
జనాభా ప్రాతిపదికన రిజర్వ్ డ్ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఇతరుల నిలబడే ఛాన్స్ లేదు. 2009 వరకూ జనరల్ నియోజకవర్గాలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలుగా మారాయి. అయితే అప్పటి వరకూ ఆ నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అగ్రకుల నేతలకు మాత్రం ఇది కంటగింపుగా తయారైంది. తమ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యే అయినప్పటికీ, తాము చెప్పినట్లుగానే ఎమ్మెల్యే నడుచుకోవాలన్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసి కొందరు తమ పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎమ్మెల్యే అభ్యంతరం చెబితే వెంటనే ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది.
బద్వేలు, కొడుమూరుల్లోనూ…..
ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ అప్పటి వరకూ ఆధిపత్యం చెలాయిస్తున్న వీరారెడ్డి తనయ విజయమ్మ సహించలేకపోయారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన జయరాములును టార్గెట్ చేసుకున్నారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి పనిలో తనకూ పర్సంటేజీలు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే జయరాములు విసుగు చెంది బహిరంగంగా విమర్శలు విజయమ్మపై చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిష్కరించారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ అయినప్పటికీ, అక్కడ పెత్తనమంతా విష్ణువర్థన్ రెడ్డి చెలాయించాలని చూస్తున్నారు. ఇక్కడ కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
రావెలపై కక్ష గట్టి……
ఇక మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు నియోజకవర్గం ప్రత్తిపాడును తీసుకుంటే అదే పరిస్థితి. రావెల ఉన్నతాధికారిగా విధులు నిర్వహించి రాజకీయాల్లోకి రావడం, వచ్చిన వెంటనే మంత్రి కావడంతో అక్కడ టీడీపీ అగ్రకుల నేతల మాటలను వినలేదు. తన సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది సహించలేని టీడీపీ నేతలు ఆయన పై దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. రావెల టీడీపీ కార్యకర్తలకు కాకుండా వైసీపీ కార్యకర్తలకు లబ్డి చేకూరుస్తున్నారని నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. అలా చేయలేదంటూ మొత్తుకుంటున్నా అధిష్టానం కనీసం విచారణ కూడా జరపకుండా రావెలను మంత్రి పదవి నుంచి తప్పించింది. ఇక తాజాగా తన నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి వెళ్లిన రావెల కిశోర్ బాబును సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. దీంతో రావెలకు చిర్రెత్తుకొచ్చి తన పీఏచేత వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు. దీనిని ఇప్పుడు ఆ పెద్దలు రాద్ధాంతం చేస్తున్నారు.చంద్రబాబు అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆయనకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిపోయారు.
శ్రావణ్ మాట వినడం లేదని……
అలాగే ఇదే జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్ కన్పిస్తోంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం, అదే నియోజకవర్గంలో రాజధాని రావడం ఆయనకు ప్లస్ అయింది. రైతులను భూసమీకరణకు ఒప్పించడంలో శ్రావణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్కడ ఏ సమస్య వచ్చినా ఇట్టే వాలిపోయే శ్రావణ్ కుమార్ కు అక్కడ వ్యతిరేకంగా పెద్ద గ్రూపే తయారైంది. శ్రావణ్ తమ మాట వినడం లేదని భావించిన జడ్పీ వైస్ ఛైర్మన్ పూర్ణచంద్రరావు వ్యతిరేకంగా గ్రూపును తయారు చేశారు.వచ్చే ఎన్నికల్లో శ్రావణ్ కు టిక్కెట్ ఇస్తే తాము పనిచేయబోమని ఆయన అధిష్టానానికి సంకేతాలు కూడా పంపారు. కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యేను పిలవకుండా విడిగా చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి పదే పదే చెప్పే చంద్రబాబు ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైనే పార్టీ నేతలు పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా నిరోధించలేకపోతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
Leave a Reply