సుష్మాను కావాలనే అలా చేస్తున్నారా?

సుష్మాస్వరాజ్…. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ రానటువంటి పేరు ప్రతిష్టలు, గత కొద్దికాలంగా సోషల్ మీడియా ద్వారా వచ్చాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే మార్మోగిపోతోంది. సాయం కోసం చేసే విన్నపాలకు తక్షణం స్పందించడం, కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి భరోసా ఇవ్వడం, సాంత్వన వాక్యాలు పలకడం ద్వారా ఆమె ప్రతిష్ట అనూహ్యంగా పెరిగింది. సంప్రదాయ వస్త్ర ధారణలో, భారతీయతను ప్రతిబింబించే సుష్మాస్వరాజ్ అంటే అభిమానించే వారు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉత్తరాదికి చెందిన ఈ నాయకురాలికి ఇప్పుడు దక్షిణాదిన కూడా అమిత ఆదరణ లభిస్తోంది. ప్రతి భారతీయుడు ఆమె తన సోదరిగా భావించుకుంటున్నారు.

సాయం చేసినా…..

కాని ఇటీవల కాలంలో పరిస్థితి వికటించింది. ఆరుపదుల వయసుగల విదేశాంగ మంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు, అసత్యకర సందేశాలు, విధ్వేషపూరిత మాటలు వినపడుతున్నాయి. మతాంతర వివాహం చేసుకున్న దంపతులు ఇటీవల పాస్ పోర్ట్ కోసం వచ్చినప్పుడు సంబంధిత అధికారి అభ్యంతరకరంగా వ్యవహరించారన్న ఆరోపణ వచ్చింది. దీనిపై స్పందించిన సుష్మా ఆ అధికారిని బదిలీ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. తాను ఎవరినీ అవమానించలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించానన్నది ఆ అధికారి వాదన. దీనిపై సుష్మా స్వరాజ్ స్పందించని మాట వాస్తవమే. అయితే మహిళల సమస్యపై స్పందించారు. ఇక ముందు పాస్ పోర్ట్ కోసం వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని సుష్మా స్పష్టం చేశారు. అంతేకాక విడాకులు తీసుకున్న మహిళ పాత భర్తపేరు, వారి పెళ్లి వివరాలను కూడా వెల్లడించనక్కర్లేదని కూడా సుష్మా పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులకు, ఇబ్బందులు, కష్టాలపై మంత్రి స్పందిస్తున్న తీరు హర్షణీయం. ఆమె పెద్ద మనస్సుకు అందరూ అభినందించాలి. అధికారికంగా ఊపిరి సలపని పని ఒత్తిళ్లతో ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై స్పందించడం ఆమె సదుద్దేశానికి దర్పణం పడుతుంది.

సోషల్ మీడియాలో విమర్శలు….

కానీ మంత్రి చర్యలతో విభేదించేవారు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేయవచ్చు. మహిళలను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. ఆందోళనకరం. ఎంతమాత్రం సమర్థనీయం కాదు. సోషల్ మీడియాలో సుష్మాపై వచ్చిన విమర్శలు, వ్యాఖ్యలు పరిశీలిస్తే సమాజం ఎటువెళుతుందోనన్న ఆందోళన కలగక మానదు. విమర్శలను వ్యక్తిగత, మతకోణంలో చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. సుష్మాస్వరాజ్ అన్య మతస్థులకు మద్దతు ఇస్తున్నారని, ఆమెను భర్త అదుపు చేయాలని ఓ కుసంస్కారి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలి? అదే విధంగా మరొకరు ఆమెకు పాకిస్థాన్ పక్షపాతాన్ని అంటగట్టారు. అంతటితో ఆగకుండా మరికొందరు మరింత ముందుకు వెళ్లారు. ఆమెకు ఇటీవల అమర్చిన కిడ్నీ వేరే మతానికి చెందిన వ్యక్తిదని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇంకొకరు…‘‘సుష్మా బేగం’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినప్పటికీ సుష్మాస్వరాజ్ ఎక్కడా తొందరపడలేదు. సంయమనం కోల్పోలేదు. చాలా హుందాగా ప్రతిస్పందించారు. ‘‘ మీరు ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా?’’ అంటూ ఆన్ లైన్ లో ప్రశ్నించారు. అడిగిందే తడవుగా అనేకమంది ఆమెకు అండగా నిలిచారు. అనుచిత విమర్శలను ఖండించారు. వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అభ్యంతరకర మాటలకు అడ్డు చెప్పారు.

