రగడ…రగడ…రగడ…!!!

రాజ‌కీయాల్లో కొత్త‌పుంత‌లు క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ల‌కు సైతం జూనియ‌ర్లు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. నువ్వా -నేనా అనే రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నా యి. ఇక‌, ఇక్క‌డే మ‌రో కొత్త విష‌యం వెలుగు చూస్తోంది. టీడీపీలోనే కొంద‌రు జూనియ‌ర్లు.. సీనియ‌ర్ల టికెట్ల‌పై దృష్టి పెట్టారు. సీనియ‌ర్లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టికెట్ల‌ను జూనియ‌ర్లు ఆశిస్తున్నారు. దీంతో టికెట్ల ర‌గ‌డ తార‌స్థాయిలో జూనియ‌ర్ వ‌ర్సెస్ సీనియ‌ర్ అనే రేంజ్‌లో సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాల స‌మ‌యం మాత్రమే ఉంది. ఈ నేప‌థ్యంలో చాలా మంది సీనియ‌ర్లు, ముఖ్యంగా 30 ఏళ్ల‌కు పైబ‌డి రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపుతున్నారు.

నియోజకవర్గాలు పెరిగి ఉంటే…

ఈ క్ర‌మంలో టికెట్ల‌కు చాలా డిమాండ్ పెరిగింది. అనంత‌పురం, క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లో.. టీడీపీ సీనియ‌ర్లు.. త‌మ వార‌సుల‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఉంటే ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చి ఉండేది కాదు. కానీ, ఈ విష‌యంలో కేంద్రం నిమ్మ‌కు నీరెత్తినట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో అధికార పార్టీలో టికెట్ల స‌మ‌స్య వ‌స్తోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల గ‌డువు ఉండ‌గానే.. క‌ర్నూలు అసెంబ్లీ సీటుకోసం పోటా పోటీగా యుద్ధం ప్రారంభ‌మైంది. అధికార పార్టీ టీడీపీలో ఈ ర‌గ‌డ తార‌స్థాయికి చేరుతోంది. కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌గా, మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన టీజీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

పోటీ చేస్తానంటూ….

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్నారు. దీనికి ఆయ‌న కుమారుడు టీజీ భ‌ర‌త్ కూడారెడీ అయ్యారు. అయితే, ఇక్క‌డే అస‌లు సిస‌లు స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌ర్నూలు ఎమ్మెల్యేగా సీనియ‌ర్ నేత ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే టికెట్ పై పోటీ చేయాల‌ని ఆయ‌న బావిస్తున్నారు. అయితే, ఎస్వీ మోహన్‌రెడ్డితో నేరుగా తేల్చుకునేందుకు టీజీ భరత్‌ సిద్ధపడుతున్నారు. ఇందుకోసం నేరుగా ఆయ‌న‌ ప్రజల వద్దకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. విజన్‌ యాత్ర పేరుతో 33 వార్డుల పర్యటనకు తెరలేపారు. ఈ నెల‌ 9వ తేదీ లేదా 27వ తేదీన ఈ యాత్రను ప్రారంభించను న్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు 2019 ఎన్నికల ఎజెండా కూడా ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎస్వీ, టీజీ మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బల నిరూపణకు….

ఇప్పటికే వార్డుల వారీగా ఎమ్మెల్యే ఎస్వీ పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో టీజీ భరత్‌ కూడా వార్డు పర్యటనల ద్వారా తన అనుచరులను పెంచుకోవ‌డంతోపాటు బలాన్ని ప్రదర్శించేందుకు కూడా దోహదపడుతుందనేది ఆయన అభిప్రాయంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని టీజీ భరత్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తనను పోటీ నుంచి ఎవ్వరూ తప్పించలేరని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఇప్పటికే ప్రకటించారు. అయితే, సీట్లను ప్రకటించేందుకు లోకేశ్‌ ఎవరంటూ భరత్‌ తండ్రి టీజీ వెంకటేష్‌ మండిపడ్డారు.

విభేదాలు మరింత ముదురుతాయా?

టీజీ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క‌, కర్నూలు నగరంలో ఎమ్మెల్యే ఎస్వీకి పోటీగా టీజీ భరత్‌ అదే పార్టీ కండువా కప్పుకుని పర్యటిస్తే అడ్డుచెబుతారా? లేదా? అన్న‌ది చూడాలి. వార్డుల వారీగా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే వైఖరిని కూడా ఆయన ఎండగట్టే అవకాశముంది. ఇదే జరిగితే ఇరువర్గాల మధ్య పోటీ మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి. మ‌రి సీనియ‌ర్‌.. ఈ జూనియ‌ర్‌ను క‌ట్ట‌డి చేస్తారా? లేదా? రాజ‌కీయం ఇక్క‌డ ఎలాంటి మ‌లుపు తిరుగుతుంది? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2780 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*