
విశాఖ మాజీ మేయర్ గా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలంపాలు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన సబ్బం హరి కొత్త పార్టీ తీర్ధానికి సిద్ధం అయ్యారు. అయితే రెండు ప్రధాన పార్టీలు తనకు ఆఫర్లతో రెడీ అయ్యాయని అంటూ ఆయన తన అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఈ రెండు ప్రధాన పార్టీల్లో ఎదో ఒక పార్టీలోకి సబ్బం మరోసారి జంప్ అవ్వడం దాదాపు ఖాయమనే అంటున్నారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో తనదైన మార్క్ ను హరి చూపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీల్లో ఒకరైన సబ్బం హరి గత ఎన్నికల్లో చివరిదాకా పోరాటం చేసి వైసిపిలో చేరిపోయారు.
జగన్ కి అత్యంత సన్నిహితంగా …
వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుండగా ఆయనతో సబ్బం హరి ఎంత సన్నిహితంగా ఉండేవారో అందరికి తెలిసిందే. ఆ తరువాత వైఎస్ తనయుడు స్థాపించిన వైఎస్ ఆర్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఇద్దరి నడుమ తేడా రావడంతో వైసిపి కి గుడ్ బై కొట్టేశారు. గత ఎన్నికలముందు సమైక్యాంధ్ర పార్టీ తరుపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన చివరిక్షణంలో పోటీ నుంచి వైదొలిగారు. ఆ ఎన్నికల్లో టిడిపి ని గెలిపించాలని బహిరంగ పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా వైఎస్ విజయమ్మ పరాజయం కోసం పనిచేశారు. గత నాలుగేళ్లుగా సబ్బం పరిస్థితులను గమనిస్తూ క్రీయాశీలక రాజకీయాలకు దూరంగానే వుంటూ వచ్చారు.
టిడిపినా ..? జనసేనా …?
ఆయన ముందు ఇప్పుడు రెండే అవకాశాలు మిగిలివున్నాయి. ఒకటి అధికార టిడిపి పార్టీ తీర్ధం. రెండు కొత్తగా వచ్చిన జనసేన. ఇక వైసిపికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఈ రెండుపార్టీల్లో ఏది బెటర్ అనే ఆయన తీవ్ర ఆలోచనలో పడ్డారు. టిడిపికి గ్రాఫ్ పడిపోతున్నా అంగబలం, అర్ధబలం వున్న పార్టీకావడంతో ఆవైపుగా వెళతారని కొందరు భావిస్తున్నారు. ఇక జనసేన విధి విధానాలు, సిద్ధాంతాలు పార్టీ గుర్తు ఇప్పటికి ప్రకటించబడలేదు. ఈ నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు నష్టం తెచ్చిపెడతాయని, కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో సబ్బం ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టత రాలేదు. కొసమెరుపుగా తాను ఏ పార్టీలో చేరినా అభిమానులు అర్ధం చేసుకుని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. సబ్బం.
Leave a Reply