అబద్ద అక్షరం… ఆయుధంగా మారి?

రామోజీ రావు

కమ్యూనిస్టు సానుభూతిపరులు, నక్సల్బరీ ఉద్యమకారుల అక్షరాలతో 1970 దశకంలో మొదలైన “ఈనాడు” పత్రిక 1980 దశకం వచ్చేసరికి పూర్తిగా పెట్టుబడిదారీ వ్యాపార రూపం ధరించింది. అప్పటివరకూ ఉన్న పత్రికలు ఉపయోగించే గ్రాంధిక పదజాలాన్ని తీసి పక్కన పెట్టి ప్రజల భాషను వార్తగా మలచడంలో పత్రికలో జర్నలిస్టులుగా పనిచేసిన కమ్యూనిస్టు, నక్సలైట్ ఉద్యమ సానుభూతిపరుల కలం నుండి జాలువారిన ప్రజా పదజాలం ఈ పత్రికను ప్రజలకు చేరువ చేసింది. ఉదాహరణకు రాజకీయ నాయకులూ, అధికారులు తదితరుల పేర్లకు ముందు “శ్రీ” లేదా పేర్ల తర్వాత “గారు”, వంటివి మాయం అయ్యాయి. “బహుళ సభల్లో ప్రసంగించియున్నారు” వంటి పదాలు పోయి “పలు సమావేశాల్లో ప్రసంగించారు” వంటి ప్రజల భాష పత్రికలోకి రావడంతో ఈ పత్రిక ప్రజలకు చేరువైంది. వీటన్నిటికీ తోడు పత్రిక యజమాని రామోజీరావులోని కమ్యూనిస్టు సానుభూతిపరుడు కూడా మాయమై పెట్టుబడిదారుడు చాలా వేగంగా పుట్టుకొచ్చి అంతకంటే వేగంగా పత్రిక విక్రయాలను విస్తృతం చేశారు. గ్రామాల్లో ఉండే విద్యావంతులకు (బ్రాహ్మణులకు మినహా) ఈ పత్రిక భాష బాగా నచ్చింది. పత్రికలో పనిచేసే కమ్యూనిస్టు సానుభూతిపరుల అక్షర విన్యాసం, పదప్రయోగం కూడా ప్రధాన ఆకర్షణ అయింది. అందువల్ల పత్రిక అతికొద్దికాలంలోనే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. (యజమానిలో పుట్టుకొచ్చిన పెట్టుబడిదారుడు జర్నలిస్టులుగా పనిచేస్తున్న కమ్యూనిస్టులకు “వేతన సంఘం” (Wage Board) జీతాలు ఎగ్గొట్టారు. పైగా “మాకు వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు వద్దు” అని వాళ్ళచేతనే లేఖలు రాయించుకున్నారు. అలా వ్యతిరేకించిన వారు కోర్టులకెళ్ళి అతికష్టం మీద విజయం సాధించారు. అది వేరే విషయం.) అయితే అప్పటికే పత్రిక అప్రతిహతంగా తెలుగు లోగిళ్ళలో వెలుగుతోంది. తెలుగు ప్రజలకు ఆ పత్రిక రాసిందే వార్త. అదే నిజం.

కలం కులం అయిన సందర్భం….

సరిగ్గా 1980 దశకంలోనే పెట్టుబడిదారుడిగా మారిన రామోజీరావు కులపెద్దగా అవతారం ఎత్తి రాష్ట్రంలో రెడ్ల పెత్తనంపై తిరుగుబాటు అక్షరాలు మొదలెట్టి చివరికి ఎన్టీఆర్ తెరపైకి రావడంతో తన ముసుగు కూడా తీసేసి పత్రికలో “కుల ఇంట్రెస్టులకు” పెద్దపీట వేశారు. ప్రజలకు ఎన్టీఆర్ పట్ల విపరీతమైన అభిమానం, ఆరాధనతోపాటు ఆయన ప్రకటించిన కిలో రెండురూపాయల బియ్యం పధకం వంటివాటిపై నమ్మకం పెరిగి ఎన్టీఆర్ కు బ్రహ్మరధం పట్టారు. కానీ “ఈనాడు” దినపత్రిక “కులపత్రికగా” మారిపోయి చాలా మంది విద్యావంతుల్లో కొంత అసహనాన్ని కలిగించింది.

ఉదయించిన “ఉదయం”

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో దాసరి నారాయణరావు “ఉదయం” పత్రికను 1980 దశకంలోనే ప్రారంభించారు. అప్పటివరకూ అక్షరాలు నమ్ముకొని బతుకుతున్న కమ్యూనిస్టు భావజాల జర్నలిస్టులు తమ అక్షరాలను అమ్ముకొని కుల వ్యాపారం చేస్తున్న రామోజీరావును వదిలి దాసరి నారాయణరావు దగ్గరికి చేరారు. ఈ కమ్యూనిస్టు కలం యోధుల రాకతో “ఉదయం” నిజంగానే ప్రతి ఉదయాన్నీ ఆహ్లాదంగా మార్చింది. అప్పటివరకూ “ఈనాడు” చెప్పని నిజాలను, నిజాలుగా ఈనాడు నమ్మబలికే అబద్దాలను “ఉదయం” ఎండగట్టింది. “ఉదయం” రాకతోనే వార్తకు రెండోవైపు తెలుగు ప్రజలకు తెలిసింది. “ఉదయం” పత్రిక కొట్టిన దెబ్బను కులపెద్ద జీర్ణించుకోలేకపోయారు. అధికారం, కులం, ధనం, ఈ మూడు అస్త్రాలు ఉపయోగించి దాసరి నారాయణరావు ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టారు.

కలంలో కులం సిరా….

అలా దెబ్బతిన్న “ఉదయం” 1990 దశకంలో మాగుంట సుబ్బరామి రెడ్డి రూపంలో మరోసారి తెలుగు లోగిళ్ళలోకి వచ్చింది. ఇప్పుడు “ఉదయం” పత్రికకు రాజకీయ అండ ఉంది. మద్యం వ్యాపారం ఇచ్చిన ఆర్ధిక బలం ఉంది. అయినా కులపెద్ద “ఉదయం”ను దెబ్బకొట్టాలనే వ్యూహంతోనే ఎన్టీఆర్ నోట “మద్యనిషేధం” ప్రకటన చేయించారు. దూబగుంట నుండి మొదలుపెట్టి అక్షరాల అబద్దాలు అన్ని దిక్కులకూ విస్తరింప జేశారు. దీనికోసం వావిలాల వంటి మహానీయులను కూడా రంగంలోకి దించి వాడుకున్నారు. బెజవాడలో జరగని ప్రదర్శనను జరిగినట్టు నెల్లూరు పత్రికలో, నెల్లూరులో జరిగినట్టు శ్రీకాకుళం పత్రికలో, ఇలా అబద్ద అక్షర యుద్దాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విస్తృతంగా చేశారు. అబద్దపు అక్షరం ఆయుధమైంది. ఎక్కడికక్కడ ప్రజలు ” సారా ఉద్యమంలో మనం వెనుకబద్ధమా” అనుకునేలా ఒక అబద్ధపు యుద్ధం చేశారు. ఎన్టీఆర్ 1994లో గెలిచారు. మద్యనిషేధం వచ్చింది. “ఉదయం” యజమాని మాగుంట ఆర్ధిక మూలాలు దెబ్బతిన్నాయి. “ఉదయం” అస్తమించింది. ఇక 1995 ఆగస్టు. వైస్రాయ్ హోటల్ కూడా అంతే. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పట్టుమని పదిమంది శాసనసభ్యులు లేరు హోటల్లో. కానీ బయటకు వచ్చిన వార్తలు వేరు. ప్రతి శాసనసభ్యుడు “నేనే వెనకబడ్డానా”, “ఇప్పటికే ఆలస్యం చేశానా”, “ఇంకా హోటల్ కు వెళ్ళకుండా తప్పు చేస్తున్నానా” అని ఆలోచించుకునేలా వార్తలు వచ్చాయి. ఒక అబద్దం నిజం అవతారం ఎత్తి ప్రళయ తాండవం చేసింది. ఈ విషయం హోటల్ కు వెళ్ళిన ఒక్కొక్క శాసనసభ్యుడికి అప్పుడే అర్ధమైంది. హోటల్ బయట తాము విన్నది “అక్షరం ఆడిన అబద్దం” అని.

