పర్ఫక్ట్ మూడ్ లో పదనిసలు…

పర్ఫెక్ట్ పొలిటికల్ మూడ్ సెట్ అయిపోయింది. జాతీయ చిత్రం సంగతి ఎలా ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల కోణం పూర్తిగా మారిపోయింది. చిత్రవిచిత్ర విన్యాసాలతో కొత్తపొత్తులు, ఎత్తులు సాగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు మొదలై పోయింది. సగటున పది కోట్లు, పటిష్టమైన పోటీ ఉన్నచోట్ల పాతికకోట్లు కనీసమొత్తంగా ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, టీఆర్ఎస్ ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో టీడీపీనే ముందంజ లో ఉంది. నిధుల అందచేత, వ్యయం పకడ్బందీగా చూసుకొనే విషయాల్లో చంద్రబాబు నాయుడు పక్కా ప్లానింగ్ తో ఉంటారు. కేసీఆర్ కూడా నిధుల విషయంలో ఈ సారి వెనుకంజ వేసేది లేదని నాయకులకు భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయిదు నుంచి పదికోట్ల రూపాయల వరకూ అధికారపక్షాలు పార్టీపరంగా ప్రతినియోజకవర్గంలో వ్యయం చేసేందుకు సంసిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాల అభ్యర్థులు మాత్రం సొంతజేబుల నుంచే ఈ నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పోటీ విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్కంఠ ఎక్కువగా నెలకొనబోతోంది.

పార్టీలు ఎక్కువ …పట్టు తక్కువ

తెలంగాణలో పార్టీల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెసు, ఎంఐఎం, బీజేపీ, టీడీపీ లు ఇప్పటికీ ప్రధానపార్టీలే. సీపీఎం ప్రధానపక్షంగా ఉన్న బీఎల్ఎఫ్, కోదండరామ్ నాయకత్వంలోని జనసమితి కొత్తగా రంగంలోకి దిగనున్నాయి. వైసీపీ కూడా పోటీలో ఉంటుందనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. సీపీఐ కాంగ్రెసుతో కలిసి నడిచే సూచనలున్నాయి. 2014 లో ఎనిమిదిపార్టీలు శాసనసభలో ప్రాతినిధ్యం వహించాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలకు మాత్రమేప్రాతినిధ్యం దక్కింది. తెలంగాణలో ఈసారి పోలరైజేషన్ గట్టిగా ఉండటంతో కొన్నిపార్టీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు. ప్రజల్లో బలం లేకున్నాప్రచారార్భాటం చేసే పార్టీల హడావిడి వినోదానికే తప్ప ఫలితాలను ప్రభావితం చేయలేదని చెబుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెసు, ఎంఐఎంలకు మాత్రమే సభలో ఎక్కువ ప్రాతినిద్యం ఉంటుందని ఇప్పటికే అనేక సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గతంలో కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీలు వేర్వేరుగా తలపడతాయి. ఈ రెండు పార్టీల ప్రభావం దాదాపు శూన్యంగానే ఉంటుందని టీఆర్ఎస్ ఇటీవల నిర్వహించుకున్న సర్వేల్లో తేలింది. బీఎల్ఎఫ్, తెలంగాణ జనసమితులు ఓట్ల చీలికలకు మినహా రాష్ట్రస్థాయి అధికారపక్షం తలరాతలను తారుమారు చేయగల స్థాయిలో ప్రభావం చూపలేవంటున్నారు. ఎంఐఎం మూడో పార్టీగా నిలిచే సూచనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పట్టుబిగిస్తున్న ద్రుష్ట్యా ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఈ దఫా మూడు పార్టీల ప్రాతినిధ్యానికే శాసనసభ పరిమితమైనా ఆశ్చర్యపోనవసరం లేదనేది పరిశీలకుల అంచనా.

కులాల కుంపటి…

ఆంధ్రప్రదేశ్ లో కులాల సమీకరణ ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గంలో 75 శాతం మంది ప్రజలు జనసేనకు అండగా నిలుస్తారంటూ ఉభయగోదావరి జిల్లాల్లో ఒక ప్రయివేటు అధ్యయన సంస్థ నిర్వహించిన నమూనా సర్వేలో తేలింది. రెడ్లలో 78 నుంచి 80 శాతం మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కమ్మ సామాజిక వర్గంలో 84 శాతం మంది తమకు ఇష్టమైన పార్టీగా టీడీపీనే ఎంచుకున్నారు. దీనినిబట్టి చూస్తే కులాలవారీ పొలిటికల్ పోలరైజేషన్ ఖాయంగా కనిపిస్తోంది. బీసీలు, దళితులు, ముస్లింలు ఎటు మొగ్గుచూపుతారనే విషయంలోనూ అనేక సందేహాలున్నాయి. గతంలో మాదిరిగా బీసీల్లో మెజార్టీ టీడీపీవైపు మొగ్గు చూపడం సాధ్యం కాదంటున్నారు. కొప్పుల వెలమ, తూర్పు కాపు వంటి బీసీ సామాజికవర్గాలు వివిధ కారణాలతో టీడీపీకి దూరమయ్యాయి. షెడ్యూల్డుకులాలు, తెగలకు చెందినవారిలో మెజార్టీ ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేది అంచనా. 2014లో ముస్లిం లు వైసీపీకి అండగా నిలిచారు. ఈ కాంబినేషన్ ను దెబ్బతీయడానికి టీడీపీ తాజాగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ఈ సామాజిక వర్గంలో 60 శాతం మంది మద్దతు వైసీపీకేననేది సర్వేల సారాంశం. మిగిలిన 40 శాతంలో మూడు శాతం కాంగ్రెసు 37 శాతం టీడీపీకి ఓట్లేసే అవకాశాలున్నట్లు సర్వేక్షకులు అంచనా వేస్తున్నారు.

తలపోట్లు.. తప్పవా..?..

జిల్లాలలో కీలకంగా ప్రభావం చూపగల నాయకులు కొందరున్నారు. వారి నుంచే ఈసారి టీడీపీ అధిష్టానానికి తలపోట్లు తలెత్తవచ్చంటున్నారు. అటువంటివారిలో అనంతపురానికి చెందిన జేసీ దివాకరరెడ్డి ఒకరు. జిల్లాలో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో సగానికిపైగా పనికిరారని ఆయన తేల్చేశారు. తన మనుషులకే టిక్కెట్లు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. లేకపోతే జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపగల స్థాయి జేసీకి ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేరు ప్రఖ్యాతులున్న ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వంపై దాడిని కొనసాగిస్తున్నారు. కాపు నాయకుడు ముద్రగడ సంగతి సరేసరి. తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నరసింహుల పర్యటనలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలోని మాదిగ సామాజికవర్గంలో టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో ప్రతిపక్ష వైసీపీ కంటే ఎంతో ముందంజలో ఉంటుంది టీడీపీ. కానీ ఈ సామాజిక సమీకరణలు ఆ పార్టీకి కొంత ఆటంకంగా మారనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*