రోజా విక్టరీ గ్యారంటీనా?

అక్కడ గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఉన్నారు. అయినా అధికార తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆ బెంగ ఏ మాత్రం కనపడటం లేదు. విభేదాలతో వీధులకెక్కే పరిస్థితికి వచ్చారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుదేశం తరుపున గాలి ముద్దుకృష్ణమనాయుడు నిన్న మొన్నటి వరకూ ఉండేవారు. ఆయన మరణంతో ఆయన వారసులు రంగంలోకి దిగారు. ఇక వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఆర్ కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా నిత్యం రోజా నగరిలోనే మకాం వేస్తూ ప్రజలతో మమేక మవుతున్నారు. కాని గాలి ముద్దు కృష్ణమ కుటుంబంలో టిక్కెట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. గాలి సతీమణి సరస్వతమ్మ ప్రకటన ఆ ఫ్యామిలీలో చిచ్చురేపిందంటున్నారు.

ఫ్యామిలీలో చిచ్చు…..

గాలి మరణంతో ఆయన ఫ్యామిలీలో వారసత్వం చిచ్చురేగింది. గాలి ముద్దుకృష్ణమకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ముగ్గురు వ్యాపార రంగంలో బాగా స్థిరపడిన వారే. అయితే తండ్రికి చేదోడువాదోడుగా ఇద్దరు కుమారులు గాలి జగదీష్, గాలి భాను ప్రకాష్ లు ఉండేవారు. నగరి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను ఇద్దరూ చూసుకునే వారు. గాలి మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ అన్నదమ్ముల మధ్య వాదన జరగడంతో చివరకు చంద్రబాబు గాలి సతీమణి సర్వతమ్మకు ఆ పదవి ఇచ్చి అప్పట్లో ఆ గొడవను సర్ది చెప్పారు.

సరస్వతమ్మ ప్రకటనతో…..

అయితే తాజాగా మరోసారి గాలి కుటుంబంలో చిచ్చు రేగింది. ఇటీవల గాలి సతీమణి సరస్వతమ్మ ముద్దుకృష్ణమ వారసుడు జగదీష్ అని, అతడిని ఆశీర్వదించాలని చేసిన ప్రకటన ఇటు పార్టీలోనూ, అటు గాలి కుటుంబంలోనూ ప్రకంపనలను సృష్టించింది. నిజానికి గాలి భానుప్రకాష్ కు పార్టీలో పట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరి నుంచి లోకేష్ వరకూ భాను ప్రకాష్ కే మద్దతు తెలుపుతున్నారు. పార్టీలో ఆయన చేస్తున్న కృషిని, నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్న తీరును చూసి భానుకే వచ్చే అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది.

పునరాలోచనలో అధిష్టానం……

కాని సరస్వతమ్మ ప్రకటనతో అధిష్టానం సయితం ఇరకాటంలో పడింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడిపై స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈ సీటును ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి గాలి కుటుంబంలో మనస్పర్థలు చికాకులు తెప్పిస్తున్నాయి. జగదీష్ కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు కుమార్తెను వివాహం చేసుకున్నారు. దీంతో మామ వైపు నుంచి కూడా జగదీష్ కు సపోర్ట్ ఉంది. ఇక భానుకు నియోజకవర్గంలోనూ, పార్టీలోనూ పట్టు ఉండటంతో ఎవరికి టిక్కెట్ కేటాయించినా మరొకరు సహకరించరన్న అనుమానం పార్టీ అగ్రనాయకత్వంలో వ్యక్తమవుతుంది. మరి చంద్రబాబు ఈ పంచాయతీకి ఎలాంటి ముగింపు నిస్తారోచూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 22373 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*