వీరిద్దరికీ….వారిద్దరే టార్గెట్….!!

target congress ys jaganmohanreddy, pawan kalyan

నిన్న మొన్నటి దాకా వారు శత్రువులే. అధికార పక్షంపై విరుచుకు పడేవారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ పోటీకి దిగి చతికిలపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల వేళ కూడా అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. పూర్తిగా కొడిగట్టిపోయిన పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వ విధానాలపై బాగానే పోరాడారు. అయినా రాష్ట్రాన్ని విభజించారన్న ఏపీ ప్రజల ఆగ్రహాన్ని మాత్రం ఇంకా తగ్గించలేకపోతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుండటంతో అప్పటి వరకూ దశాబ్డాలుగా పార్టీలోనూ, అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవించిన వారు కూడా హ్యాండిచ్చేసి ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు.

ఆశాదీపంలా…

కాంగ్రెస్ కు ఆశాదీపంలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కన్పిస్తున్నారు. తెలంగాణలో తనకు అవసరమై కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు ఇచ్చే బలంతోనే కనీస స్థానాలను గెలుచుకుంటామన్న నమ్మకంతో హస్తం పార్టీ నేతలున్నారు. ఆయన బొమ్మ పెట్టుకునే ఈసారి ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు తర్వాత అది ఆంధ్రప్రదేశ్ లో కూడా కంటిన్యూ అవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు ఇదే మంచి సమయమని పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది.

నిన్న మొన్నటి వరకూ….

ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి దాకా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయన్ను వదిలేసి జగన్, పవన్ లను టార్గెట్ చేయాల్సి వస్తోంది. చంద్రబాబును విమర్శిస్తే ఢిల్లీ నుంచి అక్షింతలు తప్పవన్న సంగతి తెలుసు. అందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు సర్వం మార్చారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడకార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించిన నేతలు ఇప్పుడు పొగిడేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తుండటం విశేషం. టీడీపీకి కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం కన్పిస్తోంది. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీకి కనీసం రెండు శాతం ఓట్లయినా పడతాయన్న నమ్మకంతోనే చంద్రబాబు పొత్తుకు సిద్ధమయ్యారని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం.

పవన్ , జగన్ లపైనే…..

ఇక తాజాగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జగన్, పవన్ లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఇద్దరూ సహకరించేందుకే పోటీకి దిగలేదని ఆయన ఆరోపించారు. మోదీకి పవన్, జగన్ లు ఇద్దరూ ఏజెంట్లుగా మారారని దుయ్యబట్టారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై అధిష్టానానిదే తుదినిర్ణయమని ఆయన చెప్పారు. ఇక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సయితం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీని నిలువరించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడాన్ని ఆయనస్వాగతించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి నడుస్తున్నారని ఆయన అన్నారు. ఇలా నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు ను దూషించిన హస్తం పార్టీనేతలు ఇప్పుడు జగన్, పవన్ లనే టార్గెట్ చేయాలని ఆదేశాలు అందాయి. రానున్న రోజుల్లో జగన్, పవన్ లపై మరింత దూకుడుగా హస్తం పార్టీ వ్యవహరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Ravi Batchali
About Ravi Batchali 23794 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*