ఎక్కడైనా అదే గాని…ఇక్కడ కాదంట…!

అధికార పార్టీలో టికెట్ల వార్ మొద‌లైంది. కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్యే ఆస‌క్తిక‌ర పోరు నెల‌కొంటోంది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఒకే స్థానం నుంచి ఒకే కుటుంబం నుంచి ఇద్ద‌రు.. అందులోనూ వియ్యంకుడు, వియ్య‌పురాలు పోటీ ప‌డుతుండ‌టం మ‌రింత ఆసక్తిక‌రంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీచేసిన వీరు.. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండ‌టం, ఒకే నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ ఆశిస్తుం డ‌టం.. వీరి మ‌ధ్య కోల్డ్‌వార్‌ను బ‌య‌ట‌పెట్టిందంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో మాజీ ఎమ్మెల్యే స‌త్య వ‌తి రాథోడ్‌, రెడ్యా నాయ‌క్ మ‌ధ్య టికెట్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. డోర్న‌క‌ల్ సీటు ఈసారి కూడా ద‌క్కించుకో వాల‌ని రెడ్యా నాయ‌క్‌, ఆయ‌న్ను ఢిల్లీకి పంపించేసి త‌న‌కు పోటీ లేకుండా చేసుకోవాల‌ని స‌త్య‌వ‌తి రాథోడ్ రాజ‌కీయ వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు.

తనకే సీటు కావాలంటూ…..

ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకునేందుకు సిట్టింగుల‌తో పాటు పార్టీలోని మ‌రి కొంత‌మంది నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌క్క‌వారికి ఎర్త్ పెట్టేందుకు ఇప్ప‌టికే లాబీయింగ్ కూడా ప్రారంభించేశారు. ఇదే స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య కూడా రాజ‌కీయ‌ విభేదాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బంధుత్వం.. బంధుత్వ‌మే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే అంటున్నారు స‌త్య‌వ‌తి, రెడ్యా వియ్యంకుడు. గ‌త ఎన్నిక‌ల్లో డోర్న‌క‌ల్ నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున స‌త్య‌వ‌తి పోటీ చేశారు. రెడ్యానాయ‌క్ కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో స‌త్య‌వ‌తి ఓడిపోయారు. ఆ త‌ర్వాత రెడ్యా కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య డోర్న‌క‌ల్ సీటు కోసం వార్ మొద‌లైంది. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న్ను కాద‌ని.. త‌న‌కు సీటు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ను కోర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఢిల్లీకి పంపాలని…..

అంతేగాక రెడ్యానాయ‌క్ వంటి సీనియ‌ర్ నాయ‌కుడు ఢిల్లీ స్థాయిలోకి వెళితేనే బాగుంటుంద‌ని గులాబీ బాస్‌కు స‌ల‌హా కూడా ఇచ్చారు. దీంతో ఆయనకు ఎలాగైనా సీటు ద‌క్క‌కుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌నే టాక్ వినిపిస్తోంది. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సీటును డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు కేటాయించి.. డోర్నకల్‌ అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించాన‌ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రెడ్యా వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన రెడ్యానాయక్‌ మానుకోట పార్లమెంట్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రజలకు సుపరిచితుడని.. అందుకే ఆయ‌న‌.. ఎంపీగా పోటీ చేస్తే అలవోకగా విజయం సాధిస్తారని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

రెడ్యా వర్గంలో అలజడి……

సీనియర్‌ నాయకుడైన రెడ్యానాయక్‌ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. తాను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నల్లగొండ పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ మూడేళ్లు డోర్నకల్‌ నియోజకవ ర్గంలో ఎక్కడా ఆటంకం సృష్టించలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని అన్నారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లో తనకు డోర్నకల్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. డోర్నకల్‌ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ నామినేటెడ్‌ పదవి ఇస్తానని చెప్పినా తీసుకోలేదని ఆమె ప్ర‌చారం చేస్తుండ‌టంతో రెడ్యా వ‌ర్గంలో అల‌జ‌డి మొద‌లైంది. ఇలా ఒకే టికెట్ కోసం వియ్య‌పురాలు, వియ్యంకుడు పోటీప‌డుతుండ‌టం ఆస‌క్తిగా మారింది.

Ravi Batchali
About Ravi Batchali 30945 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*