ఈసారి ట్రయాంగిల్ బిగ్ ఫైట్….!

తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ అచ్చిరాలేదు. తిరుపతి నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ కేవలం మూడుసార్లు మాత్రమే విజయం సాధించగలిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కష్టాలు తప్పేట్లు లేవు. ముఖ్యంగా ఈసారి తిరుపతిలో త్రిముఖ పోటీ నెలకొని ఉంటుందన్నది వాస్తవం. ఈ ట్రయాంగల్ ఫైట్ విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.తిరుపతి నియోజకవర్గం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఉండటం విశేషం.

టీడీపీ ఇక్కడ అతి తక్కువగా…..

తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1994లో టీడీపీ అభ్యర్థిగా మోహన్, 1999లో చదలవాడ కృష్ణమూర్తి, 2014 ఎన్నికలలో వెంకటరమణ గెలిచారు. వెంకటరమణ అకాల మరణంతో ఆయన భార్య సుగుణమ్మ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా సుగుణమ్మ సానుభూతి పెల్లుబకడంతో దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ ని సాధించారు. అయితే వెంకటరమణ మాదిరిగా సుగుణమ్మ పాలిటిక్స్ ను నడపలేరి పోతున్నారన్నది వాస్తవం. భర్త వెంకటరమణ ఉన్నంత వరకూ ఇంటికే పరిమితమైన సుగుణమ్మను నియోజకవర్గంలో టీడీపీ నేతలే బేఖాతరు చేస్తుండటం గమనార్హం.

చదలవాడ పార్టీ మారుతుండటంతో…..

అయితే ఇదే నియోజకవర్గంలో పట్టున్న నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు చదలవాడ కృష్ణమూర్తి పార్టీకి గుడ్ బై చెబుతుండటం పార్టీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. చదలవాడ కృష్ణమూర్తి వచ్చే విజయదశమి రోజున జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి టిక్కెట్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి తిరుపతి బరిలో చదలవాడ జనసేన అభ్యర్థిగా ఉంటారని ఆయన అనుచరులు ఫుల్లు కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. దీంతో ఒక సామాజిక వర్గం ఓట్లతో పాటు వీరాభిమానులు ఉండే తిరుపతి నియోజకవర్గంలో జనసేన పాగా వేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుండటం విశేషం. 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇక్కడి నుంచే విజయం సాధించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

భూమన వర్గం ధీమా ఇదే…..

కాని వచ్చే ఎన్నికలలో టీడీపీ టిక్కెట్ సుగుణమ్మకు ఇస్తరా? లేదా? అన్నది సస్పెన్స్. ఒకవేళ సుగుణమ్మకు ఇక్కడ టిక్కెట్ ఇచ్చినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇక్కడ భూమన కరుణాకరెడ్డి బరిలో ఉండటం ఖాయం. భూమన కరుణాకర్ రెడ్డి ఒకసారి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన గెలుపొందారు. అప్పటి నుంచి భూమన ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి నియోజకవర్గంలో బలం పెంచుకున్నారు. ఈసారి తనదే గెలుపు అన్న ధీమాలో ఉన్నారు. జనసేనకు పడే ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవేనని, దీంతో తమ విజయం నల్లేరు మీద నడకేనని భూమన వర్గం చెబుతోంది. మొత్తం మీద తిరుపతి నియోజకవర్గంలో ఈసారి బిగ్ ఫైట్ తప్పదని చెప్పక తప్పదు.

Ravi Batchali
About Ravi Batchali 41286 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*