సైకిల్ …కాంగ్రెస్ … ఇక రాలనున్న వికెట్లు …!!

‘‘జాతిని బీజేపీ నుంచి రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’’ అనే గొప్ప స్లోగన్ తో చంద్రబాబు తమ బద్ద విరోధి కాంగ్రెస్ తో జట్టు కట్టేశారు. కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణ ఎన్నికల వరకే పరిమితం అంటూ గతంలో ప్రకటించిన టిడిపి దానికి భిన్నంగా ఏపీలో కూడా ఆపార్టీతో ముందుకు సాగడమే ఖాయమన్న సందేశాన్ని ఇప్పటికే చంద్రబాబు ఇచ్చేశారు. కాంగ్రెస్ టిడిపి దోస్తీ పై గతంలో రెండు పార్టీల్లో ప్రకంపనలు వెలువడ్డాయి. టిడిపిలో సీనియర్ నేతలు పాలిట్ బ్యూరో సభ్యులు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణ మూర్తి వంటివారు ఘాటుగా స్పందించారు కూడా. అయితే ఇప్పుడు వారినుంచి తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

వట్టి తో మొదలు …

మాజీ మంత్రి కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వట్టి వసంత కుమార్ పార్టీకి రాజీనామాతో ప్రకంపనలు హస్తంలో మొదలయ్యాయి. ఇవి మరింత విస్తరించే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి టిడిపి ని విరోధి భావంతో చూసిన వారంతా ఇప్పుడు సొంత పార్టీకి గుడ్ బై కొట్టి తమ దారి తాము చూసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి లో ఏ స్థాయిలో నేతలు బయటకు వస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మరో ఆరునెలల పాటు అధికారం ఉండగా సైకిల్ కాంగ్రెస్ అనుకుని పార్టీకి దూరం కావడం వల్ల నష్టమే జరుగుతుందని వారు లెక్కలు వేస్తున్నారు.

టిక్కెట్ దక్కకుంటే….

ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేసి పార్టీ టికెట్ దక్కని పక్షంలో తమ అధినేత తప్పటడుగులపై పోరాటం అంటూ బయటకు వెళ్లే అవకాశాలే అధికమంటున్నారు. ఇప్పటికే దాదాపు నలభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కష్టమని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. దీంతో పాటు మరికొందరు పార్టీ ఇన్ ఛార్జులు కూడా ఈసారి టిక్కెట్ పై ఆశలుపెట్టుకున్నారు. వీరంతా వచ్చే రోజుల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి ప్రయాణం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం మాత్రం ఉంది. మరి రాబోయే రోజుల్లో సైకిల్ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1688 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*