
అసలే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే తెలుగు తమ్ముళ్లలో సయోధ్య కొరవడింది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తెలుగుదేశంపార్టీ నేతలు మాత్రం నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో ఈ ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లాలో నిన్నమొన్నటి వరకూ ఆళ్లగడ్డ సమస్య పార్టీని ఇబ్బందుల పాలుజేసింది. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రెండు రోజుల పాటు పంచాయతీ చేయడంతో కొంత సద్దుమణిగినట్లే కన్పిస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి అది మళ్లీ రాజకుంటుందన్న వాదనలు కూడా ఉన్నాయి. చంద్రబాబు స్వయంగా ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియకు నచ్చజెప్పి పంపినా ఎడమొహం, పెడమొహంగానే ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.
కోడుమూరులోనూ….
ఇక ఇదే జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్ చార్జి విష్ణువర్థన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. విష్ణువర్థన్ రెడ్డి ఎమ్మెల్యేను సయితం లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాలను చేస్తుండటంతో ఎమ్మెల్యే ఈ పార్టీలోకి ఎందుకొచ్చానా? అని మధనపడుతున్నారు. ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాను పార్టీలో నుంచి వెళ్లిపోతానన్న సంకేతాలను కూడా అధిష్టానానికి పంపారు మణిగాంధీ. దీంతో త్వరలోనే వీరిద్దరి పంచాయతీని స్వయంగా చంద్రబాబు చేయనున్నట్లు సమాచారం.
కర్నూలు సీటుపైనా…..
ఇక కర్నూలు ఎమ్మెల్యే సీటుపై కూడా రగడ కొనసాగుతూనే ఉంది. ఒక ఫ్యామిలీకి ఇన్ని టిక్కెట్లు ఇస్తే ఎలా? అన్నకోణంలో టీజీ ఫ్యామిలీ అధిష్టానంపై వత్తిడి తెస్తోంది. కర్నూలు పట్టణంలో బలమైన నేతగా ఉన్న టీజీ వెంకటేశ్ ఈసారి ఆ స్థానం నుంచి తన కుమారుడు భరత్ ను పోటీకి దింపాలనుకుంటున్నారు. భరత్ కూడా పార్టీ కార్యక్రమాల్లోనూ, పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం కర్నూలు సీటు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ వీధిన పడకపోయినప్పటికీ పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం తమ కోరికలను బయటపెట్టుకుంటున్నారు. ఈ సీటు ఖరారు విషయంలో కూడా చంద్రబాబుకు చిక్కులు తప్పవంటున్నారు.
జమ్మలమడుగు పరిస్థితి……
ఇక కడప జిల్లాలో కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. కడప జిల్లా జమ్మలమడుగు ఈసారి నాదేనంటూ రెండు వర్గాలు బహిరంగ ప్రకటనలు చేసుకోవడం పార్టీకి ఇబ్బందికర పరిణామమే. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరారు. మంత్రి కూడా అయ్యారు. అయితే ఇటీవల ఆదినారాయణరెడ్డిచేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడుతున్నారు. జమ్మలమడుగు టిక్కెట్ తనదేనని చెప్పటానికి ఆయనెవరు అని ప్రశ్నించారు. టిక్కెట్ల కేటాయింపు మంత్రుల చేతుల్లో ఉండదని చురకలంటించారు. అలాగే బద్వేలు నియోజకవర్గంలో కూడా జయరాములు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో ఆయన అవస్థలు పడుతున్నారు. ఇటీవల రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు. మంత్రులుకూడా విజయమ్మకే మద్దతిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సీమ జిల్లాల్లో చంద్రబాబుకు ఈసారి సమస్యలు తప్పేట్లు లేదన్నది సీనియర్ నేతల అభిప్రాయం కూడా. మరి వీటిని బాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Leave a Reply