బలమున్నోడికే సీటు

ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ బస్సెక్కాలనుకుంటున్నారా……. అయితే మీకు బలం కావాల్సిందే. బలమున్నోడికే అక్కడ సీటు దొరుకుంది. నిత్యం లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే హైదరాబాదులోని వివిధ బస్ స్టేషన్లలోని పరిస్థితి ఇది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడు రోజులుగా సాగుతుంది. వేలాది బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా తీసుకుని బస్సులను నడుపుతోంది. అయితే ఇవి ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. బస్ స్టేషన్లలో సమ్మె ప్రభావం వల్ల రిజర్వేషన్ సౌకర్యం లేకపోవడంతో నరకం అవుతోంది. ఫ్లాట్ ఫాంపైకి బస్సురాగానే ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టి సీట్ల కోసం పరిగెడుతున్నారు. కిటీకీలోంచి రుమాళ్లు, బ్యాగులు వేసి సీట్లు ఆపుకుంటున్నారు. బలం ఉన్న వారికే సీట్లు దొరుకుతున్నాయి. ఎవరు ముందు పరిగెట్టి సీటు ఆపుకుంటే వారే కూర్చోగలగుతున్నారు.

నిరీక్షణ తప్పదు…..

చంటిపిల్లలు, వయోవృద్ధులు పరిగెత్తలేక బస్సులు ఎక్కలేకపోతున్నారు. గంటల తరబడి నిలబడి బస్సు ప్రయాణం చేయాలంటే మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీలో సిబ్బంది లేకపోవడంతో వీరిని నియంత్రించలేకపోతున్నారు. గతంలో (సమ్మె లేని సమయంలో) ముందుగానే బస్ టిక్కెట్ ఇచ్చేవారు. ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు టిక్కెట్లు ఇచ్చిన తరువాత వచ్చే ప్రయాణికులకు సీట్లు లేవని చెప్పేవారు. నిలబడి ప్రయాణం చేస్తామనే వారికి టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఎవరి దారి వారిదవుతుంది. దీంతో అనేక మంది మహిళలు, వృద్ధుల ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు.

కుక్కేస్తున్నారు……

ఇక బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి మినీ బస్సులు, మ్యాక్సీ టెంపోలు నడుపుతున్నారు. దీంట్లో కూడా సామర్థ్యం కంటే ఎక్కువ ప్రయాణికులను తీసుకువెళ్తున్నారు. ఒక్కసీట్లో ముగ్గురు కూర్చోవాల్సి ఉండగా అయిదుగురు, ఆరుగురిని కుక్కేస్తున్నారు. దీంతో ప్రయాణికులు సతమతమవుతున్నారు. అంతే కాకుండా సాధారణ ఛార్జీలకంటే రెండింతలు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగకు తప్పకుండా వెళ్లాల్సిన ప్రయాణికులు ఊసురుమంటూ వెళ్ల్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*