
ఎవరూ నిలకడగా ఉండరు. ఒకసారి గెలిస్తే మళ్లీ సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రతి సారీ కొత్త అభ్యర్థి వస్తుంటారు. ఇదీ పూతలపట్టు నియోజకవర్గం ప్రత్యేకత. చిత్తూరు జిల్లలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ నెలకొని ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూతలపట్టు ఏర్పడింది. 2009లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పి.రవి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ టగ్ ఆఫ్ వార్ గా ఉంటుందన్నది గణాంకాలు చెప్పే వాస్తవం. కౌంటింగ్ లో చివరి క్షణం వరకూ ఉత్కంఠగానే ఉంటుంది. ఎవరు గెలుస్తారన్నది ఆఖరు ఈవీఎం తెరిచే వరకూ తెలియని పరిస్థితి పూతలపట్టుది.
రెండు ఎన్నికల్లో మెజారిటీ….
పేరుకు తగ్గట్టుగానే ఈనియోజకవర్గంలో రెండు పార్టీలకు గట్టి పట్టుందనే చెప్పాలి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పి. రవి తెలుగుదేశం అభ్యర్థి లలితకుమారిపై కేవలం 951 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. డాక్టర్ రవికి 64,484 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి లలితకుమారికి 63,533 ఓట్లు వచ్చాయి. ఇక 2014 ఎన్నికలను తీసుకుంటే వైసీపీ అభ్యర్థి ఎం.సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి లలితకుమారిపై కేవలం 902 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ కు 83,200 ఓట్లు రాగా, లలిత కుమారికి 82,298 ఓట్లు వచ్చాయి. ఇలా రెండు సార్లు అతి స్వల్ప ఓట్ల తేడాతో ఇక్కడ టీడీపీ పరాజయం పాలయింది.
వరస ఓటములతో….
ఈ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన లలితకుమారికి తిరిగి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. తొలుత ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖ అధికారి తెర్లాం పూర్ణం పేరును ప్రకటించింది. అయితే స్థానిక నేతల నుంచి పూర్ణం అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో లలిత కుమారికే టిక్కెట్ ను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు ఎన్నికలో స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడంతో తనకు సానుభూతి పనిచేస్తుందని లలితకుమారి భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం, లలితకుమారిపై సానుకూలతతో పూతలపట్టును పట్టేస్తామని టీడీపీ ధీమాగా ఉంది.
అభ్యర్థిని మార్చడంతో…..
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్ కుమార్ కు టిక్కెట్ దక్కలేదు. ఆయనను పక్కనపెట్టి ఎంఎస్ బాబుకు సీటు కేటాయించింది. సునీల్ కుమార్ ఆత్మహత్యా యత్నం చేస్తానని హెచ్చరించినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా ఇక్కడ టిక్కెట్ ఎంఎస్ బాబుకు అభ్యర్థిత్వాన్ని జగన్ ఖారారుచేశారు. కొత్త వ్యక్తి కావడంతో పార్టీకి కొంత సానుకూలత ఉంటుందని వైసీపీ భావిస్తోంది. పూతలపట్టు లో ఈసారి కూడా పోటీ నువ్వా? నేనా? అన్న రేంజ్ లో ఉండే అవకాశముంది. మెజారిటీ కూడా వెయ్యి లోపే ఉంటుందన్న అంచనాలు ఉండటంతో రెండు పార్టీల అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
Leave a Reply