టీడీపీతో పొత్తు క‌లిసి వ‌చ్చేనా..?

తెలంగాణ‌లో ఎనిమిది నెల‌ల ముందే అసెంబ్లీని ర‌ద్దు చేసి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు. డిసెంబ‌ర్ లో ఎన్నిక‌లు రావ‌డం ఖాయంగా క‌న‌ప‌డుతోంది. అయితే, ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌డ‌క ముందే ఎన్నిక‌ల‌కు వెళ్లి సునాయాసంగా విజ‌యం సాధించాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న అని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. తెలంగాణ లో కేసీఆర్ ప్ర‌జాధార‌ణ‌లో అంద‌రు నేత‌ల క‌న్నా ఎంతో ముందున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌త్య‌ర్థి పార్టీల కంటే ముందుంది అనే అంచ‌నాలు కూడా ఉన్నాయి. సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ఈ విష‌యాన్ని చెప్పేస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన ఒక‌టి రెండు స‌ర్వేల్లోనూ ఇదే విష‌యం తేలింది. సుమారు స‌గం ఓట‌ర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నార‌ని, స‌గం మంది కేసీఆర్ పాల‌న బాగుంద‌ని అన్న‌ట్లు తేలింది. అంటే మిగ‌తా స‌గంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌న్నీ అన‌మాట‌.

టీడీపీతో పొత్తు అంటేనే…

ఈ ప‌రిస్థితి రాజ‌కీయ పార్టీల‌కు తెలియంది కాదు. అందుకే ఎవ‌రికి వారు ఒంట‌రిగా పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే మ‌ళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీలు గుర్తించాయి. ఈ నాలుగేళ్ల పాల‌న చూసిన ప్ర‌తిప‌క్షాలు ఎలాగైనా కేసీఆర్ మ‌ళ్లీ గెల‌వ‌కూడ‌ద‌ని కంక‌ణం క‌ట్టుకున్నాయి. కేసీఆర్ బ‌లంపై స్ప‌ష్ట‌మైన అంచ‌నా ఉన్న ప్ర‌తిప‌క్షాల‌కు కేసీఆర్ ను గ‌ద్దె దించాలంటే మ‌హాకూట‌మి ఏర్పాటే ఏకైక మార్గ‌మనే నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఈ కూట‌మికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ పెద్ద‌న్న పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన భాగ‌స్వామిగా ఉండ‌నుంది. ఇక తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ పార్టీలు కూడా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. అయితే, అన్ని పార్టీల విషయంలో లేని చ‌ర్చ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అంటే మాత్రం త‌లెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో చెప్పుకోద‌గ్గ ఓట్లు, సీట్లు సాధించింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి ఓటు బ్యాంకు బ‌లంగా ఉంద‌ని ఆ పార్టీ భావిస్తోంది.

హైద‌రాబాద్ కోస‌మేనా..

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలు గెలిచింది. ఎక్కువ‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో, హైద‌రాబాద్ శివారు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. ఇక జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలిచినా పార్టీల బ‌లం కంటే అక్క‌డ అభ్య‌ర్థుల వ్య‌క్తిగ‌త బ‌ల‌మే ప్ర‌ధానంగా ప‌నిచేసింది. అయితే, హైద‌రాబాద్ లో సీమాంధ్రుల ఓట‌ర్లు గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ శాతం టీడీపీ ఓటేశారు. ఇక న‌రేంద్ర మోదీ ప్ర‌భావం కూడా బాగానే ప‌నిచేసింది. మ‌రి, ఈ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి అలా ఉందా అనేది చెప్ప‌లేం. సీమాంధ్ర ఓట‌ర్లు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచారు. కానీ, కాంగ్రెస్‌, టీడీపీ మాత్రం ఇంకా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేసిన వారంతా మ‌ళ్లీ వేస్తార‌ని భావిస్తున్నారు. టీడీపీ కూడా అదే దృష్టిలో పెట్టుకుని పెత్తులో 30 స్థానాలు అడుగుతున్నారు. మ‌రి గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన ఓటు బ్యాంకు ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ సాధించ‌గ‌ల‌దా అన్న అనుమ‌నం అయితే ఉంది. దీంతో కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లే టీడీపీకి ఈసారి గ‌త ఎన్నిక‌ల మాదిరి ఓటు బ్యాంకు లేద‌ని చెబుతున్నారు. కానీ, ఎక్కువ సీట్లు టీడీపీకి వ‌ద‌ల‌కూడ‌దు అని బాహాటంగానే చెబుతున్నారు.

గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయ‌మా..?

అయితే, అన్ని జిల్లాల్లో టీడీపీకి గ‌తంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన ప్ర‌ముఖ నేత‌లు ఉన్నారు. వీరికి ప్ర‌జ‌ల్లో కొంత ప‌లుకుబడి ఉంది. ఈసారి కాంగ్రెస్ తో క‌లిసి వారు పోటీ చేస్తే క‌చ్చితంగా కొంత మేలు చేస్తుంది. ఇక హైద‌రాబాద్ లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఒక్క‌సీటు గెల‌వ‌లేదు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ అదే ప‌రిస్థితి. అందుకే టీడీపీతో క‌లిసి పోటీ చేసి రెండు పార్టీల ఓట్లు ఒక్క‌చోట చేరితే ఈ ఎన్నిక‌ల్లోనైనా మేలు చేస్తుంద‌ని భావిస్తున్నారు. ఇక పొత్తుల వ‌ల్ల టీడీపీకి వ‌దిలే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అసంతృప్తికి గుర‌య్యే అవ‌కాశం కూడా ఉంది. ఇక సీమాంధ్ర ఓటర్లు ఏమైనా అనుకూలంగా మారినా తెలంగాణ ప్రాంత ఓట‌ర్ల‌లో కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. టీడీపీ స‌మైక్య‌వాదాన్ని ఎత్తుకుంద‌ని, ఆంధ్రా పార్టీ అని కూడా ప్ర‌జ‌లు భావించే అవ‌కాశం ఎంతో కొంత ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేత‌లు ఈ దిశ‌గా ప్ర‌చారం కూడా భారీగానే మొద‌లుపెట్టాయి. మొత్తానికి మ‌హాకూట‌మి వ‌ర్క‌వుట్ అయితే మాత్రం టీఆర్ఎస్ కి గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశాలు మాత్రం ఉన్నాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి.

 

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*