“గేమ్” వీరిద్దరి మధ్యే…!!!!

rashtriya-janathadal-vs-janathadal-u

లోక్ సభ ఎన్నికల వేళ బీహర్ రాజకీయాల్లో మాటలు మంటలు చెలరేగుతున్నాయి. మైండ్ గేమ్ లు ప్రారంభమయ్యాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకే బీహార్ లో ఈసారి విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. బీహార్ లో రెండు కూటములు స్ట్రాంగ్ గా ఉన్నాయి. బీజేపీతో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యు జత కట్టింది. అలాగే కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రీయ జనతాదళ్ జట్టుకట్టింది.

ఇద్దరూ శత్రువులగా మారి…..

వచ్చే లోక్ సభ ఎన్నికలు రెండు కూటముల మధ్యే అయినా ప్రధాన పోటీ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు మధ్యనే ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహాగడ్బంధన్ లో భాగస్వామ్యులైన ఈ రెండు పార్టీలూ శత్రువులుగా మారారు. లాలూప్రసాద్ జైలులో ఉండటంతో ఇప్పుడు ప్రచారం, అభ్యర్థుల ఎంపిక బాధ్యత మొత్తం ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ చూసుకుంటున్నారు. లాలూ భార్య రబ్రీదేవి సయితం తన భర్తను ఏవిధంగా జైలుకు పంపారో ప్రచారంలో వివరిస్తున్నారు.

మైండ్ గేమ్ తో….

అయితే గత కొద్దిరోజులుగా బీహార్ లో ఈ రెండు పార్టీల మధ్య మైండ్ గేమ్ స్టార్టయింది. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మహాకూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తేజస్వియాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రిగా చేస్తానని నితీష్ కుమార్ ఒక ప్రతిపాదన తన ముందు ఉంచారని రబ్రీదేవి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఎన్డీఏ నితీష్ కుమార్ ను పట్టించుకోకపోవడంతోనే తమ పంచన చేరాలనుకుంటున్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీని జేడీయూలో విలీనం చేయాలంటూ తమ ఎదుట ప్రతిపాదన పెట్టారన్నారు.

సవాల్ కు ప్రతి సవాల్…..

కానీ ఇందుకు ప్రశాంత్ కిషోర్ ఖండించారు. నిజంగా తాను అని ఉంటే అందుకు ఆధారాలు చూపాలని, మీడియాలో లాలూ యాదవ్ తో బహిరంగ చర్చకు దీనిపై తాను సిద్ధమని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. మొత్తం మీద బీహార్ లో పట్టున్న రెండు పార్టీల మధ్య మైండ్ గేమ్ ప్రారంభమయింది. ఓటర్ల మనసును గెలుచుకునే వ్యూహంలో భాగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంుటన్నారన్నది వాస్తవం. అయితే ఈ మైండ్ గేమ్ కు రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉండటం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 20479 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.