
చరిత్రలో పల్నాటి యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాయకురాలు నాగమ్మ వర్సెస్ బ్రహ్మనాయుడు మధ్య జరిగిన ఈ యుద్ధం తరాలు మారినా.. శతాబ్దాలు గడిచినా తెలుగు చరిత్రలో ఎప్పటికి ప్రత్యేక స్థానం నిలుపుకుంది. ఆ తర్వాత పల్నాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పల్నాటి యుద్ధం ప్రస్తావన రాకుండా ఉండదు. గురజాల, మాచర్ల, నరసారావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే పల్నాటి యుద్ధం ప్రస్తావన సహజంగానే ఉంటుంది. తాజాగా నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు పోటీ చేసిన సత్తెనపల్లిలో ఇప్పుడు టీడీపీలోనే జరిగిన అంతర్గత యుద్ధం పల్నాటి యుద్ధాన్ని తలపించేలా ఉంది. ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు తిరిగి సీటు ఇచ్చే విషయంలో సొంత పార్టీలోనే హైవోల్టేజ్ వాతావరణం క్రియేట్ అయ్యింది. కోడెలకు తిరిగి సీటు ఇవ్వొద్దని సత్తెనపల్లి టీడీపీ ఆఫీస్‌లోనే నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున నిరసనకు దిగాయి. చివరకు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ర్యాలి చెయ్యడం కూడా సంచలనం రేకెత్తించింది.
రాయపాటి కోరినా….
తీవ్ర సంక్లిష్ట పరిస్థితుల్లో కోడెల తిరిగి సత్తెనపల్లి సీటు దక్కించుకుని అక్కడ నుంచి పోటీ చేశారు. చివరకు పోలింగ్ రోజున కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలకు ముందు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు కోసం రాయపాటి ఫ్యామిలీ కూడా పావులు కదిపింది. సీనియర్ నేత, నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తన కుమారుడు కోసం సత్తెనపల్లి సీటును దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. కోడెల నరసారావుపేటకు మారితే సత్తెనపల్లి నుంచి రాయపాటి రంగారావు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. నరసారావుపేటలో తాను పోటీ చేస్తే మళ్లీ ఓటమి తప్పదని డిసైడ్ అయిన కోడెల చివరకు అటు తిరిగి ఇటు తిరిగి సత్తెనపల్లి నుంచే పోటీ చేసి పోలింగ్‌కు ముందే సొంత పార్టీ నుంచే తీవ్రమైన వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. ఇంటర్నల్ సమాచారం ప్రకారం గత ఐదేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ నిధులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంలో రాయపాటిని చేసుకోనివ్వకుండా ఆ నిధులతో చేసే పనులు సైతం కోడెల చేసేసుకున్నారు.
అడ్డం తిరిగిన రాయపాటి….
ఇప్పుడు ఎన్నికల వేళ కోడెల ఎంపీ అభ్యర్థి రాయపాటిని తన నియోజకవర్గానికి అమౌంట్ సర్దుబాటు చెయ్యాలని అడగగా అందుకు రాయపాటి ఐదేళ్ల పాటు తన నిధులతో చేపట్టిన పనులు సైతం నువ్వే చేసుకున్నావు… ఇప్పుడు నీకెందుకు డబ్బులు ఇవ్వాలని ఎదురు ప్రశ్న వేసినట్టు తెలిసింది. దీంతో కోడెల తాను కేవలం ఎమ్మెల్యే ఓటు మాత్రమే అడుగుతానని రాయపాటిని బెదిరించినట్టు తెలిసింది. అయితే అవేమీ లెక్క చెయ్యని రాయపాటి తన పని తాను చేసుకుపోయారు. ప్రచారంలో మిగిలిన నియోజకవర్గాల్లో బాగా తిరిగిన ఆయన సత్తెనపల్లిని పెద్దగా పట్టించుకోలేదు. చివరకు కోడెల తన వర్గంలో కొంత మందికి ఎమ్మెల్యే ఓటు మాత్రం తనకు వేసి… ఎంపీ ఓటు లావు శ్రీకృష్ణదేవరాయాలకు వేయాలని చెప్పినట్టు కూడా సత్తెనపల్లిలో ప్రచారం జరిగింది. అయితే కోడెలను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ శ్రేణుల్లో మెజారిటీ వర్గాలు ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసి ఎంపీ ఓటు మాత్రం రాయపాటికి వేసినట్టు తెలిసింది.
క్రాస్ ఓటింగ్ తో….
కోడెలపై తీవ్రంగా కక్ష కట్టిన సత్తెనపల్లి టీడీపీ శ్రేణులు రివర్స్ రివేంజ్ తీర్చుకున్నారన్న చర్చ నడుస్తోంది. సత్తెనపల్లి పట్టణంలో గత ఐదేళ్లలో కోడెల కుమారుడి తీరుతో విసికిపోయిన ఓ ప్రధాన సామాజికవర్గం ఎమ్మెల్యే ఓటు అంబటి రాంబాబుకు వేసి ఎంపీ ఓటు రాయపాటికి వేసినట్టు తెలుస్తోంది. రాయపాటి వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అలాంటప్పుడు తాము రాయపాటిని ఎందుకు వదులుకోవాలని కూడా వాళ్లు చర్చించుకున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో కోడెల కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధిస్తే ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన రాయపాటికి 2,300 ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి ఈ సారి ఈ ఇద్దరి యుద్ధంలో సత్తెనపల్లి ఓటరు ఇద్దరికి సమానంగా ఓటు వేశాడా ? లేదా టీడీపీ తరపున వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఓట్లు రాబడతారన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్‌గా ఉంది.
Leave a Reply