సర్వేలు నిజమవుతాయా? ఫెయిలవుతాయా?

surveys in loksabha elections

మేనిపులేషన్. ఒక అంశాన్ని తనకు నచ్చినట్లు మలచి, అన్వయించి , సాధారణీకరించి అదే నిజమని భ్రమింపచేయడం. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ గిమ్మిక్కులు మరింతగా విజృంభించి తప్పుడు సమాచారంతో తమ ఆధిక్యాన్ని చాటుకోవాలని చూస్తుంటాయి రాజకీయపక్షాలు. అది తప్పు కాదు. కానీ ఈ పితలాటకంలో మీడియా సంస్థలు భాగం కావడంతోనే చిక్కు వచ్చిపడుతోంది. మీడియా సంస్థలు తమ సర్క్యులేషన్ , టీఆర్పీ రేటింగు కోసం ప్రజానాడిని పట్టిచూసేందుకు పూనుకుంటే పరవాలేదు. కానీ పక్కాగా అమ్ముడుపోతున్నాయనే అవమానాన్ని , అనుమానాన్ని మూటగట్టుకోవడంతో విశ్వసనీయత వట్టిపోతోంది. విలువలు లుప్తమైపోతున్నాయి. మీడియా సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా పక్కదారిపట్టించే గణాంకాలను వండి వారుస్తున్నాయి. ఈరెండు నెలలు ఇదే గోల పాఠక,ప్రేక్షక మెదళ్లను తొలిచేయబోతోంది.

ఇండియాటుడేతో…

తాజాగా గొడవ మొదలుపెట్టింది ఇండియా టుడే. మోడీ పని అయిపోయింది. ఉత్తరప్రదేశ్ లో బలం 20 లోపునకే పరిమితమవుతోంది. మొత్తమ్మీద బీజేపీ,మిత్రపక్షాల బలం మెజార్టీ మార్కు అయిన 272కి చాలా దూరంలోనే ఆగిపోతుందని అంచనా వేసింది. పైపెచ్చు ఇప్పటికి పరోక్షమిత్రపక్షాలుగా ముద్రపడిన టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీలు సహకరించినా అధికారం కష్టమేనని తేల్చిచెప్పేసింది. అదే సమయంలో మమత, అఖిలేష్, మాయావతి కలిసి వస్తే యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెసు కూటమికి అధికారం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని లెక్క గట్టింది. అధికారపార్టీకి చిర్రెత్తించే ఫలితమిది. నిజానికి ఇండియాటుడే సర్వేని చూసి ఆగ్రహావేశాలకు గురికావడానికి కారణం కూడా ఉంది. ప్రధానంగా ఇండియాటుడేకి కొంత క్రెడిబిలిటీ ఉంది. 1979ప్రాంతాల్లో ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించింది. అప్పటికి ఎన్నికల గణాంకశాస్త్రమే ఇండియాలో అంతంతమాత్రం. ఇందిరను అంతా దూరంగా పెడుతున్న కాలం. అయినా మళ్లీ ఇందిర అధికారంలోకి రాబోతోందని ఇండియాటుడే పసిగట్టింది. అదే నిజమైంది. ఆ తర్వాత ఇండియాటుడే క్రెడిబిలిటీ ఆకాశానికి ఎగసింది. నిజం చాటిచెబితే ఆ మీడియాకు సైతం ప్రజాదరణ పెరుగుతుందనేందుకు అదో ఉదాహరణ. కానీ గడచిన దశాబ్దకాలంగా మీడియా ఆరకమైన నమ్మకాన్ని కోల్పోయింది.

రాజకీయ వంటకం…

తాజా ఇండియాటుడే సర్వే సంచలనం కలిగించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందేనని బీజేపీ తలపోసింది. మరో సర్వే సంస్థతో ప్రజల్లో 52శాతం నరేంద్రమోడీనే ఇష్టపడుతున్నారని బీజేపీ పక్కా లెక్కలు తీసింది. ఇంతకీ సర్వే శాంప్లింగ్ ఎంతని చూస్తే 30వేల మంది. ఇంతవిశాల భారతంలో 30 వేల సంఖ్య అంటే నామమాత్రం. అయినా రాహుల్ కచ్చితంగా మోడీ ఆదరణలో సగం కూడా పొందడం లేదని ఇద్దరికీ మధ్య చాలా గ్యాప్ ఉందని సర్వేక్షకులు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. ఇండియా టుడే సర్వేకి , ఈ తాజా వంటకానికి మధ్య అసలు పొంతన కుదరకపోవడమే విచిత్రం. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ విజయావకాశాలన్నీ మోడీపైనే ఆధారపడి ఉన్నాయి. మోడీకి అత్యంత ఆదరణ లభించే పరిస్థితులు ఉంటే బీజేపీ ఓడిపోదు. అందులోనూ 52 శాతం ప్రజలు మోడీని ప్రధాని కావాలని కోరుకుంటే స్వీపింగ్ విజయం ఖాయం. కానీ రెండు సర్వేలు పరస్పర విరుద్ధ ఫలితాలను చూపడం అంతుపట్టదు. ఒకదానికి మరొక దానితో సంబంధం లేదనే విధంగా ప్రొజెక్టు చేస్తూనే భయంకరమైన గ్యాప్ చూపించడం విశేషం. రెండూ నిజం కావడానికి ఆస్కారం లేదు. ఏదో ఒకటి తప్పు. రాజకీయ పార్టీలకు పరవాలేదు. ఓడిపోయే చివరిక్షణం వరకూ తామే నెగ్గుతున్నామని చెబుతారు. మీడియాకు ఆ రకమైన అవసరాలు లేవు. అయినా ప్రభుత్వానికి, లేదా ప్రతిపక్షానికి లేదా తమను స్పాన్సర్ చేస్తున్న సంస్థకు అనుకూల ఫలితాలను వండి వారుస్తున్నారు.

చిక్కడు..దొరకడు…

నిజానికి ఇండియా ఓటరు చిక్కడు. దొరకడు. ప్రజల్లోకి వెళ్లే సర్వే సంస్థలకు పబ్లిక్ నుంచి సరైన స్పందన రావడం లేదు. కనీసం 30 శాతం మంది ప్రజలు తమ మనోభిప్రాయాన్ని చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఏదోరకమైన పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నవారు కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో 10శాతం వరకూ మనసు విప్పడం లేదని సర్వే సంస్థలే వాపోతున్నాయి. అంటే ప్రజల్లో 40 శాతం బయటకు తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం లేదు. సర్వే శాంప్లింగ్ చాలా తక్కువ పరిణామంలో తీసుకుంటున్నారు. మాట చెప్పని వారు, అసలు సర్వే పరిధిలోకే రానివారు అంతా కలిపి చూస్తే సర్వేల ప్రామాణికతే ప్రశ్నార్థకమవుతోంది. రాజకీయపార్టీల లెక్కలు ప్రజలపై ప్రభావం చూపే సంగతెలా ఉన్నప్పటికీ మొత్తం వ్యవస్థను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. గెలుపోటముల గురించే దేశ నాయకత్వం నిరంతరం ఆలోచించడం విషాదకరం. ఈ మేనిపులేషన్లపై దృష్టి తగ్గించి దేశాన్ని ఎలా ముందుకు నడపాలనే అంశంపై కాసింత ద్రుష్టి సారిస్తే మంచిదేమో.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 40410 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*