రాయపాటి ట్రిక్కులు పనిచేయవా…??

rayapatisambasivarao-telugudesamparty

నరసరావుపేట పార్లమెంటు స్థానం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని వరుసగా రెండు ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటూ వస్తుంది. 2009లో నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలవగా, 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మరోసారి రాయపాటి సాంబశివరావు నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు ఆసక్త కనబరుస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పేరు బలంగా విన్పిస్తుంది.

ఓట్ల పరంగా చూస్తే…..

గత ఎన్నికల పరంగా చూస్తే అప్పుడు తెలుగుదేశం, బీజేపీ కలసి పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడంతో రాయపాటి సాంబశివరావు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిపై కేవలం 35 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి 49.33 శాతం ఓట్లు రాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 46.58 శాతం ఓట్లు లభించాయి. పార్లమెంటు ఎన్నికల పరంగా చూస్తే ఇది స్వల్ప ఆధిక్యత అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి వెంకటేశ్వర్లుకు 1.79 ఓట్లు శాతం పోలయ్యాయి. ఈసారి ఈ నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలోకి దిగనున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై…..

నరసరావు పేట పార్లమెంటు స్థానం పరిధిలో పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో నరసరావుపేట, మాచర్ల అసెంబ్లీ స్థానాలు మినహాయించి మిగిలిన నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీయే గెలిచింది. అప్పుడు ఎమ్మెల్యేలకు పోలయిన ఓట్లలో కొంత ఎంపీ అభ్యర్థికి పడకపోవడం విశేషం. క్రాస్ ఓటింగ్ జరిగింది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. నరసరావు పేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో వైసీపీ కొంత పుంజుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశముంది.

అంత సులువు కాదంటూ…..

నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రాయపాటి సాంబశివరావుకు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదు. ఎంపీ ల్యాడ్స్ నిధులు రాయపాటి తనకు నచ్చిన ప్రాంతంలోనే వెచ్చిస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. పైగా రాయపాటిని కలవాలంటే గుంటూరుకు రావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. దీంతో రాయపాటి సాంబశివరావుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. గుంటూరు నుంచి నరసరావు పేటకు మారడం రాయపాటికి సుతారమూ ఇష్టం లేదు.అయితే అక్కడ గల్లా జయదేవ్ ఉండటంతో మరోసారి నరసరరావు పేట నుంచి తన అదృష్టాన్ని రాయపాటి పరీక్షించుకుంటున్నారు. వైసీపీ సరైన అభ్యర్థిని బరిలోకి దింపితే గెలవడం అంత కష్టమేమీ కాదన్నది పరిశీలకుల అభిప్రాయం.

Ravi Batchali
About Ravi Batchali 37796 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*