సొంత పార్టీ మాత్రం…..

ఇదంతా ఒక ఎత్తు. ఇంతవరకూ బాగుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆమెకు మద్దతు పలికారు. రాజకీయ వర్గాల నుంచి కూడా మద్దతు లభించింది. విపక్ష కాంగ్రెస్ బాసటగా నిలిచింది. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని హితవు పలికింది. సీనియర్ పార్లమెంటేరియన్ పై సాగుతున్న దూషణ పర్వానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. నిన్న మొన్నటి దాకా బీజేపీతో కలసి పనిచేసిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం ఖండించారు. పార్టీలకు అతీతంగా పలువురు మద్దతు పలికారు. అయినప్పటికీ సొంత పార్టీ నుంచి సుష్మకు మద్దతు కరువవ్వడం ఆందోళ కలిగిస్తోంది. ఆవేదనను మిగులుస్తోంది. ఒక సీనియర్ మంత్రి, అందునా ఒక మహిళపై జరుగుతున్న దాడిని అధికార బీజేపీ నాయకులు ఖండించకపోవడం గమనార్హం. ప్రధాని మోదీ కాని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాని సుష్మాస్వరాజ్ కు సంఘీభావం ప్రకటించలేకపోయారు. యధారాజా తథా ప్రజా…అన్నట్లు పార్టీ పరివారమంతా వారి బాటలోనే నడిచింది. పార్టీ శ్రేణుల నుంచి , నాయకులు, మంత్రులు నుంచి విదేశాంగ మంత్రికి మద్దతు కొరవడింది. పార్టీలో అంతర్గత రాజకీయాలే ఇందుకు కారణమన్న విమర్శలు వినబడుతున్నాయి. పార్టీలో సుష్మా ఉనికిని, ఎదుగుదలను వ్యతిరేకించే ఒక వర్గం ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి విమర్శలకు, దాడులకు దిగుతుందన్న వాదన వినపడుతోంది.

అద్వానీ శిష్యురాలనేనా?

సుష్మా స్వరాజ్ ఆషామాషీ నాయకురాలు కాదు. క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నేత. పాతికేళ్ల వయస్సులోనే 1977లో ఆమె హరియాణా మంత్రివర్గంలో ఉన్నారు. పార్టీలో తొలి మహిళ అధికార ప్రతినిధి. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు. సుప్రీంకోర్టు న్యాయవాది. 1998లో కొంతకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. పార్టీలో తొలి మహిళా ముఖ్యమంత్రి. వాజపేయి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2009లో మధ్యప్రదేశ్ లోని ‘‘విదీష’’ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై 15వ లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. 2014లో కూడా అక్కడి నుంచే ఎన్నికయ్యారు. అద్వాణీ శిష్యురాలైన ఆమెను ప్రధాని మోదీ రాజకీయంగా అణగదొక్కుతున్నారన్న అభిప్రాయం ఉంది. విదేశాంగ మంత్రి లేకుండా విదేశీ పర్యటనలు చేస్తూ ఆమెను చిన్నచూపు చూస్తున్నారన్న వాదన విదేశాంగ శాఖ వర్గాల్లో వినపడుతోంది. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో కూడా తగిన గౌరవం కల్పించడం లేదన్న విమర్శ ఉంది. ఇదంతా తెలిసి, కావాలని, ఉద్దేశ పూర్వకంగాచేస్తున్న పని అన్న విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. ఇది పార్టీకి నష్టదాయకమన్న విషయాన్ని పెద్దలు గుర్తించడం లేదు….!

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 30973 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*