ఇక్కడ టీడీపీకి తిరుగులేదన్నమాట…..!!

పశ్చిమగోదావరి జిల్లాలో తొలి నుంచి రిజర్వ్‌డ్‌ స్థానంగా ఉన్న గోపాలపురం నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక‌ 2004 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఆ పార్టీ ఓడిపోగా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడే వెన్నుద‌న్నుగా నిలిచే కమ్మ సామాజికవర్గం ఓటర్లు జిల్లాలోనే అత్యధికంగా ఉన్న నియోజకవర్గం గోపాలపురం. గోపాలపురం నియోజకవర్గంలో గోపాలపురం, దేవరపల్లి, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాలు ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలు టీడీపీకి పెట్టని కోటలుగా ఉండడంతో ఇక్కడ టీడీపీ గెలుపు సులువు అవుతోంది. ఈ నియోజకవర్గంలో 40 వేలకు కాస్త అటూ ఇటుగా ఉన్న కమ్మ సామాజికవర్గ ఓటర్లు మెజారిటీ ఓటర్లు పార్టీ అభ్యర్థి ఎవరన్నదానితో సంబంధం లేకుండా సైకిల్‌ గుర్తుకే ఓట్లు వెయ్యడంతో టీడీపీకి తిరుగు లేకుండా ఉంది.

విపక్ష ఎమ్మెల్యే ఆమె ఒక్కరే…..

ఈ నియోజకవర్గం నుంచి 1983,85,89లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుపాటి వివేకానంద హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. 1994, 99 ఎన్నికల్లో జొన్నకూటి బాబాజీరావు రెండు సార్లు గెలిచారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి మద్దాల సునీత విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించాక కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సునీత కావడం గమనార్భం. ఇక 2009లో బాబాజీరావు కుమార్తె తానేటి వనిత, 2014లో ప్రముఖ న్యాయవాది ముప్పిడి వెంకటేశ్వరరావు గెలిచారు. టీడీపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రాధినిత్యం వహిస్తున్నారు. సామాజికవర్గాల పరంగా చూస్తే నియోజకవర్గం మొత్తం కమ్మ సామాజికవర్గం కనుసన్నల్లోనే ఉంటుంది. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలోనూ వాళ్లు చెప్పిందే వేదం.

గ్రూపు రాజకీయాలతో…..

నాలుగున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో తాపత్రాయ పడుతున్న నాలుగు మండలాల్లోనూ ఉన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఆయన మూడు అడుగులు ముందుకు వేస్తే ఆయ‌న్ను నాయ‌కులు ఆరడుగులు వెనక్కు లాగుతున్న చందంగా పరిస్థితి ఉంది. వ్యక్తిగతంగా సౌమ్యుడే అన్న పేరున్న నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను పరిష్కరించడంలో మాత్రం ముప్పిడి ఫేల్‌ అయ్యారు. ముప్పిడికి ఉండాల్సిన సమస్యలు ముప్పిడికి ఉన్నాయి. ఒక వర్గానికి సపోర్ట్‌ చేస్తే రెండో వర్గానికి వ్యతిరేఖం అవ్వడం తప్పని పరిస్థితి. రెండు వర్గాలు బలంగా ఉండడంతో కర్ర విరగకుండాపాము చావకుండా అన్న చందంగా ఆయన మధ్యే మార్గంగా తన పని తాను చేసుకుపోతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు యువనేత మంత్రి లోకేష్‌ వద్ద మాత్రం ముప్పిడికి మంచి మార్కులే ఉన్నాయి.

బాపిరాజు చేతుల్లో….

ఏదైనా పని విషయంలో పదే పదే చెప్పులు అరిగేలా తిరిగి నిధులు మంజూరు చేయించుకుపోతావు క‌దా.. అని వారిద్దరూ సైతం ముప్పిడితో చాలా సందర్భాల్లో అన్నట్టు జిల్లాలో మిగిలిన ప్రజాప్రతినిధులు సైతం ముప్పిడి గురించి చెపుతుంటారు. జిల్లా పరిషత్‌ చైర్మన్ ముళ్ల‌పూడి బాపిరాజు సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలు పూర్తిగా ఆయన కనుస‌న్నల్లోనే ఉంటాయి. ఇక్కడ చీమ చిటుక్కు మన్నా బాపిరాజుకు తెలియాల్సిందే. ముప్పిడి నియోజకవర్గంలో తనను వ్యతిరేకించే గ్రూపులు ఉన్నా ఎవ్వరితోనూ ఎలాంటి వివాదం లేకుండా అందరితోనూ సఖ్యతతోనే ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.

సానుభూతి కలసి వస్తుందని…..

వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తలారి వెంకట్రావు ప్రస్తుతం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల తిరిగి వెంకట్రావుకే సీటు ఖ‌రారు అయ్యిందంటూ ప్రచారం జరుగుతున్నా ఆర్థిక ఇతర‌త్రా కోణం నేపథ్యంలో ఆయనకు బీఫామ్‌ చేతికి వచ్చే వరకు సీటు వస్తుందా ? రాదా అన్నది చెప్పలేని పరిస్థితి. అయితే వైసీపీలో కొన్ని వర్గాలు మాత్రం ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నారని ఆయనకు సీటు ఇస్తే సానుభూతి పవనాలు కలిసివస్తాయని అధిష్టానంపై వొత్తిడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న జనసేన ప్రభావం నియోజకవర్గంలో శూన్యం. ఇక్కడ జనసేన, గెలవదు. రెండు ప్రధాన పార్టీల గెలుపు, ఓటమిలో కూడా డిసైడ్‌ చేస్తుందని అనుకోవడం కూడా అత్యాశే. ఆ పార్టీకి కీలక నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో లేరు. గోపాలపురం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో టీడీపీ బలంగా ఉన్నా ఆ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాల నేపథ్యమే ఆ పార్టీకి మైనెస్‌. వచ్చే ఎన్నికల్లో మరి గోపాలపురం ఓటరు ఆనవాయితీ తప్పకుండా టీడీపీకే మరో సారి పట్టం కడతారా లేదా మార్పు కోరుకుంటారా ? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*