
ఛత్తీస్ ఘడ్ లో జరిగే ప్రతి ఎన్నికల్లో కమలం పార్టీకి ఏదో ఒక రూపంలో అదృష్టం కలసి వస్తోంది. మూడు దఫాలుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా విజయం సాధిస్తుందంటే అందుకు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నిజాయితీ, పాలనా దక్షత ఒక కారణం కాగా మరో కారణం విపక్షాల అనైక్యతే అని చెప్పకతప్పదు. ఛత్తీస్ ఘడ్ లో గత మూడు దఫాలుగా జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తే కమలనాధులకు విజయాన్ని తెచ్చిపెడుతోంది విపక్షాలన్నది మాత్రం వాస్తవం. ఛత్తీస్ ఘడ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో మరోసారి విపక్షాల అనైక్యత చర్చకు దారితీసింది.
అదృష్టం తలుపు ముంగిటే…..
ఈ ఎన్నికల్లోనూ కమలనాధుల వాకిట్లోనే అదృష్టం కూర్చుని ఉందనిపిస్తోందన్నది విశ్లేషకుల అంచనా. ఛత్తీస్ ఘడ్ లో మొత్తం 90 స్థానాలుండగా 2008 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2013 ఎన్నికల్లో కమలనాధుల గ్రాఫ్ ఒకింత పడిపోయిందనే చెప్పాలి. ఇండిపెండెట్లు, స్థానికంగా ఉండే చిన్నా చితకా పార్టీలు కాంగ్రెస్ ఓట్లకు గండి కొడుతున్నాయి. ఈసారి ఇక్కడ మాయావతి ఆ పాత్ర పోషించనున్నారు. చిన్న రాష్ట్రమైనా దళిత, గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉంది.
బీఎస్సీ ఓట్ల చీలికతో……
గత ఎన్నికల్లో మాయావతి పార్టీ 6.11 శాతం ఓట్లు సాధించిందంటే ఆ పార్టీకి కొంత పట్టు ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఓట్ల శాతం కొంత నమోదయినప్పటికీ ఒక స్థానంలోనే మాయావతి పార్టీ గెలిచింది.బీజేపీ 49, కాంగ్రెస్ 39 స్థానాల్లో గెలిచాయి. ఈసారి కూడా మాయావతి, అజిత్ జోగి పార్టీ అయిన జనతా కాంగ్రెస్ తో కలవడంతో భారీగా ఓట్లు చీలే అవకాశముందన్న అంచనా వెలువడుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ లో సమర్థవంతమైన నాయకత్వం కొరవడటమూ ఆందోళన కల్గిస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత రామదయాళ్ ఉయికే పార్టీని వీడటం కూడా కలవరపరుస్తోంది.
కాంగ్రెస్ బేలగా……
మరోవైపు రమణసింగ్ ఒంటిచేత్తో పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆయన చేపట్టిన పలు సంస్కరణలు, సంక్షేమ పథకాలు ప్రచారంలో ప్రధానాంశాలుగా మారాయి. నయా రాయపూర్ నిర్మాణం, మావోల ఏరివేత వంటి చర్యలు రమణ్ సింగ్ కు మరోసారి సీఎం పీఠం దరిచేర్చనున్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఇటు ఓట్ల చీలిక, కాంగ్రెస్ లో కలహాలు తమకు కలసి వస్తాయని కమలనాధులు గట్టిగా విశ్వసిస్తున్నారు. మొత్తం మీద నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం రమణ్ సింగ్ దరి చేరుతుందన్నది సర్వేల సారాంశం.
Leave a Reply