మాకొక నాయకుడు కావలెను…!

తెలంగాణ టీడీపీకి పెద్దదిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పార్టీని ఆదుకునే వారే కరువయ్యారు. చంద్రబాబు సమావేశం పెట్టి ప్రభుత్వంపై పోరాడాలని సందేశమిచ్చినా ఆయన మాటను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. వచ్చే ఎన్నికలలో ఎవరితో పొ్త్తు ఉంటుందో తెలియదు. పొత్తు మాత్రం ఉంటుందని చంద్రబాబు చెప్పడం, ఎవరి మీద పోరాటం చేయాలన్న క్లారిటీ ఇవ్వకపోవడంతో తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇరకాటంలో పడ్డారు. ఇక్కడ పార్టీ నేత అంటూ పెద్దగా చెప్పుకునే వారు ఎవరూ లేరు. ఎవరి మాట ఎవరూ వినరు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నా చరిష్మా ఉన్న ఫేస్ ఒక్కటీ లేకపోవడంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే పరిమితమయ్యారు తెలుగుదేశం నేతలు.

రమణ ఉన్నా లేనట్లేనా?

ప్రస్తుతం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్. రమణ ఉన్నారు. అయితే ఆయన మాటను ఎవరూ పెద్దగా ఖాతరు చేయరు. ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గానికే పరిమితమైన నేత. గతంలోనూ అందరితో కలిసిపోయిన వ్యక్తికాకపోవడం, నాయకత్వ లక్షణాలు రమణలో కొరవడటంతో ఆయన నాయకత్వం సరిపోదన్నది పార్టీలో కొందరి వాదన. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా కొందరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల కొందరు నేతలు చంద్రబాబుకు కూడా నేరుగా చెప్పినట్లు తెలిసింది. అయితే రమణ పట్ల నమ్మకమే ఆయనను ఆ పదవిలో ఉంచిందంటున్నారు.

గత ఎన్నికల్లో పదిహేను సీట్లు….

రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రపార్టీగా తెలంగాణలో పేరుపడిన తెలుగుదేశం పార్టీకి 15 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. అందులో 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. మిగిలిన ముగ్గురిలో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే ఎమ్మెల్యేలు. ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా, మరొకరు ఆర్. కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు ఉంటారు. ఆయన తొలినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నదీ తక్కువే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కూడా కృష్ణయ్య రారు. ఇక ఇటీవల ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కృష్ణయ్య గళమెత్తారు. సండ్ర వెంకటవీరయ్య మాత్రం పార్టీనే నమ్ముకుని ఇప్పటివరకూ అయితే ఉన్నారు.

సీనియర్లు పార్టీని వీడేందుకు….

రమణ నాయకత్వంలో పనిచేయలేని కొందరు ఇప్పటికే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లోని పార్టీ, ప్రభుత్వ సమస్యలతో సతమతమవుతుండటంతో ఇక్కడ కన్ను కూడా వేయడం లేదు. ఏదో వీకెండ్ లో ఇంటికి వచ్చినప్పుడు పార్టీ నేతలతో సమావేశమై వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టాలన్నా, క్యాడర్ లో జోష్ నింపాలన్నా ఒక బలమైన నాయకుడు ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అవసరం. ఇప్పుడున్న నాయకత్వంతో పార్టీని బలోపేతం చేయమనడం చంద్రబాబు అత్యాశే అవుతుందన్నది వాస్తవం. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కూడా నాయకుడు దొరకడన్నది గట్టిగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎన్నికల వేళ పొత్తు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు ఇస్తారనుకోవడం భ్రమే అవుతుందని, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో తప్ప వేరే చోట స్థానాలు కేటాయించడమూ కష్టమే అవుతుందని భావించిన కొందరు సీనియర్లు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరి చంద్రబాబు ఇక్కడి పార్టీని సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 39176 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*