
రాయపాటి సాంబశివరావు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ పేరు సుపరిచయమే! సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్లో రాజకీయాలు చేసిన రాయపాటి సాంబశివరావు.. వివాద రహితునిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో పేదలకు అందుబాటులో ఉండే నాయకుడిగా కూడా ఆయన పేరు గడించారు. దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలక పదవుల్లో ఉన్నా కూడా ఏనాడూ ఒక్కరూపాయి అవినీతి ఆరోపణ కానీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కానీ, విధేయత లేకుండా ప్రవర్తించారని కానీ, ఆయనపై ఎలాంటి ఆరోపణలూ లేవు. ఇక, గుంటూరు జిల్లాలో ఈ రాయపాటి కుటుంబానికి పెట్టింది పేరు. కాంగ్రెస్లో సుదీర్ఘ కాలంగా ఉన్న రాయపాటి.. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన టీడీపీలోకి చేరిపోయారు. ఎంపీ టికెట్ పొందారు.
పోటీకి దూరంగా ఉంటారా?
ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఆయన్ను టీడీపీ బోర్డు సభ్యుడిగా కూడా నియమించారు. ఇక, మరో పదిమాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటారా ? ఎన్నికల్లో కంటిన్యూ అవుతారా ? అన్నది క్లారిటీ లేదు. రాయపాటికి మళ్లీ పోటీ చేయాలన్న కోరిక ఉన్నా ఇప్పటికే ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండడంతో ఆయన ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక రాయపాటి వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి రెడీ అవుతోన్న ఆయన తనయుడు రాయపాటి రంగారావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
వారసుడికి గుర్తింపు……
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులుగా కూడా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయం కోసం బాగా కష్టపడుతున్నారు. ఇక, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రతి మీటింగ్కు అటెండ్ అవుతున్నారు. పార్టీలో రంగారావు కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పగించిన పనిని విధిగా పూర్తి చేయడంలోను, కార్యకర్తలను కలుపుకొని పోవడంలోనూ ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇక గోదావరి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం విషయంలో మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేకపోవడంతో ఆయన తక్కువ టైంలోనే టీడీపీలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు.
మూడు సీట్లపై కన్ను….
అయితే,వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎక్కడ నుంచి పోటీచేసేలా చంద్రబాబు నిర్దేశించనున్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆయన తండ్రి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావు పేట నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంది. జిల్లా అంతటా ఫాలోయింగ్ ఉండి, ఆర్థికంగానూ బలంగా ఉన్న ఈ ఫ్యామిలీ నరసరావుపేటను సులువుగానే గెలుచుకుని రాగలదనే ధీమా చంద్రబాబుతో పాటు పార్టీలో అన్ని వర్గాల్లోనూ ఉంది. నరసారావుపేట ఎంపీ సీటు కాని పక్షంలో జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సమీకరణలను బట్టి సీటు దక్కితే పోటీ చేయాలన్న ప్లాన్లో రంగారావు ఉన్నారు. గుంటూరు లోక్సభ సీటు పరిధిలో ఓ సీటుతో పాటు తన తండ్రి ఎంపీగా ప్రాథినిత్యం వహిస్తోన్న నరసారావుపేట పార్లమెంటు సీటు పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుందా ? అన్న అంశంపై రాయపాటి తన సన్నిహితులతో చర్చిస్తున్నారు.
Leave a Reply