
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్.కె.రోజాను ఓడించాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. రోజా వాయిస్ అసెంబ్లీలో కన్పించకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. అందుకోసం నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. నగరిలో తెలుగుదేశం పార్టీ తరుపున గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ రోజా కేవలం 700 ఓట్ల మెజారిటీతోనే గెలవడంతో ఈసారి గెలుపు తమకు ఖాయమని తెలుగుతమ్ముళ్లు బాహాటంగా చెప్పేసుకుంటున్నారు.
మాయా వ్యూహం…..
రోజా ఓటు బ్యాంకు కు గండికొట్టేందుకు మాయా వ్యూహాన్ని పన్నారు. నగరి నియోజకవర్గంలో అంతకు ముందు కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుందనే చెప్పాలి. గాలి ముద్దు కృష్ణమనాయుడికి ఉన్న ఫేమ్ ఆయన తనయులకు లేదు. పైగా గాలి కుటుంబంలో విభేదాలు రోజాకు సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో రోజా గెలవకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిని బరిలోకి దించారంటున్నారు. జనసేన పార్టీ నగరిలో అభ్యర్థిని నిలపకుండా బీఎస్పీకి ఈసీటును కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
ఎస్సీ ఓటర్లే లక్ష్యం…..
నగరి నియోజకవర్గంలో మొత్తం 1.90 లక్షల మంది ఓటర్లుండగా ఇందులో ఎక్కువ భాగం మొదలియార్లదే. వీరు డెబ్బయి వేల వరకూ ఉంటారని అంచనా. వీరి తర్వాత స్థానం షెడ్యూల్ కులాలకు చెందిన వారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు కలిపి దాదాపు నలభై నుంచి యాభై వేల మంది వరకూ ఉండొచ్చు. తర్వాత స్థానం క్షత్రియ సామాజిక వర్గానిది. వీరు పాతికవేల వరకూ ఉండొచ్చు. గత ఎన్నికల్లో రోజా విజయం సాధించడానికి ఎస్సీ, ఎస్టీ ఓటర్లే ప్రధాన కారణమంటారు. ఈసారి బీఎస్పీని బరిలోకి దింపి వైసీపీ ఓటు బ్యాంకు కు గండికొట్టాలన్నది జనసేన, టీడీపీ ఆలోచనగా కన్పిస్తుంది.
గండి కొడతారా…??
రోజా పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటంతో పవన్ ఈసీటును బీఎస్పీకి ఇచ్చారంటారు. బీఎస్పీ తరుపు ప్రవల్లిక బరిలో ఉన్నాు. విద్యావంతురాలైన ప్రవల్లిక ప్రచారంతో హోరెత్తించారు. ఎస్సీ ఓట్లను గణనీయంగా తమవైపు తిప్పుకునేందుకే బీఎస్పీ ఇక్కడ ప్రయత్నిస్తుంది. ఇది టీడీపీకి అడ్వాంటేజీగా మారొచ్చనే లెక్కలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద రోజా గెలవకూడదని అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భావిస్తున్న కారణంగానే ఎస్సీ ఓట్ల చీలిక కోసం బీఎస్పీ అభ్యర్థిని బరిలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ మాయాగండం నుంచి రోజా బయటపడతారో? లేదో? చూడాలి.
Leave a Reply