
తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా తమ రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పేసుకున్నారు. పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న నేతలు తమకు ఈసారి పదవులు ఖాయమని లెక్కలు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలవ్వడంతో తమ రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.
జేసీ ప్రకటనతో…..
అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన స్థానంలో కుమారుడు పవన్ రెడ్డి ని పోటీకి దింపారు. అయితే తాజాగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జేసీ ప్రకటించారు. తనకు ఇక ఏపార్టీతో సంబంధం లేదని, రాజకీయంగా తాను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దాదాపు దశాబ్దాల కాలంగా జేసి దివాకర్ రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన జేసీ ఈ ఎన్నికల ఫలితాలతో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.
కోట్ల ఇప్పటికే…….
అయితే జేసీ దివాకర్ రెడ్డి బాటలోనే మరో సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంతటి ఘోరమైన ఓటమిని చెందుతానని కలలో కూడా ఊహించలేదు. తనతో పాటు సతీమణి కోట్ల సుజాతమ్మ కూడా ఓటమి పాలు కావడంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వయసు పైబడటం కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా చెబుతున్నారు.
మరికొందరు సీనియర్ నేతలు….
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే తన అనుచరులతో సమావేశమై రిటైర్మమెంట్ విషయం ప్రకటిస్తారంటున్నారు. ఇకకోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిలాగానే పార్టీలో చేరిన కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మిలదీ అదే పరిస్థితిగా ఉంది. ఇప్పటికే ఐదేళ్లు పదవులకు దూరంగా ఉండటం, టీడీపీలో కొనసాగినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో? లేదో? అన్న అపనమ్మకమే వీరిని రిటైర్మెంట్ వైపు ఆలోచింప చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఐదేళ్లు పార్టీ కోసం పనిచేయడమూ వీరికి కష్టంగా మారడంతో రాజకీయ సన్యాసమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Leave a Reply