
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఏం జరుగుతోంది? రాజకీయాలు ఎలా ఉంటున్నాయి? ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీకి ఎలాంటి వాతావరణం నెలకొంది? వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు ఎటు మొగ్గాలని నిర్ణయించుకున్నారు? విపక్షం వైసీపీ అధినేత చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రభావం ఈ జిల్లాలో ఎంత మేరకు పనిచేస్తోంది? ఇక, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తాను తన కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి అహరహం శ్రమిస్తున్నానంటున్న చంద్రబాబుకు ఇక్కడి ప్రజలు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నారు? అలసు ఈ జిల్లాలో ప్రస్తుత రాజకీయ సరళి ఎలా ఉంది? వంటి కీలక అంశాలపై రాజకీయ విశ్లేషకులు దృష్టి పెట్టారు. అభివృద్ధి అజెండాతో దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఈ జిల్లా ఎంత మేరకు ప్రయోజనకరంగా మారనుందనే విషయంపైనా వారు చర్చిస్తున్నారు.
గతంలో టీడీపీ ప్రభావం……
రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. దీంతో దాదాపు ఈ జిల్లాలో మొత్తంగా టీడీపీ ప్రభావం చూపించేది. ఇక, ఇదే జిల్లాకు చెందిన వ్యక్తిగా చంద్రబాబు సైతం చక్రం తిప్పేవాడు. దీంతో ఇక్కడ ప్రతి నియోజక వర్గంలోనూ టీడీపీ సానుకూల పవనాలు ఉండేవి. కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ టీడీపీ ఆధిపత్యంలోనే కొనసాగుతుండడం గమనార్హం. వీటిలో శ్రీకాళహస్తి, కుప్పం, తిరుపతి, సత్యవేడు, చిత్తూరు నియోజకవర్గాలు అధికార పార్టీకి అండదండగా నిలిచాయి. మిగిలిన వాటిలో ఎన్టీఆర్ హయాంలో ప్రజలు సైకిల్ పార్టీకే పట్టగట్టారు. అయితే, ఆయా నియోజకవర్గాలు కాంగ్రెస్కు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో అక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక, జగన్ పార్టీ పెట్టాక చాలా వరకు కాంగ్రెస్ నియోజకవర్గాలు వైసీపీకి బ్రహ్మరథం పట్టడం ప్రారంభించాయి.
కీలక నియోజకవర్గాల్లో వైసీపీ….
జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, చంద్రగిరి, నగరి, గంగాదరనెల్లూరు, పూతలపట్టు వంటి కీలక నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ గెలుపొందింది. వీటిలో శ్రీకాళహస్తి, కుప్పం, చిత్తూరులో టీడీపీ అభ్యర్థులు ఎప్పటి నుంచో గెలుస్తూనే ఉండడం గమనార్హం. ఇక, చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో వైసీపీ తరఫున గెలిచిన అమరనాథరెడ్డి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం ఆరు నుంచి 7కు చేరింది. వైసీపీ బలం ఒకటి తగ్గి 7కు చేరింది. అయితే, జగన్ వైఖరి కారణంగా ఈ నియోజకవర్గాల్లోనూ నేతలు ఒకింత ఈసంతృప్తితో ఉన్నట్టు తాజాగా చంద్రబాబు నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ఇదిలావుంటే, వైసీపీ నుంచి జంప్ చేసిన మంత్రి పదవి పట్టి అమర్నాథ్రెడ్డి, మాజీ సీఎం నల్లారి కుటుంబం నుంచి వచ్చి సైకిలెక్కిన నల్లారి కిశోర్ కుమార్లు టీడీపీని జిల్లాలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తుండడం గమనార్హం.
టీడీపీకి అనుకూలించేనా?
అదేసమయంలో కుప్పంలో జడ్పీ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, మదనపల్లెలో మాజీ ఎమ్మెల్సీ బీ నరేష్ కుమార్ రెడ్డి, పూతలపట్టులో మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య వంటి కీలక నాయకులు, ప్రజల్లో మంచి పట్టున్న నేతలు టీడీపీలో చేరడంతో పార్టీకి గట్టి పట్టు పెరిగింది. వారి వారి నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు ప్రాధాన్యం ఇచ్చేలా వారు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామా లతో ఇప్పటికే 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుండగా.. మరో ఐదు చోట్ల కూడా వైసీపీకి బలమైన పోటీ ఇచ్చేలా తమ్ముళ్లు కదులుతున్నారు. గత రెండేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు ఇక్కడ పార్టీని బలోపేతం చేశాయని అంటున్నారు నాయకులు. ప్రత్యేకంగా వైసీపీకి కంచుకోటగా మారిన నగరి, చంద్రగిరి, గంగాధర నెల్లూరులో ప్రజలు వైసీపీ నేతల పట్ల విముఖత ప్రదర్శిస్తుండడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. మొత్తంగా చిత్తూరులో అధికార పార్టీ హవా పెరగనుంది. మరి గత దశాబ్దంన్నర కాలంలో టీడీపీకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న అనుకూల పవనాలు ఎప్పుడూ లేవు. ఇది ఎన్నికల నాటికి ఎలా మారుతుందో ? చూడాలి.
Leave a Reply