప్రధానమంత్రి అభ్యర్థిత్వ డిమాండును కాంగ్రెసు పక్కనపెట్టాలి.

బాబు కలిసొస్తారా..?

కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏ కూటమిని స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ప్రాంతీయ పార్టీలను అనుసంధానించే మధ్యవర్తిత్వ పాత్రలో క్రమేపీ కుదురుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని అత్యంత ప్రాధాన్యం కలిగిన సన్నిహిత పక్షంగా కాంగ్రెసు భావిస్తోంది. తెలంగాణలో ఓటమి తర్వాత కూడా చంద్రబాబు నాయుడికి రాహుల్ చాలా ప్రాముఖ్యం కల్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కున్న బలానికి మించి కాంగ్రెసు గౌరవిస్తోంది. చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్ దీనికి కారణం. యూపీఏ పక్షాలు బోర్డర్ లో నిలిచిపోతే నాలుగైదు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి మోడీని పక్కనపెట్టి రాహుల్ ను తెరమీదకు తేగల సామర్ధ్యం చంద్రబాబుకు ఉందని హస్తం పార్టీ అనుకుంటోంది. దీంతో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని నివేదికలు వస్తున్నప్పటికీ వాటిని కాంగ్రెసు పక్కనపెడుతోంది. బాబును అవసరమైన సందర్భంలో నెగోషియేషన్స్ కు వాడుకోవచ్చని భావిస్తోంది. తెలుగుదేశం అధినేత సైతం రాహుల్ తో సంప్రతింపుల్లో ఆ రకమైన భరోసానిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ముందుగా ప్రకటించే విషయంలో మాత్రం చంద్రబాబు చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ చర్చ పార్టీలోనూ, తన సన్నిహిత మిత్రుల వద్ద తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఎంతెంతదూరం..?

ఇప్పటికే రాజకీయ వేడి పతాకస్థాయికి చేరింది. విపక్షాల నుంచి ప్రధాని రేసులో అయిదుగురు ముఖ్యంగా పోటీపడుతున్నారు. బీజేపీ ఓడిపోతే కాంగ్రెసు తమ అధినేతను ఆ పీఠంపై కూర్చోబెట్టాలంటే మిగిలిన రేసు గుర్రాలన్నిటి మద్దతు అవసరం. అదే సమయంలో కాంగ్రెసు మద్దతు లేకుండా విపక్షాల నుంచి ఏ ఒక్కరు ప్రధాని కాలేరు. ఒక్క రాహుల్ గాందీ మాత్రమే 50లోపు వయసులో ప్రధాని రేసులో పోటీ పడుతున్నారు. మిగిలిన వారంతా 60,70 ల లోని వారే. డెబ్బైవ పడిలో ఉన్న శరద్ పవార్ ఆశగా ఈ పదవి అందివస్తుందేమోనని చూస్తున్నారు. మమత, మాయావతి సీరియస్ పోటీదారులే. బలాదిక్యం ద్రుష్ట్యా కాంగ్రెసు అధినేత రాహుల్ సహజ పోటీదారు. ఏపీలో తెలుగుదేశం 20కి పైగా సీట్లు గెలుచుకుని మిగిలిన పార్టీలు, నేతల మధ్య ఏరకమైన అవగాహన కుదరని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి కూడా మధ్యేమార్గంగా ఆ అదృష్టం దక్కవచ్చనుకుంటున్నారు. మొత్తమ్మీద ఎవరెవరు ఎంతెంతదూరంలో ఉన్నారనేదే లెక్క.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 33889 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*