సాక్షి – ఏదినిజం

వార్త ఒక వైపే, ఒక కులాధిపత్యం వైపే నడుస్తున్న రోజుల్లోనే “ఆ రెండు పత్రికలు” అంటూ చురకవేస్తూ అబద్ద అక్షరాలపై ప్రజలను అప్రమత్తం చేసిన రాజశేఖర్ రెడ్డి “సాక్షి” పత్రిక తెచ్చారు. “సాక్షి” (పత్రిక పెట్టుబడులపై ఉన్న ఆరోపణలు ఇక్కడ ప్రస్తావినాంశం కాదు. ఆ పత్రిక రాజకీయ లక్ష్యం కూడా ప్రస్తావనాంశం కాదు. అవి వేరే సందర్భంలో చర్చించుకుందాం) జర్నలిస్టుల జీతాలు పెంచింది. అరకొర జీతాలతో, అక్షరాన్ని కాలం సెంటీమీటర్ల లెక్కన యాజమాన్యం కూలి ఇస్తున్న పరిస్థితి నుంచి “సాక్షి” రాకతో అన్ని పత్రికలూ జర్నలిస్టులకు జీతాలు పెంచాయి. కులపత్రికకు జీతాలు పెంచక కూడా తప్పలేదు. జర్నలిస్టుల నెలజీతాన్ని “కూలి” స్థాయినుంచి పెంచిన ఘనత “సాక్షి”కి ఇవ్వక తప్పదు. ఇక్కడ “సాక్షి” ప్రస్తావన జర్నలిస్టుల జీవనస్థాయి వరకే పరిమితం చేస్తున్నా. ఇతర విషయాలు తర్వాత చర్చిద్దాం. “సాక్షి” కూడా “ఉదయం”లాగే “ఈనాడు”తో పోటీగా ప్రతి గడపకు చేరింది. అలాగే “ఈనాడు” వార్తల్లో రెండో కోణాన్ని “ఏదినిజం” పేరుతో “సాక్షి” చెప్పడం మొదలెట్టిన తర్వాత “ఈనాడు” తనదైన శైలిలో “ఇదే నిజం” అంటూ “సాక్షి”కి బదులిచ్చి తన అబద్ద అక్షర యుద్ధాన్ని చేపట్టింది. అయితే “సాక్షి” చేస్తున్న “ఏది నిజం” ముందు “ఈనాడు” చెప్పిన “ఇదే నిజం” ఎక్కువకాలం నిలబడలేకపోయింది. “ఏది నిజం” యుద్ధాన్ని “ఈనాడు” తన “అంతర్జాల” పత్రిక (Online Edition) లోకి మార్చేసింది. తోకముడిచింది అన్నారు “సాక్షి” వారు. కానీ, తోక మూడవలేదు, నాటినుండి నేటి వరకూ అబద్ద అక్షర యుద్ధం చేస్తూనే ఉంది.

ఉదయించిన సోషల్ మీడియా….

