రేవంత్ రెడ్డి హిట్ అయితే… ?

రేవంత్ రెడ్డి

ఒక విధంగా కాంగ్రెస్ తెలంగాణాలో అతి పెద్ద ప్రయోగమే చేసింది. మూడేళ్ల క్రితం వరకూ అదే పార్టీని తిడుతూ టీడీపీలో ఉన్న‌ నేతను తీసుకువచ్చి ఏకంగా పీసీసీ చీఫ్ ని చేసేసింది. అయితే పక్క పార్టీ, కొత్త నేత అన్న తేడాలు లెక్కలు చూస్తూ కూర్చుంటే తెలంగాణాలో కాంగ్రెస్ నావ పూర్తిగా మునగడం ఖాయమని ఆ పార్టీకి తెలుసు. అందుకే ఉన్నంతలో నలుగురిని కూడగట్టే నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కి పగ్గాలు అప్పగించింది. రేవంత్ కి అసలే నోటి ధాటి ఎక్కువ. ఇక పదవి ఇచ్చాకా ఊరుకుంటారా. సీమ టపాకాయల్లా మాటల తూటాలు పేలుస్తున్నారు.

కొత్త ఉత్సాహం ……

కాంగ్రెస్ లో నాయకులకు కొదవ లేదు. కానీ తమ సొంత ఊరు నుంచి పక్క ఊరుకి వెళ్ళేసరికి వారు పరాయి వారిగా మారిపోతారు. అలాంటి స్థితిలో తెలంగాణాలో అన్ని ప్రాంతాలకు తెలిసిన నేతగా, చక్కని వక్తగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన పంచ్ డైలాగులకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రేవంత్ కి సరిగ్గా ఉపయోగించుకుంటే ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం రావడం ఖాయం. ముఖ్యంగా టీయారెస్ మీద విసుగెత్తి ఉన్న జనాలలో ఆయన ఆశలు రేకెత్తిస్తే పరిణామాలు మారినా ఆశ్చర్యం లేదు.

ఆ వైపు ఊపు ….

ఇక ఏడేళ్ల క్రితం వరకూ ఒకే రాష్ట్రంగా ఉన్న ఏపీ తెలంగాణాలలో రాజకీయాలు కూడా ఒకే తీరున సాగుతాయి అంటారు. తెలంగాణాలో కాంగ్రెస్ కనుక ఏ మాత్రం పుంజుకుంటే మాత్రం ఆ ప్రభావం తప్పకుండా ఏపీ మీద కూడా పడుతుంది అంటున్నారు. తెలంగాణాలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ జెండాను రెపరెపలాండించడంలో రేవంత్ రెడ్డి కనుక సక్సెస్ అయితే ఏపీ కాంగ్రెస్ కి కూడా హుషార్ వస్తుంది అని అంటున్నారు. విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కదలికల మీద ఏపీ పాలిటిక్స్ కూడా ఇపుడు ఆసక్తిని ప్రదర్శిస్తోంది అనే చెప్పాలి.

రెడీ అంటున్న రెడ్లు …

జగన్ కోసం ఒకనాడు రెడ్లు అంతా ఏకమయ్యారు. ఆయన ఏపీ సీఎం కావాల్సిందే. మా హవా సాగాల్సిందే. రెండవ మాట లేదు అని నాడు పంతం పట్టారు. ఇపుడు కూడా రేవంత్ రెడ్డి విషయంలో అలాంటి పరిస్థితి వస్తుందా అంటే రావచ్చు అన్న వారూ ఉన్నారు. తెలంగాణాలో రెండు దఫాలుగా అధికారం కోల్పోయింది కాంగ్రెస్. దాంతో రెడ్లు రాజకీయంగా ఎక్కువగా నష్టపోయారు. ఇపుడు రేవంత్ కనుక జెండా ఎత్తితే అన్ని విధాలుగా సాయం చేయడానికి ఆ సామాజికవర్గం ముందుంటుంది అంటున్నారు. ఏపీ రెడ్లు కూడా చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు అన్న మాటా ఉంది. మరి రేవంత్ రెడ్డి మీద ఒక అనుమానం ఉంది. ఆయన చంద్రబాబు శిష్యుడు అని, టీడీపీ అనుకూల మీడియాకు ఆప్తుడు అని. ఆ విషయంలో సందేహాలు కనుక తీరితే రేవంత్ హిట్ అవుతారు అంటున్నారు. మరి ఆయన విజయం ఏపీ మీద ఏ మాత్రం ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా అంచనా వేసే పనిలో రాజకీయ నేతలు బిజీగా ఉన్నారట.

Ravi Batchali
About Ravi Batchali 41248 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*