ఫ్యాన్ గాలిని అడ్డుకుందిలా ….?

telugudesam-party-in-fan-wave

తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాన్ గాలిని ఎదురించి నిలిచిన టిడిపి లో నలుగురు మాత్రం ఒడ్డున పడ్డారు. ఇంతటి ప్రభంజనాన్ని వారు తట్టుకుని నిలబడటానికి కారణం పోల్ మేనేజ్ మెంట్ తప్ప మరేమి కాదంటున్నారు. గతానికన్నా భిన్నంగా పోల్ మేనేజ్ మెంట్ లో వైసిపి కూడా ఏమీ తక్కువ తినలేదు. టిడిపి తో నువ్వా..? నేనా…? అనే రీతిలోనే తలబడింది. ఎక్కడైతే వైసిపి ఈ అంశంలో వెనుకబడిందో అక్కడే సీటు కోల్పోయింది. సరిగ్గా ఇక్కడే టిడిపి జెండా ఎగిరిపోకుండా కాపాడుకోగలిగింది.

పోల్ మేనేజ్ మెంట్ అంటే ….

పోల్ మేనేజ్ మెంట్ అంటే మరేమీ లేదు. అటు పార్టీలోని క్యాడర్ ను అన్ని విధాలా సంతృప్తి పరచడం, పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్లకు డబ్బులు నేరుగా అందజేయగలగడం, ఎన్నికల ప్రచారం సాగినంత కాలం మద్యం, బిర్యానీ వంటివి అందిస్తూ తమచుట్టూ వున్నవారిని ఉత్సహపరచడం వంటివన్నీ. ఇవి 2014 లో సక్రమంగా చేయలేక వైసిపి చేతులెత్తేసింది. అయితే అతి విశ్వాసంతో వున్న టిడిపి లోని అభ్యర్థులు వైసిపి ని తక్కువ అంచనా వేసి దెబ్బ తిన్నారు అని తేలిపోయింది.

నెంబర్ వన్ ఆయన ….

ఓటర్లకు డబ్బుల పంపిణీలో జిల్లాల్లో అత్యధికంగా ఖర్చు చేసిన ప్రత్తిపాడుకు చెందిన నేత వైసిపి అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. ఇక్కడ ఫ్యాన్ గాలి దెబ్బకు టిడిపి పోల్ మేనేజ్ మెంట్ కానీ మారే ఇతర ప్రభావాలు తుక్కయిపోయాయి. అయితే మండపేట నుంచి పోటీ చేసిన వేగుళ్ల జోగేశ్వర రావు అద్భుతంగా పోల్ మేనేజ్ మెంట్ లో తొలి నుంచి దూసుకుపోయారు. ఆయన దేనికి క్యాడర్ ను కానీ ప్రజలను కానీ అసంతృప్తికి గురిచేయకుండా ఫ్యాన్ గాలికి అడ్డంగా నిలబడిపోయారు. పెద్దాపురం నియోజకవర్గం లో హోం మంత్రి చినరాజప్ప పోల్ మేనేజ్ మెంట్ లో సక్సెస్ అయ్యారు. తన గెలుపు జనసేన రాకతో కష్టమే అని సర్వేలు తేల్చడంతో జాగ్రత్త పడ్డ రాజప్ప తొలి నుంచి ముందుచూపుతో వ్యవహహరించారు. ఆ కష్టమే ఆయన్ను కాపాడింది.

రాజమండ్రి వన్ టూ అంతే గా …

రాజమండ్రి వన్ టూ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు గా బరిలోకి దిగిన ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలని కసిగా పనిచేశారు. వీరిద్దరి పోల్ మేనేజ్ మెంట్ దెబ్బకు వైసిపి కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది. వీరిద్దరికి భారీ మెజారిటీలే వరించడం గమనిస్తే ఫ్యాన్ గాలిని ఎలా తిప్పికొట్టారో అర్ధమౌతుంది. దీనికి తోడు అర్బన్ ఓటర్ల మొగ్గు ఎప్పుడు టిడిపి వైపే వుంటూ వస్తున్న నేపధ్యం వీరికి కలిసి వచ్చింది.

అసలు దెబ్బ అక్కడ పడింది….

పోల్ మేనేజ్ మెంట్ లో మిగిలిన టిడిపి అభ్యర్థులు వెనక్కి తగ్గడానికి చాలా కారణాలే వున్నా సర్కార్ అందించిన పసుపు కుంకుమ కొంప ముంచిందని తేలింది. ఎలాగూ పదివేల రూపాయలు నేరుగా మహిళల ఎకౌంట్ లకు చేరుతున్న నేపథ్యంలో అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయడం దేనికి అని భావించి పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా కొందరు నొక్కేయడం ఇప్పుడు మొదటికే మోసాన్ని కొని తెచ్చిందని పసుపు పార్టీ లో అంతర్గత చర్చ సాగుతుంది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం పసుపు కుంకుమ తో గంప గుత్తగా మహిళా ఓట్లు తమకే పడతాయని అనుకోవడం వారికి ఓటు మామూలు ఇవ్వకపోవడం అక్కడక్కడా ఇచ్చినా అరకొరగా ఇవ్వడం మైనస్ అయ్యిందని టాక్ నడుస్తుంది. మొత్తానికి కౌంటింగ్ పూర్తి అయ్యి కొత్త సర్కార్ కొలువు తీరినా టిడిపి లో అంతర్మధనం ఇప్పట్లో ఆగేలా లేదు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1442 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*