మరో కల్వకుర్తి కాదు గదా?

suhasini-kukatpally-kalvakurthy

నందమూరి కుటుంబం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పిన కుటుంబం. ఎన్టీరామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆ పార్టీని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. కోట్ల మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో విరాజిల్లుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ఆపార్టీ గత ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమయింది. ఆ పదిహేనుమందిలో 13 మంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా చంద్రబాబునాయుడు తనకు అత్యంత నమ్మకమైన వారికే టిక్కెట్లు కేటాయించారు.

గతంలో ఎన్టీఆర్ నల్లగొండ….

ఇందులో ప్రధానమైంది కూకట్ పల్లి. తన మేనకోడలు, హరికృష్ణ కూతురు సుహాసినికి ఇక్కడ టిక్కెట్ కేటాయించి చంద్రబాబు తన రాజకీయ చతురతను చాటుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కుటుంబం తెలంగాణలో పోటీ చేస్తుండటం విశేషం. నందమూరి తారక రామారావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు రెండు సార్లు తెలంగాణ నుంచి పోటీ చేశారు. 1985లో తొలిసారి ఎన్టీఆర్ నల్గొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేయాలని భావించి తెలంగాణలోని నల్లగొండ, రాయలసీమలోని హిందూపురం, కోస్తాంధ్రలోని గుడివాడ నుంచి పోటీ చేశారు. అయితే మూడు స్థానాల్లో గెలిచిన ఎన్టీఆర్ హిందూపూర్ ను ఉంచుకుని మిగిలినవి ఆ తర్వాత వదిలేసుకున్నారు.

కల్వకుర్తిలో కంగుతినడంతో….

ఇక 1989లో ఎన్టీరామారావు మళ్లీ రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.అయితే ఆ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ కు కంగు తినిపించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ గెలుపొందారు. ఈ ఓటమి తర్వాత నందమూరి కుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేయడం మానుకుంది. 1989 తర్వాత నందమూరికుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేయలేదు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రాయలసీమలోని హిందూపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇలా నందమూరి కుటుంబం మూడు దశాబ్దాల నుంచి తెలంగాణలో పోటీ చేయడం లేదు.

అందుకే ఈ హడావిడి….

అయితే తాజాగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి సుహాసిని పోటీచేస్తుండటం ఆసక్తిని రేపుతుంది. సుహాసిని గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా సుహాసిని బాబాయ్ బాలకృష్ణ కూకట్ పల్లిలోనే తిష్టవేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూకట్ పల్లిని వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ముప్ఫయి ఏళ్ల తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో పోటీకి దిగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ చాపకింద నీరులా సుహాసిని గెలుపు కోసం పనిచేస్తున్నారు. అయితే సుహాసిని గెలుపుపై అనుమానాలు వెల్లువెత్తుతుండటంతో కూకట్ పల్లి మరో కల్వకుర్తి అవుతుందేమోనన్న ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. మరి ఎన్నికలసమయానికి ఏదైనా మ్యాజిక్ జరుగుతుందో లేదో? చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 37845 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*