షాట్ గన్ పేలుతుందా…?

sathrughnasinha bihar politics

శతృఘ్న సిన్హా….నిన్న మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శతృఘ్న సిన్హా ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. తనకున్న సినీ స్టార్ డమ్ కు తోడు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు, గత ఎన్నికల్లో మోదీకి ఉన్న ఇమేజ్ ఆయన గెలుపునకు దోహద పడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే శతృఘ్న సిన్హా ఈసారి కాంగ్రెస్ పార్టీలో చేరి మహా గడ్బంధన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి ఆయన గెలుపు సాధ్యమవుతుందా? లేదా? సినీ ఇమేజ్ ఈసారి కూడా పనిచేస్తుందా? అన్నదే చర్చ.

పార్టీలోనే ఉంటూ….

శతృఘ్న సిన్హా బీజేపీ ఎంపీగా ఉంటూ ఆయన పార్టీ మీదనే విరుచుకుపడేవారు. పార్టీ అనేకంటే ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల మీదనే ఎక్కువగా విరుచుకుపడే వారు. నోట్ల రద్దు, జీఎస్టీవంటి అంశాలను బీజేపీలోనే ఉండి వ్యతిరేకించారు. బీజేపీ నుంచి దూరమైన మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హాతో కలసి ఆయన మోదీ, షాలపై చేసిన విమర్శలు పార్టీకి ఇబ్బందిని కలిగించాయనే చెప్పాలి. అయితే పార్టీ ఆయనపై ఎటువంటి చర్యలకు దిగకపోవడం వ్యూహాత్మకమే. ఒకబలమైన సామాజిక వర్గం దూరమవుతుందనే ఏకైక కారణంతో శతృఘ్న సిన్హాపై చర్యలకు దిగలేదంటారు.

హేమాహేమీలు….

ఇప్పుడు బీహార్ లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు. ఆయన మహాగడ్బంధన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. దీంతో పోటీ నువ్వా? నేనా? అన్నట్లు తయారయింది. ఇద్దరూ ఇమేజ్ ఉన్న నేతలే కావడంతో పాట్నా సాహిబ్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. శతృఘ్న సిన్హా, రవిశంకర్ ప్రసాద్ లు ఒకే సామాజిక వర్గం వారే. ఇద్దరూ క్షత్రియులే. దీంతో ఈ సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.

బలాబలాలు….

నిజానికి పాట్నా సాహిబ్ నియోజకవర్గం బీజేపీకి అండగా నిలుస్తూ వస్తోంది. ఇక్కడ అగ్రవర్ణాలు ఎక్కువ. 28 శాతం ఉన్న అగ్రవర్ణాలు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటారు. గత ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం, ఆర్జేడీకి 23 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి మహాగడ్భంధన్ తరుపున పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఉన్న క్షత్రియుల ఓట్లతో పాటు యాదవులు, ముస్లింల ఓట్లు తన గుర్తుపైనే పడతాయని శతృఘ్నసిన్హా గట్టిగా విశ్వసిస్తున్నారు. తన భార్య పూనమ్ సిన్హా సమాజ్ వాదీ పార్టీ లో చేరడం వెనక కూడా యాదవ ఓట్లు తనకు అనుకూలంగా పడతాయన్న కారణమేనంటున్నారు. అయితే రవిశంకర్ ప్రసాద్ మాత్రం మోదీ క్లీన్ ఇమేజ్ తో పాటు తనకున్న ప్రతిష్ట గెలిపిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం మీద శతృఘ్న సిన్హా ఈసారి గెలుపు అంత సులువు కాదన్నది విశ్లేషకుల అంచనా.

Ravi Batchali
About Ravi Batchali 19220 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*