పలాయన వాదమా? ప్రతిఘటనాత్మకమా..?

తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఎన్నికలలో పాల్గొనడం లేదంటే వ్యవస్థపై తీవ్ర నిరసనను వ్యక్తం చేయడమే. కచ్చితంగా ప్రజాస్వామ్యవాదులను ఆలోచింప చేస్తుంది. ఆమేరకు టీడీపీ సక్సెస్ అవుతుందనే చెప్పాలి. అయితే టీడీపీ అధినేత నిర్ణయం వెనక కారణాలపైన రాజకీయ చర్చ మొదలైంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు కిల్లర్ ఇన్ స్టింక్ట్ కలిగిన నాయకుడు. ఓటమి తప్పదని తెలిసినా పోరాటం విడిచిపెట్టడు. కానీ ఈ దఫా గతంలో ఎన్నడూ యోచన చేయని వైఖరిని తీసుకున్నారు. ఇందుకు దారి తీసిన పూర్వాపరాలు టీడీపీ బలహీనతను బయటపెడుతున్నాయా? లేక నిజంగానే ప్రతిఘటనను తెలియ చేస్తున్నాయా? ఇది పలాయనవాదమా? ప్రజాస్వామ్య యుతమా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అధికారం కోసం, ప్రజలలో పలుకుబడి చాటుకుని వారి తరఫున పోరాటం సాగించడం కోసం పార్టీలు పోటీ పడుతుంటాయి. గెలుపోటములు వస్తుంటాయి. పోతుంటాయి. ఈ నిజం చంద్రబాబు నాయుడికి తెలియక కాదు. మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడిన చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికల విషయానికొచ్చేసరికి చేతులెత్తేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి న్యాయం చేయదనేది ఆయన అనుమానం. ప్రభుత్వ పక్షంపై ఫిర్యాదులు,ఆరోపణలు ఎన్ని వచ్చినా పట్టించుకోదని ఆవేదన. అవి రెండూ చాలావరకూ నిజాలే. అలాగని పూర్తిగా ఎన్నికలనే బహిష్కరిస్తే క్యాడర్ కు ఎటువంటి సంకేతాలు వెళతాయి? ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు? ఇవన్నీ లోతుగా తరచి చూడాల్సిన అంశాలు.

వేధింపులు.. వెతలు..

పంచాయతీ , మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ పైచేయి సాధించింది. అది సహజమే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయ్యింది. సంక్షేమ పథకాలను విస్తృతం చేసింది. కేవలం కార్యకర్తలు, నాయకుల మీద మాత్రమే ఆధారపడకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. సత్ఫలితాలను రాబట్టింది. నిజంగానే ప్రతిపక్షాలు ఇబ్బంది పడ్డాయి. బలమైన నాయకులు పోటీకి సిద్ధపడలేదు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే సామాజిక వర్గాలు ముఖం చాటేశాయి. అందువల్ల ఘోరమైన ఓటమినే చవి చూడాల్సి వచ్చింది. నిజానికి పార్టీల పేరు నేరుగా చెప్పకుండా సాగిన పంచాయతీ ఎన్నికల్లోనే కొంతవరకూ అనుకూల ఫలితాలు తెలుగుదేశానికి లభించాయి. పార్టీ అభ్యర్థిత్వంపై పోటీ పడిన మునిసిపల్ ఎన్నికలు పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉండటంతో తమకు అనుకూలంగా పరిణమిస్తాయని టీడీపీ భావించింది. దింపుడు కళ్లెం ఆశ పెట్టుకుంది. రెండు రాజ్యాంగ వ్యవస్థల గొడవకు, ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదని తేటతెల్లమైపోయింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపామని ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చి ఎస్ ఈ సీ పదవి నుంచి దిగిపోయారు. ఈ ఫలితాలతో టీడీపీ బాగా డీలాపడిపోయింది. కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ పూర్తిగా ప్రభుత్వ అనుకూల వైఖరిని తీసుకుంటారనే అనుమానం ఎలాగూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అణచివేత , దౌర్జన్యం పేరు చెప్పి ఎన్నికల గోదా నుంచి తప్పుకుంటోంది.

ఆర్థికం అంతంతమాత్రం..

ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికలకు పెద్ద ఎత్తున వనరులు అవసరం. తీవ్రమైన పోరాటం చేసి ఒకటో అరా పదవులు తెచ్చుకున్నా ఒరిగేదేమీ ఉండదు. గెలిచిన చోటా మోటా నాయకులు అధికారపక్షం వైపు ఫిరాయిస్తారు. దీనికోసం వృథా శ్రమ పడటం ఎందుకని చంద్రబాబు యోచన. మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో అధిష్ఠానం ఆర్థికంగా అండదండలివ్వలేదని శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫలితంగానే చాలా సీట్లలో అధికారపార్టీ పైచేయి సాధించిందని కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా క్యాడర్ నుంచి , లోకల్ లీడర్ల నుంచి పార్టీపై నిధుల కోసం ఒత్తిడి వస్తోంది. సర్దుబాటు చేసే పరిస్థితి కూడా లేదని టీడీపీలో ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి పెద్దగా ఉపయోగపడని ఎన్నికలకు కోట్ల రూపాయల నిధులు పోయడం దండగ అనేది వారి మాట. పైపెచ్చు ఎంత ఖర్చు పెట్టినా అంతిమంగా గెలుపు అధికారపార్టీకే దక్కుతుందంటున్నారు. మరీ దారుణమైన ఫలితాలు ఎదురైతే మరోసారి వైసీపీ ఎద్దేవా చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ప్రజల్లో బలం లేదనే నెగటివ్ వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నిటిని ఆలోచించిన తర్వాతనే టీడీపీ బహిష్కరణాస్త్రం ప్రయోగించింది.

ఎస్ …ఏకపక్షమే..

నిజంగానే ఎన్నికల సంఘం వైఖరి ప్రశ్నార్థకమవుతోంది. అఖిలపక్ష సమావేశంలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించేశారు. తూతూ మంత్రంగా అఖిలపక్షాన్ని పిలిచారు. నిబంధనల మేరకు కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాహ్ని ఎదుర్కొన్నారు. అనేకసార్లు ఇదే విషయమై కోర్టు మెట్టెక్కాల్సి వచ్చింది. అందువల్ల పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరగవేమో అనే అనుమానానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఏదేమైనా గతం కారణంగా రాజ్యాంగ బద్ధ పదవిని స్వీకరించిన వారి విధి నిర్వహణను అంచనా వేయలేం. ప్రభుత్వ ఉద్యోగిగా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని శిరసా వహించినా ప్రస్తుతం స్వతంత్ర వ్యవస్థకు అధిపతిగా నిబంధనలను పాటించాల్సిందే. తెలుగుదేశం పార్టీ తాను అధికారంలో ఉన్పపుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమై ఉండేది కాదు. అయితే అప్పటికే ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు బయటపడిపోతాయనే అనుమానంతో వాయిదా వేసింది. ఇప్పుడు కనీసం పోటీ పడలేని దుస్థితిని కొని తెచ్చుకుంది.

అప్పట్లో కాంగ్రెస్ హయాంలో….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014లో కాంగ్రెసు హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు చాలా పారదర్శకంగా జరిగాయనే చెప్పాలి. అప్పట్లో సీమాంధ్ర ప్రాంతంలో వైసీపీ, టీడీపీ బలాబలాలకు అద్దం పట్టాయి. 2014 శాసనసభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా సూచన ప్రాయంగా వెల్లడించాయి. 5216 ఎంపీటీసీలు ,373 జెడ్పీటీసీలు టీడీపీకి వచ్చాయి. 4,199 ఎంపీటీసీలు,275 జెడ్పీటీసీలు వైసీపీకి దక్కాయి. అలాగే పురపాలక సంఘాల్లో 92కి గాను 58 టీడీపీకి, 16 వైసీపీకి వచ్చాయి. 18 పురపాలక సంఘాల్లో హంగ్ కనిపించింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ హంగ్ సీట్లనూ తన ఖాతాలో వేసేసుకుంది. ఈ రెండు పార్టీలు అధికారంలో లేకపోవడం, ప్రజల్లో బలమైన వ్యతిరేకత ఉన్న కాంగ్రెసు టైమ్ లో ఎన్నికలు జరగడం టీడీపీ, వైసీపీలకు కలిసొచ్చింది. కాంగ్రెసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మట్టి కొట్టుకుపోయింది. ఇప్పుడు టీడీపీ, వైపీపీల మధ్య రాజకీయ కక్ష పతాకస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో చావోరేవో అన్నట్లుగానే ఎన్నికలు సాగుతాయి. అర్ధ, అంగ, అధికార బలాలు దండిగా ఉన్న వైసీపీ ఎలాగూ పైచేయి సాధిస్తుంది. అయినప్పటికీ పోటీలోనే లేకపోవడమంటే ప్రజలకు ఆప్షన్ లేకుండా చేయడమే. ఫలితమేదైనా ప్రజాస్వామ్యంలో పోరాడాల్సిందే. మునిసిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు 30 శాతం ఓట్లు వేసిన సంగతిని టీడీపీ విస్మరిస్తోంది. ఇప్పుడు పలాయనం పఠిస్తే పార్టీ శ్రేణులు నిస్తేజమైపోతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 35930 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*