రేవంత్ …నీకేమైంది….?

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారా? కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు ఇంకా పాత వాసనలు పోలేనట్లుంది. ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఇంకా మర్చిపోలేనట్లుంది. అందుకే ఆయన పదే పదే చంద్రబాబును పొగుడ్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కొద్దినెలల క్రితం పార్టీని వీడి హస్తం పార్టీలోకి వెళ్లిన సంగతి తెలసిందే. పార్టీ మారే సమయంలోనూ ఆయన స్వయంగా అమరావతికి వెళ్లి మరీ చంద్రబాబుకు చెప్పి వచ్చారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకే ఇచ్చి వచ్చారు.

ఆయన వ్యాఖ్యలు…..

అయితే ఇంతవరకూ రేవంత్ రాజీనామా ఏమైందో ఎవరికీ తెలియదు. ఆయన రాజీనామా తమకు చేరినట్లు స్పీకర్ కార్యాలయం ధృవీకరించలేదు. చంద్రబాబు కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించనట్లుంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లోనే నేతగా కొనసాగుతూ చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే గాంధీభవన్ నేతలు నోళ్లు వెళ్లబెట్టాల్సి వస్తుందట. ఇటీవల జరిగిన కొన్ని సభల్లో కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసమే పుట్టిందని ఆయన చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తాజాగా ఓటుకు నోటు కేసులో….

ఇక తాజాగా ఓటుకు నోటు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించడంతో ఆయన మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అంతవరకూ బాగానే ఉంది. కాని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడమే బాగాలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నది రేవంత్ ఆరోపణ. తన వరకూ చెప్పి ఉంటే బాగుండేది. కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల బీజేపీతో విడిపోవడంతోనే కేసీఆర్ కమలం పార్టీతో కలిసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ముఖ్యమంత్రి బయటకు రాగానే కేసీఆర్ ఓటుకు నోటు కేసును తిరగదోడారన్నది రేవంత్ ఆరోపణ. చంద్రబాబు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లి ఆందోళన చేస్తుంటే బీజేపీతో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న కేసీఆర్ చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారని రేవంత్ అనడాన్ని కాంగ్రెస్ నేతలే తప్పుపడుతున్నారు. మొత్తంమీద రేవంత్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఏపీలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబు సర్కార్ పై దుమ్మెత్తి పోస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ప్రశంసలు కురిపించడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 37794 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*