
పాలపర్తి డేవిడ్ రాజు.. వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న నాయకుడు. దీనిని పెద్దగా బూతద్దంలో చూడాల్సిన అవసరం లేకపోయినా.. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు సంబంధం లేకపోవడంతోనే ఆయన వార్తల్లోకి ఎక్కుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా.. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందారు డేవిడ్రాజు. అయితే, తాను వైసీపీలో ఉంటే.. నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యం కాదని ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గతంలో టీడీపీ……
డేవిడ్రాజు గతంలో టీడీపీ మనిషే. ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో మండల పరిషత్ అధ్యక్షుడిగాను, జడ్పీచైర్మన్గాను, 1999లో ఎమ్మెల్యేగాను గెలిచారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆయన ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఏకంగా 19 వేల పైచిలుకు భారీ మెజార్టీతో గెలిచారు. వైసీపీలో ఉండలేకపోయి ఆయన చివరకు తిరిగి తన సొంతగూటికే చేరుకున్నారు. ఆయన టీడీపీలో చేరినా కూడా అభివృద్ధిపై ఎంత మాత్రమూ దృష్టి పెట్టలేదని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
హామీలన్నీ అటకమీదకు…..
ఇక్కడ సమస్యలు చూస్తే.. చాలా ఏళ్ల తరబడి తిష్ట వేశాయి. తాగు నీరు ఇక్కడి ప్రజలకు ప్రధాన సమస్య. ఎర్రగొండపాలెం టౌన్లోనే తాగునీరు సమస్యగా ఉంటే.. గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో తాగునీరే ప్రధాన హామీగా డేవిడ్ రాజు గెలుపొందారు. అయితే, ఆయన ఎమ్మెల్యే అయి నాలుగేళ్లు గడిచినా.. నీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇక, ఇంటింటికీ కుళాయి ఏర్పాటు అన్న హామీ కూడా సాకారం కాలేదు. డేవిడ్ రాజుకు టీడీపీలో ఎక్కడా విలువ లభించడం లేదని సమాచారం.
బాబుకు ఫిర్యాదులు…..
వైసీపీలో ఉండగా టీడీపీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు ఆయనను ఉద్దేశ పూర్వకంగానే తొక్కేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ రాజకీయంగా డేవిడ్ రాజుకు పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. తాను ఏ పార్టీలో గెలుపొంది.. ఏ పార్టీలో అయితే చేరాడో. అదే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నవారు పెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు టికెట్ ఇవ్వరాదంటూ.. ఇప్పటికే టీడీపీ అదినేత చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి.
పోటీ చేస్తే…..
ఇక్కడ టీడీపీ నేతలను ఆయన లెక్కచేయడం లేదని వారు అంటుంటే.. వారే తనను ఇబ్బంది పెడుతున్నారని డేవిడ్ రాజు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు టికెట్ లభించదని టీడీపీలోని సీనియర్లు అంటుంటే.. ఆయన పార్టీలో చేరే సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని సో.. ఇస్తారని డేవిడ్ రాజు వర్గం అంటోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు జిల్లాలో వినపడుతోన్న పొలిటికల్ టాక్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో డేవిడ్రాజు ఇక్కడ నుంచి పోటీ చేస్తే చిత్తుగా ఓడడం ఖాయమే.
ఆధిపత్య పోరే…..
పశ్చిమ ప్రకాశంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్షేత్రస్థాయిలో వైసీపీయే బలంగా ఉంది. ఈ క్రమంలోనే డేవిడ్రాజును ఇక్కడ నుంచి తప్పించి సంతనూతలపాడులో పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఓ ఐఆర్ఎస్ అధికారి పేరు టీడీపీ తరపున వినపడుతోంది. లేనిపక్షంలో డేవిడ్రాజును పూర్తిగా పక్కన పెట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. మొత్తంగా ఇక్కడ అభివృద్ధి కన్నా.. కూడా ఆధిపత్య పోరే ఎక్కువగా కనిపిస్తోంది.
Leave a Reply