
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు తయారయ్యాయి. ఇప్పటికే ఐటీ దాడులు, విచారణతో పాట్లు పడుతున్న ఆయనకు ఇప్పుడు టిక్కెట్ల పంచాయతీ చుట్టుకుంది. తనను నమ్మి తనతో వచ్చిన వారికి టిక్కెట్లు ఇప్పించుకోవాల్సిన బాధ్యత తలకెత్తుకున్న ఆయన ఢిల్లీ బాట పట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కలుస్తూ ఆయన తన మనుషులకు టిక్కెట్లు దక్కేలా కష్టపడుతున్నారట. ఓవైపు టిక్కెట్లు ఎంపిక చేసేందుకు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంటే రేవంత్ ఢిల్లీలోనే పనులు చక్కబెట్టుకోవాలని నిర్ణయించి ఫ్లైట్ ఎక్కేశారు.
అధిష్ఠానం దృష్టిలో ఉండటంతో…
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే సమయంలో రేవంత్ రెడ్డి వెంట కొందరు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ముఖ్యంగా సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయరామారావు, తోటకూర జంగయ్య రాజారామ్ యాదవ్ వంటి సుమారు 15 మంది నేతలు ఉన్నారు. వీరికి టిక్కెట్లు ఇప్పించే బాధ్యత తనదే అని రేవంత్ అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటం.. రేవంత్ అనుచరగణం పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ఆశావహులు ఉండటంతో వారంతా రేవంత్ పై టిక్కెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో ఆయన గాంధీ భవన్ లో పని కాదని, ఢిల్లీ బాట పట్టారు. పార్టీలో చేరి కొన్ని నెలలే అయినా రేవంత్ రెడ్డి అధిష్ఠానం దృష్టిలో బాగానే పడ్డారు. కాంగ్రెస్ ముఖ్యనేతలతో పరిచయాలను పెంచుకున్నారు. ఈ పరిచయాలు ఉపయోగించుకుని ఆయన టిక్కెట్ల వేటలో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యనేత జైపాల్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారా కూడా రేవంత్ అధిష్ఠాన పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నింటా టిక్కెట్ల లొల్లి…
రేవంత్ రెడ్డి వర్గంగానే ఉన్నా కంచర్ల భూపాల్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు వంటి వారు కాంగ్రెస్ లో చేరలేదు. వారి నియోజకవర్గాల్లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఉండటంతోనే వారి దారి వారు చూసుకున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరిన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క అదే టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య కూడా బరిలో ఉంటానంటున్నారు. అయితే, ఈ ఒక్క సీటు మాత్రం రేవంత్ వర్గానికే అంటే సీతక్కకు దక్కే అవకాశం ఉంది అంటున్నారు. ఇక వేం నరేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మేడ్చల్ స్థానం నుంచి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన రేవంత్ వర్గం నేత తోటకూర జంగయ్య యాదవ్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకోగా… అక్కడ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, ఉద్దెమర్రి నరసింహారెడ్డి, స్కైలాబ్ రెడ్డి టిక్కెట్ పై ఆశతో ఉన్నారు. ఇలా రేవంత్ వర్గంలో ఒకరిద్దరి స్థానాలు తప్పించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల పోటీ ఉంది. దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. తనను నమ్ముకుని వచ్చిన వారికి సాధ్యమైనంత మందికి టిక్కెట్లు ఇప్పించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక రేవంత్ కు ఇప్పటికే ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు టిక్కెట్ల విషయంలో ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
Leave a Reply