
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చిత్తూరు ఎంపీ సీటుపై చర్చ సాగుతోంది. ఇది ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన నియోజకవర్గం. వరుసగా ఇక్కడ టీడీపీ విజయం సాదిస్తూ వస్తోంది. 1996 ఎన్నికల నుంచి కూడా ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కుప్పం, నగరి, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం దీంతో ఆయన మూడు దశాబ్దాలుగా ఇక్కడ గెలుస్తూనే ఉన్నారు. ఇక, చంద్రగిరి ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. కానీ, 2014లో ఇక్కడ నుంచి వైసీపీ జెండా ఎగరేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే కుప్పంలో టీడీపీ ఓడలేదు… చంద్రగిరిలో టీడీపీ గెలవలేదు.
మరోసారి ఆయనకే….
ఇక, నగరిలో టీడీపీ హవా ఉన్నప్పటికీ. గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. పలమనేరులో కాంగ్రెస్ తర్వాత వైసీపీ గెలిచాయి. ఇలాప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్, టీడీపీలు పోటీ పడ్డాయి. అయితే, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ప్లేస్‌ను వైసీపీ భర్తీ చేసింది. ఇక, చిత్తూరు ఎంపీ స్థానం విషయానికి వస్తే.. గత 2014 ఎన్నికల్లో ఎస్సీ వర్గానికి చెందిన నటుడు, పార్టీ నేత నారిమిల్లి శివప్రసాద్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫున సామాన్య కిరణ్ పోటీ చేసి హోరా హోరీగా పోరాడారు. అయితే, టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ మాత్రం 44 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, తాజా ఎన్నికల్లో మరోసారి శివప్రసాద్‌కే చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
గట్టి పోటీ ఇవ్వడంతో….
కానీ, వైసీపీ నుంచి అభ్యర్థి మారిపోయి.. నల్లకొండగారి రెడ్డప్ప తెరమీదికి వచ్చారు. ఇక, అదే సమయంలో జనసేన నుంచి కూడా గట్టి అభ్యర్థే ఇక్కడ పోటీకి దిగారు. పుణ్యమూర్తిని జనసేనాని పవన్ ఇక్కడ నుంచి ఎంపీగా నిలబెట్టారు. దీంతో ఇక్కడ గత ఎన్నికల్లో ద్విముఖంగా ఉన్న పోటీ కాస్తా.. త్రిముఖంగా మారిపోయింది. అయితే, వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యే పోరు తీవ్రంగా సాగిందని అంటున్నారు.సిట్టింగ్ స్థానం తనదేనని శివప్రసాద్ ధీమాగా ఉన్నప్పటికీ.. వైసీపీ నుంచి రంగంలోకి దిగిన రెడ్డప్ప కూడా బలమైన నాయకుడు కావడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఓ వర్గం ఓట్లను జనసేన అభ్యర్థి చీలుస్తాడని అంటున్నారు. ఈ క్రమంలో ఎవరు గెలిచినా.. స్వల్ప మెజారిటీయేనని పరిశీలకులు భావిస్తున్నారు.
కుప్పం మెజారిటీతోనే….
టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఇక్కడ ఎంపీ సీటు 2004లోనూ టీడీపీయే గెలిచింది. డి.ఆదికేశవుల నాయుడు విజయం సాధించారు. కుప్పం నుంచి వచ్చే మెజార్టీతో ప్రతిసారి చిత్తూరు ఎంపీ సీటును టీడీపీ గెలుచుకుంటోంది. ఈ సారి కూడా కుప్పం మెజార్టీపై టీడీపీకి భారీ ఆశలు ఉన్నాయ్. జనసేన ఎంట్రీతో చిత్తూరు లాంటి నియోజకవర్గాల్లో ఈ సారి మెజార్టీల హెచ్చు తగ్గులు ఉండనున్నాయ్. మరి ఫైనల్‌గా ఈ సారి అయినా చిత్తూరులో మార్పు ఉంటుందా ? లేదా ? పాత కథే పునరావృతం అవుతుందా ? అన్నది చూడాలి.
Leave a Reply