“కులపెద్ద” విశాఖలో కమ్యూనిస్టు సానుభూతిపరుడిగా మొదలు పెట్టిన అక్షర యుద్ధం కొద్దికాలంలోనే పెట్టుబడిదారుడిగా, కులపెద్దగా మారి సందర్భానుసారం చేసిన “అబద్ద అక్షర యుద్ధం” ఇప్పటికీ కొనసాగుతోంది. రెడ్లకు వ్యతిరేకంగా, మద్యానికి వ్యతిరేకంగా, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఇలా అక్షరం అయన చేతిలో అబద్ద యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడు అమరావతి రూపంలో… పట్టుమని రెండువేల మంది రైతులు, అదికూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిన పాలకుల ఆశతో భంగపడ్డ సాగుచేయని రైతులు, కౌలుకిచ్చిన భూస్వాములు, కొడుకులో, కూతుళ్ళో అమెరికాలోనో, బెంగుళూరులోనో ఉన్న వయోవృద్ధులు, 2015లో జీవనం కోల్పోయిన రైతుకూలీలు, కౌలురైతులకు సానుభూతి చెప్పని రియల్ ఎస్టేట్ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఇలా మొదటి పేజీల్లో, పతాక శీర్షికలో చెపుతూ, చూపుతూ అక్షరాలతో అబద్ద యుద్ధం చేస్తున్నారు.

సోషల్ మీడియా రూపంలో…..

కానీ “ఉదయం” పత్రిక ఇప్పుడు “సోషల్ మీడియా” రూపంలో వచ్చింది. ప్రతివాకిట్లో ఉన్న సోషల్ మీడియా రూపంలో ఉన్న “ఉదయం” పత్రిక, ప్రతి చేతిలో ఉన్న “ఆండ్రాయిడ్ ఫోన్” ఇప్పుడు దశాబ్దాలుగా సాగుతున్న అబద్ద అక్షర యుద్దాన్ని ఎత్తిచూపుతున్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు వార్తకు రెండో వైపు చెపుతోంది.

 

– దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్

Ravi Batchali
About Ravi Batchali 39319 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

3 Comments on అబద్ద అక్షరం… ఆయుధంగా మారి?

  1. చాలా బాగా రాశారు గోపీ గారు.. ఈనాడు మైకంలో పడి అటు చంద్రబాబు గారు, పాపం రాజధాని ప్రజలు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారు. కేవలం ఒక కులం వారు చేసే ఆందోళనలకు సామాన్య జనం స్పందించరు. అదే రాయలసీమ, ఉత్తరాంధ్రకు న్యాయం చేయని బాబు గార్ని ప్రశ్నించదు . ఈనాడు కాదు ఈనాయుడు అనిపించుకుంటోంది.

    • ఎలాంటి చేతగాని చెవలేని రాతలు రాసి ప్రజలచేత ఎవడు వెర్రి పుష్పం అనిపించుకున్నారు తప్ప వాస్తవాలు ఏమి కనిపించడం లేదు మీ రాతలో.
      బుద్ది ఉన్నవాడు ,భరితెగించే వాడు అని రెండు పాదాలకు తేడా లేదు అన్నట్లు ఉంది మీ పిచ్చి రాత ఎక్కడ,కుల గజ్జి చూపించాలి అంటే ఒకసారి ఇంట్లో కుర్చికో బయటికి వచ్చి చూసి ఎప్పుడు రాయి .నీ లాంటి మూర్ఖులు ఉన్నంతకాలం సమాజానికి ఉపయోగం ఏమి లేదు సోదరా,రాత ,మాట,మంచి , చెడ్డ,అని కొంచి దొంద మాటలు ఉన్నాయి కొంచం తెలుగు పరిజ్ఞానం పెంచి మాట్లాడితే మంచిది.
      ఎలాంటి వెర్రి రాతలకు సమాధానం ఎవ్వరూ ఎవ్వరూ ,నేను మీకు చెప్పడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం మనుకో నేనొట్ ఎలాంటి చిల్లర మాట.

Leave a Reply

Your email address will not be published.


*