
రాజకీయాలనేవి ప్రజా సేవకు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సాగాలి. కానీ అవి దారిమార్చుకుని అభివృద్ధి నిరోధానికి రాజకీయాలు అనే తరహా గా రూపం మార్చుకోవడం దురదృష్టకరం. తాజాగా బిజెపి చేస్తున్న ఆరోపణలు, విమర్శలు గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు బురదజల్లుకోవడానికి అభివృద్ధి నిధులతోనే ఆడుకుంటున్నాయని తేలిపోతుంది. నిధులు ఇస్తున్నా రాజకీయాలకోసం టిడిపి వాటిని తీసుకోవడం లేదని బిజెపి అంటుంది. టిడిపి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ని దోషిగా చూపేందుకే ఈ గేమ్ స్టార్ట్ చేసిందని కమలం ఆరోపిస్తుంది. హోదా వద్దు ప్యాకేజి… ప్యాకేజీ అంటూ అడిగింది టిడిపి అని ఇప్పుడు హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నా ప్రజలముందు బిజెపి రాష్ట్రానికి ఏమి చేయలేదని అని చెప్పేందుకు వచ్చే నిధులు కూడా వద్దంటూ రాజకీయాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తుందన్నది వారు అంటున్నారు.
అడిగిన వాటికే దిక్కులేదు అంటున్న టిడిపి …
బిజెపి వాదనను టిడిపి నేతలు బలంగా తిప్పికొడుతున్నారు. పోలవరం, రాజధాని వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి మహాప్రభో అన్నా డబ్బులు ఇవ్వకుండా బిజెపి రాజకీయం చేస్తూ తమపై బురదజల్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు పసుపు నేతలు. నిధులు ఇవ్వకపోగా ఎదురుదాడి చేయడం ఏమిటన్నది వారి వాదన. ఇప్పటికే ఇచ్చిన వాటికి యుసి లు ఇవ్వలేదని ఇచ్చినవి సరిగ్గా లేవంటూ నాటకాలు ఆడుతున్నారని టిడిపి ఫైర్ అవుతుంది. అదే విషయాలను ప్రజలకు వివరిస్తుంటే రాజకీయ ఆరోపణలకు విమర్శలకు దిగుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు తెలుగుదేశం నాయకులు.
బ్లేమ్ గేమ్ తో నష్టమే ….
రాజకీయంగా టిడిపి, బిజెపి లు నాలుగేళ్ళు కలిసే యుగళగీతం పాడుకున్నాయి. ఇప్పుడు రెండు పార్టీలకు ఒకరిపై మరొకరికి ద్వేషం ఏర్పడింది. ఇదంతా బానే వున్నా రెండు పార్టీలు రాష్ట్రానికి మీరు మోసం చేశారంటే మీరు ద్రోహం చేశారంటూ విమర్శలు చేసుకోవడాన్ని మాత్రం ప్రజలు చీదరించుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. రెండు పార్టీలు నాటి ఎన్నికల్లో గెలవడానికి చెట్టాపట్టాలు వేసుకుని, ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో విడిపడిగా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఈ తరహా రాజకీయాలు రాష్ట్ర, దేశ రాజకీయాలకు మంచిది కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. తాము ఏమి చేసింది ఇరువురు చెప్పుకోవడం భవిష్యత్తులో ఏమి చేస్తామో చెప్పుకునే అభివృద్ధి రాజకీయాలే ప్రజలకు అవసరమే కానీ బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ నేటి ఆధునిక యుగంలో పనికి రావన్నది రాజకీయ పరిశీలకుల వాదనగా వుంది. కానీ తారా స్థాయికి చేరిన కమలం, సైకిల్ వార్ ఇలాంటి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకునే అవకాశాలు కానరావడం లేదు.
Leave a Reply