
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరి కొద్ది రోజుల సమయం ఉంది. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి తాము ఎలా అధికారంలోకి వస్తామో లెక్కలు వేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. జిల్లాల వారీగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ? నివేదికలు తెప్పించుకుంటున్నాయి. తమకు అనుకూల ఫలితాలు ఏ జిల్లాలో వస్తాయి, ఏ జిల్లాలో వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ మనకు మైనస్లు ఉన్నాయి… అన్న లెక్కల్లో పార్టీల కీలక నేతలు మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఈ సారి ఫలితాలు ఎలా ? ఉండబోతున్నాయి. అన్న ఆసక్తి రెండు ప్రధాన పార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగటు ఓటరుకు సైతం ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలో గత మూడు ఎన్నికల్లో టిడిపి వెనకబడిపోతూ వస్తోంది.
ఈసారి ఎక్కువగా….
2004, 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు ఎన్నికల్లోనూ వైఎస్ చిత్తూరు జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు గెలిచినా… తన సొంత జిల్లాలో మాత్రం వైసీపీ జోరు ముందు నిలువలేకపోయారు. చిత్తూరు జిల్లాలో రెండు ఎంపీ సీట్లతో పాటు, 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కుప్పం నుంచి వచ్చే మెజార్టీతో చిత్తూరు ఎంపీ సీటును గెలుచుకున్న టిడిపి తిరుపతి ఎంపీ సీటు కోల్పోయింది. గత ఎన్నికల్లో టిడిపి ఆరు సీట్లు, వైసిపి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగా… చెరో ఎంపీ సీటు దక్కించుకున్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న రాజంపేట లోక్సభ సీటుపై సైతం వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత జిల్లాలో వైసీపీ కంటే ఎక్కువ సీట్లు సాధించాలని చాలా కసితో ఉన్నారు.
రెండు దశాబ్దాలుగా…
తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో రెండు దశాబ్దాలుగా టిడిపి జెండా ఎగరలేదు. ఈ క్రమంలోనే చంద్రగిరిని ఈ సారి ఎలాగైనా గెలుచుకోవాలని పక్కా ప్రణాళికతో ఆరు నెలల ముందే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నాని పేరును అక్కడ టిడిపి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక జిల్లాలో వైసిపికి పెద్దదిక్కుగా ఉండడంతో పాటు ఇటు టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు మంత్రి అమరనాథ రెడ్డి మరదలు అనీషా రెడ్డిని పుంగనూరు నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం కూడా ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పోటీ చేయడంతో ఈ సీటు ఈ సారి రెండు పార్టీలకు అత్యంత కీలకమైన సీటుగా ఉంది.
క్షేత్రస్థాయిలో మాత్రం….
ఇక పోలింగ్ సరళిని బట్టి చూస్తే గత ఎన్నికల్లో టిడిపి గెలిచిన స్థానాలు చిత్తూరు, తిరుపతిలో ఈ సారి హోరాహోరీ పోరు నడిచింది. చంద్రగిరిలో అంచనాలకు మించి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలోకి రావడంతో పీలేరులో టిడిపి వైసిపికి చెమటలు పట్టించింది. పోలింగ్ ముగిశాక టిడిపి ఈ సారి తాము జిల్లాలో వైసీపీ కంటే మెజార్టీ సీట్లు సాధిస్తామని చెబుతున్నా… క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మళ్లీ వైసీపీకే మెజార్టీ సీట్లు వచ్చేలా ఉన్నాయేమో అన్న చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో అయినా చంద్రబాబు తన సొంత జిల్లాలో వైసిపి కంటే మెజార్టీ సీట్లు సాధించకపోతే రెండు దశాబ్దాలుగా ఆయన తన సొంత జిల్లాలోనే పట్టు లేని వ్యక్తిగా మిగిలిపోవాల్సి ఉంటుంది.
Leave a Reply