
ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతున్నాయి. అధికారపార్టీ లో ఇప్పటికే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. వైసీపీ నుంచి వచ్చి చేరినవారితో కలిపి 125 స్థానాల వరకూ పాత అభ్యర్థులు తమకే టిక్కెట్టు అన్న భరోసాతో ఉన్నారు. పైకి చూస్తే మరో 50 స్థానాలు మాత్రమే ఖాళీ. అందులోనూ చాలా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నవారు చాలామందే ఉన్నారు. అందువల్ల అతి తక్కువ మందిని ఎంచుకునే అవకాశమే టీడీపీకి లభిస్తుంది. అయితే అనేక సమీకరణల్లో టీడీపీ పార్టీయే ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా అభ్యర్థుల తాకిడి ఎక్కువగా ఉంది. కొంతలో కొంత స్వేచ్ఛగా ఉన్నపార్టీగా జనసేనను చెప్పుకోవాలి. బీజేపీ తరఫున పోటీపడుతున్నవారికి గెలుపుపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ జాతీయ స్థాయి ప్రాపకం కోసం బరిలో నిలవాలనుకుంటున్నారు. కాంగ్రెసు పార్టీ కి ఈవిషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. అవకాశం వస్తే అటు టీడీపీ, ఇటు వైసీపీ వైపు జంప్ కావాలని చూస్తున్న నాయకులే కాంగ్రెసులో ఎక్కువగా ఉన్నారు.
దేశం ముందు వరసలో…
టీడీపీకి అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాముగా మారింది. పార్టీతోపాటు అభ్యర్థులూ ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. ఎమ్మెల్యేల అక్రమాలపై ప్రజల్లో తీవ్ర మైన అసంతృప్తి నెలకొని ఉన్నట్లుగా వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వారిపైనే రుద్దేసి ప్రభుత్వంపై సానుకూలత తెచ్చుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం ద్వారా మంచి వారిని రంగంలోకి దింపి టీడీపీ వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తున్నారు. అభ్యర్థి మార్పుతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టీడీపీ వ్యతిరేకత,ఎమ్మెల్యే వ్యతిరేకతను కలిసికట్టుగా ఎదుర్కోవచ్చనేది అంచనా. దీనివల్ల చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేయాల్సి వస్తోంది. అయితే అదంత సులభం కాదు. ప్రజల్లో ప్రతికూలత ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు అయిదు నుంచి పదివేల వరకూ సొంత ఓటు బ్యాంకు ను కలిగి ఉన్నారు. కొత్త అభ్యర్థులను నిలబెడితే స్టాండింగ్ అభ్యర్థులు తిరగబడితే పరిస్థితి ఏమిటన్న దానిపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండటంతో టీడీపీనే జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుగా మొదలుపెట్టింది. ఇప్పటికే నాలుగు జిల్లాలకు సంబంధించి వివాదం లేని నియోజకవర్గాల అభ్యర్థులకు లైన్ క్లియర్ చేసేశారు.
వైసీపీ వేచి చూసి…
టీడీపీకి భిన్నమైనది వైసీపీ సమస్య. ఎన్నికలకు ముందుగానే గెలుపు సాధించబోతున్నారనే వాతావరణం సృష్టించాలనేది వైసీపీ బలమైన భావన. అది జరగాలంటే ఇతరపార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తాలి. ప్రధానంగా అధికారపార్టీ నుంచి వలసలు వస్తే చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. సైకలాజికల్ గా పై చేయి సాధించగలుగుతుంది. అందుకు స్పష్టమైన హామీలు లభిస్తేనే అధికారపార్టీ నుంచి అభ్యర్థులు వస్తారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆకర్షించడానికి చాలా కసరత్తు చేయాలి. సంప్రతింపులు, సమావేశాలు, మధ్యవర్తుల మంతనాలు చాలా జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే బలమైన నాయకులు విపక్షం వైపు తొంగి చూస్తారు. ఈ ప్రక్రియలోనే వైసీపీ ప్రస్తుతం నిమగ్నమైంది. నిన్నామొన్నటివరకూ జగన్ పాదయాత్ర చేసి వచ్చారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష కు వెంటనే పూనుకుంటారని పార్టీ క్యాడర్ ముందుగా భావించింది. అయితే సమీక్షలు జరిపితే ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులకు టిక్కెట్లకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా పార్టీలో ప్రవేశించేవారికి తలుపులు మూసుకుపోతాయి. అందువల్లనే జిల్లాలు, నియోజకవర్గాలవారీ సమీక్షను పెండింగులో పెట్టారు. అగ్రనాయకులు ప్రాంతాల వారీ సమీకరణలపై సమీక్షలు జరపాలని జగన్ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీవైపు వచ్చేందుకు అవకాశం ఉన్నవారిని గుర్తించాలనేది ఈ ఆదేశాల సారాంశం.
వడపోత….
ప్రధానపార్టీల ఓట్ల చీలికలో ముఖ్య భూమిక పోషిస్తుందని భావిస్తున్న జనసేనలో వడపోత పేరిట పెద్ద తతంగం సాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పార్టీ ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. వైసీపీ, టీడీపీ నుంచి పెద్దగా ఎవరూ జనసేనలోకి ప్రవేశించడం లేదు. భారతీయ జనతాపార్టీ నుంచి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీలో ప్రవేశించిన తర్వాత ఆస్థాయి నాయకుడెవరూ మళ్లీ పార్టీలోకి రాలేదు. జనసేన ప్రధానంగా ఆశలు పెంచుకున్న ఉభయగోదావరిజిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు కనిపించడం లేదు. మరోవైపు వైసీపీ, టీడీపీల్లో జంపింగులు, చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ జనసేన నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో కూడా సీరియస్ అభ్యర్థులు తక్కువగా ఉన్నారనేది సమాచారం. రాజకీయాల్లో ఆరితేరినవారు, ఆర్థికంగా పరిపుష్ఠి ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందంటున్నారు. రెండు ఏనుగుల మధ్య పడి నలిగిపోయామంటూ గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఫలితాల తర్వాత వ్యాఖ్యానించారు. అభ్యర్థుల విషయంలోనే జనసేన ఆ పరిస్థితిని ఎదుర్కొంటోందా? అన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్
Leave a Reply