
తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవుతుందా? ఇక ఆ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యమే ఉండదా? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే పసుపు జెండా తెలంగాణ అసెంబ్లీలో కనపడదా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీఎన్నికల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అదికూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయినఖమ్మంలోనే ఆ సీట్లను టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ ఉనికి తెలంగాణలో ఉండకూడదని భావించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఇద్దరిని టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
వేగంగా పావులు…..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ తెరలేపారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే చేర్చుకోవాలన్న నిర్ణయం గులాబీ బాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారు కేసీఆర్. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. రామగుండం నుంచి గెలిచిన కోరుకంటిచందర్, వైరా నుంచి గెలిచిన రాములు నాయక్ లు స్వతంత్ర అభ్యర్ధులు కావడంతో ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు.
టీఆర్ఎస్ లోకి విలీనం…..
ఇక సత్తుపల్లి నుంచి టీడీపీ గుర్తు మీద గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చానాగేశ్వరరావులును తొలుత పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమయినట్లుతెలుస్తోంది. ఇద్దరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకుని టీడీపీ ఉనికిని తెలంగాణలో లేకుండాచేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. టీడీపీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసేలా వ్యూహాన్నిరచించారు. అయితే తొలుత సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి ఇస్తారన్న ఊహాగానాలు విన్పించాయి. కానీ పార్టీ మారిన వ్యక్తికి కేబినెట్ లో స్థానం కల్పించేందుకు ఇష్టపడని కేసీఆర్ అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.
వారి పదవులు ఇవేనా?
సండ్ర వెంకటవీరయ్యకు మిషన్ భగీరధ ఛైర్మన్ గా నియమించవచ్చన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. అలాగే మెచ్చా నాగేశ్వరరావుకు గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు పదవులకూ వారు అంగీకరిస్తే వెంటనే టీడీపీ శాసనసభ పక్షాన్ని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న యోచనలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పార్టీని విలీనం చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో ఇక్కడ టీడీపీ అడ్రస్ గల్లంతయినట్లే.
Leave a Reply