కూటమి కుదేలయినట్లేనా…??

rahulgandhi vs mamatha benerje

కాంగ్రెస్ పార్టీ కూటమిలోని పార్టీలతో విసిగిపోతోంది. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ఆశలను తన చేజేతులా తానే వమ్ముచేసుకునేలా ఉంది. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కూటమి ఏర్పాటు ఇక కలగానే మిగిలిపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసి మోదీని మట్టికరిపించాలన్న పలు ప్రాంతీయ పార్టీల నేతల ప్రయత్నాలు వమ్ము అయ్యేలా కన్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలయిన ఈ ప్రక్రియ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూ విస్తరించింది. ప్రాంతీయ పార్టీల చేతుల్లో పావుగా మారదల్చుకోకపోవడం వల్లనే హస్తం పార్టీ కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది.

ఉత్తరప్రదేశ్ తో మొదలు….

ఉత్తరప్రదేశ్ లోనూ బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ ను దరిచేరనివ్వలేదు. దీంతో కాంగ్రెస్ యూపీలోని 80 స్థానాల్లోనూ తాము పోటీ చేస్తామని ప్రకటించింది. రాహుల్ ఉత్తరప్రదేశ్ పర్యటనకుకూడా ప్రణాళికను ఆ రాష్ట్ర నేతలు రూపొందించారు. దీంతో యూపీలో తిరిగి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తుంది. ఈనెల 19వ తేదీన కోల్ కత్తా లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని మమత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మమత ర్యాలీకి….

అయితే ఈ ర్యాలీ ద్వారా మోదీకి సత్తా చూపాలని మమత భావించారు. బీజేపీయేతర పార్టీ నేతలందరినీ మమత ఈ ర్యాలీకి ఆహ్వానించారు. కాని మమత అనుకున్నట్లుగా జరగడం లేదు. ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గైర్హాజరు కానున్నారు. టీఎంసీ ర్యాలీకి సోనియా వెళ్లడం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. రాహుల్ కూడా వెళ్లే అవకాశం లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పై వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీచేయాలనుకుంటున్నామని, ఈ ర్యాలీకి హాజరుకావద్దని, మమత వలలో పడొద్దని చెప్పడంతోనే సోనియా కోల్ కత్తా పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

సొంతంగా ఎదగాలని….

ఈ ర్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, రాష్ట్రీయజనతాదళ్ నేత తేజస్వీయాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి వారే హాజరయ్యే అవకాశముంది. కర్ణాటకలో కొద్దినెలల క్రితం జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ తో పాటు మమత, మాయావతి, అఖిలేష్ యాదవ్ వంటి వారు హాజరయ్యారు. విపక్షాల ఐక్యతను ఆ వేదికపై చాటిచెప్పారు.కానీ నెలలు తిరక్కుండానే కూటమిగా ఏర్పడదామనుకున్న పార్టీల మధ్య వైరుథ్యాలు కన్పిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థిత్వమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. మమత ర్యాలీకి మాయావతిహాజరవ్వడం కూడా అనుమానమేనంటున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల్లోపు కూటమి పార్టీల్లో మరెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 33932 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*