
ఏపీ పాలిటిక్స్‌లో కొత్త రక్తం ఉరకలు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 50 మందికి పైగా యువ సైన్యం టీడీపీని ముందుకు నడిపించే అవకాశం ఉందని ఇప్పటికే లెక్కలు స్పష్టమయ్యాయి. ఇప్పటికే సీనియర్లుగా ఉన్న పార్టీలోని కొందరు నాయకులు వారి వారసులను రంగ ప్రవేశం చేయించేందుకు రెడీ అయ్యారు. ఇక, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇద్దరు ముగ్గురు నాయకులు సైతం వారితోపాటు వారివారసులకుకూడా టికెట్లు ఇప్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఏపీలో రాజకీయ యువరక్తంతో నిండిపోవడం ఖాయమనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీలో సీనియర్ మోస్టులుగా చాలా మంది ఉన్నారు. వీరంతా దాదాపు 35 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నారు.
యువరక్తం నింపేందుకు…..
వీరిలో కొందరు విశ్రాంతి కోసం.. మరికొందరు అనారోగ్య కారణాలు, ఇంకొందరు ప్రజాక్షేత్రాల్లోకి తమ వారసులను ప్రవేశ పెట్టి వారు నామినేటెడ్పదవులతో కాలక్షేపం చేయాలని భావిస్తున్నారు. దీంతో గుంటూరు, అనంతపురం, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల్లో వారసత్వ రాజకీయాలు తెరమీదికి వస్తున్నాయి. దివంగత కె ఎర్రన్నాయుడు వారసుడు కింజరపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడుతో పాటు పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వారేంటో నిరూపించు కుంటున్నారు. రామ్మోహన్నాయుడు ఇప్పటికే ఎంపీగా పార్లమెంటులో తెలుగోడి దమ్మేంటో చూపిస్తున్నాడు. మిగిలిన నాయకుల వారసులను కూడా రంగంలోకి దింపి లేలేత వయసు పార్టీగా తెలుగుదేశాన్ని తీర్చి దిద్దాలని చంద్రబాబు ప్రణాళికలు రిచిస్తున్నట్టు తెలుస్తోంది.
బాబు గ్రీన్ సిగ్నల్…..
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీలోని సీనియర్ నేతలంతా పక్కకు తప్పుకుని యువతను రంగంలోకి దించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నియోజకవర్గ బాధ్యతలు కొడుకులకు అప్పగించి తాము పర్యవేక్షణ పాత్రకే పరిమితం అయ్యారని సమాచారం. యువతకు ఛాన్స్ ఇస్తే వచ్చే 2024 కి వారంతా రాటుదేరుతారని నేతలు భావిస్తున్నారట. అందుకే సీనియర్ నేతల స్థానాల్లో వారి పిల్లల పొలిటికల్ లాంచింగ్ కు 2019 ఎన్నికలను ఎంచుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
విశ్రాంతి తీసుకుని……
తన బదులు తన కుమార్తె శిరీషకు అవకాశమివ్వాలని కోరారు. దీనికి అధిష్ఠానం సమ్మతించింది. అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కుమారుడు శ్యామ్‌కు టికెట్ ఇవ్వాలని ఆయన పార్టీ అధినేతను కోరారని తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి.. తన కుమారుడు అస్మిత్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. ఇక జేసీ బ్రదర్స్‌లో మరో సోదరుడు అనంత ఎంపీ దివాకర్‌రెడ్డి తన తనయుడు పవన్‌కుమార్‌రెడ్డిని ఈ సారి అనంత ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా తన తనయుడు సుధీర్‌రెడ్డి రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.
గల్లా అరుణ కూడా…..
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఈసారి పోటీ చేయబోనని ఎప్పుడో చెప్పేశారు. మరి ఈ సీటు పై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఆమె కూడా తన వారసురాలు రమాదేవిని అసెంబ్లీకి పోటీ చేయించాలని ప్లాన్‌లో ఉన్నారు. అదేవిధంగా కరణం బలరామ కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి తన కుమారుడిని దింపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తన కుమారుడు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిపించు కోవాలని చూస్తున్నారు.
Leave a Reply