
ఆయనను బాగా తెలిసిన వారు ఆత్మీయులు.. రాజకీయ భీష్ముడుగా పిలుచుకుంటారు. మరికొందరు రాజకీయ కురువృద్ధుడని అంటారు.దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన అనేక ప్రభుత్వాల సమయంలో పనిచేశారు. ఎలాంటి పెద్ద పెద్ద పదవులు అనుభవించకపోయినా.. అందరినీ తనకు అనుకూలంగా మార్చుకోవడంలోను, తన హవా సాగేలా చూసుకోవడంలోనూ తలపండిపోయారు. పైకి నిదానంగానే ఉన్నా.. తనపంతాన్ని నెగ్గించుకునేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయనే నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన 2014లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రచారంపై పెద్దగా….
2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి విజయం సాదించారు. ఇక, సతీవియోగ భారం, వృద్ధాప్యంతో ఉన్న ఆయనను పక్కకు పెట్టి తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ ను చేయాలని చంద్రబాబు భావించారు. అయితే, రాయపాటి మాత్రం తనకు ఎట్టిపరిస్థితిలోనూ నరసరావుపేట టికెట్ కావల్సిందేనని పట్టుబట్టారు. ఆయన వైసీపీలోకి వెళ్లిపోతున్నారన్న హింట్లు కూడా వచ్చాయి. చివరి నిముషంలో ఎక్కడ వైసీపీలోకి జారుకుంటారోనని భావించిన చంద్రబాబు.. వెంటనే టికెట్ ఇచ్చారు. అయితే, టికెట్ సంపాయించినా.. రాయపాటిలో నిర్వేదం వచ్చేసింది. వైసీపీ నుంచి యువ నేత పోటీకి నిలబడడం, తాను వృద్ధుడిని అయిపోవడంతో ఆయన ప్రచారం పై పెద్దగా దృష్టి పెట్టలేదు.
ఎమ్మెల్యేలు కూడా….
పైగా తన తరఫున వచ్చేందుకు కూడా ఎవరినీ ఆయన ఆహ్వానించలేదు. నేనే సీనియర్. మీరంతా జూనియర్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఈ నియోజకవర్గంలో పరిధిలోని కీలకమైన నాయకలు జీవీకానీ, యరపతినేని కానీ, కొమ్మాలపాటి కానీ ఎవరూ కూడా నియోజకవర్గంలో ఎంపీ గురించి ప్రచారం చేయలేదు. ఇక, సత్తెనపల్లిలోనూ తన కుమారుడికే ఈ టికెట్ కేటాయించాలని రగడం సృష్టించడంలో ఇక్కడ కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు, రాయపాటికి మధ్య ఎడం భారీ ఎత్తున పెరిగిపోయింది. దీంతో ఇక్కడ కూడా ఆయన గురించి పట్టించుకునే వారు కనిపించలేదు.
ఖర్చు విషయంలోనూ….
పైగా నిధుల ఖర్చు విషయానికి వచ్చే సరికి.. నాకే లేవు. నేనే నష్టాల్లో ఉన్నాను. మీరే ఏదైనా చేసుకోండి. నేను ఓడినా ఒకటే.. గెలిచినా ఒకటే అంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడడంతో ఎవరూకూడా రాయపాటిని పట్టించుకోలేదు. దీంతో పోలింగ్ అనంతర పరిణామాలను లెక్కలు వేస్తే.. ఇక్కడ నుంచి ఆయన హోరాహోరీ పోరులో ఓడిపోతున్నారన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. మాచర్ల, నరసారావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాలలో వైసీపీ ఆశలు పెట్టుకుంది. మొత్తానికి ఫార్టీ ఇయర్స్పైగా పొలిటికల్ ఇండస్ట్రీని నడిపిన రాయపాటి.. తన రాజకీయ అనుభవం అంత వయస్సులేని ఇంత ఘోరంగా ఓటమికి చేరువయ్యారని తెలిసి ఆయన అభిమానులు ఇప్పటికే బిక్కమొహం వేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply