జెండా మార్చేస్తామని వార్నింగ్

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదని తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి నెలకొని ఉంది. ఈ అసంతృప్తిని వైసీపీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డ ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక పోస్ట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. అయితే నాలుగేళ్ల నుంచి నామినేటెడ్ పోస్టులను జిల్లాల్లో భర్తీ చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ ద్వితీయశ్రేణి నేతలు అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ కోసం కష్టపడినా….

పార్టీ కోసం కష్టపడ్డవారికి పదవులు దక్కకపోవడానికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యేలేనన్నది వారి ఆరోపణ. తాము ఎన్నికల సమయంలో పైసా ఆశించకుండా పార్టీ జెండా పట్టుకుని పగలూ రేయి కష్టపడితే గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం మానేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో అనేక మంది ద్వితీయశ్రేణి నేతలు మంత్రుల ఎదుటే తమ నిరసనను తెలియజేశారు. ఎమ్మెల్యే పక్కన ఉండి సపర్యలు చేసిన వారికే పదవులు దక్కుతున్నాయని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారికి దక్కడం లేదని వారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకే ఫిర్యాదు చేయడం విశేషం. ఇలా అనేకచోట్ల ఇలాగే తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారు.

వైసీపీ నేతల ఎర….

అయితే దీనిని గమనించిన వైసీపీ నేతలు వారిని తమ గూటికి రప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీలోకి వస్తే తగిన ప్రాధాన్యత వస్తుందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వారిలో ఇప్పటికే కొందరు ఫ్యాన్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు బుజ్జగింపులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఇలాగే కొందరు నేతలు వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండగా ఆ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు వారిని బుజ్జగించడంతో మహానాడు వరకూ సమయం ఇచ్చినట్లు చెబుతున్నారు. మహానాడులోగా తమకు నామినేటెడ్ పోస్టులు దక్కకుంటే జెండా మార్చేస్తామంటున్నారు కొందరు తెలుగుతమ్ముళ్లు.

ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరే….

ద్వితీయ శ్రేణి నేతల్లో ఇంతటి అసంతృప్తి పెరగడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ ఛార్జి మంత్రులే కారణమంటున్నారు. ఎమ్మెల్యే కొందరి పేర్లను సిఫార్సు చేసినా ఇన్ చార్జి మంత్రో, పార్లమెంటు సభ్యుడో అడ్డుపడి ఆ పదవిని భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే ఒకరికిస్తే మరొకరిని దూరం చేసుకోవడమెందుకని ఈ నాలుగేళ్లుగా వాటి జోలికి పోలేదు. ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ద్వితీయ శ్రేణి నేతల డిమాండ్లు కూడా ఎక్కువగానే విన్పిస్తున్నాయి. తమకు పోస్టు దక్కకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి పనిచేసేది లేదని ఎమ్మెల్యే ముఖానే చెప్పేస్తుండటం విశేషం. ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు హడావిడిగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయించుకునేందుకు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. అంతేగా మరి….ఎమ్మెల్యేలే పార్టీ మారుతున్నప్పుడు…పదవుల కోసం ద్వితీయ శ్రేణి నేతలు జెండా మారిస్తే తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 29055 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*