
విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి మావోయిస్ట్లుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. మావోయిస్టులు ఇటీవల కాలంలో ఏజెన్సీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను దారుణంగా హత్య చేశారు. ఆ హత్య తరువాత నలభై రోజులకు వారి నుంచి లేఖ వచ్చింది. తాజాగా మరో పద్నాలుగు పేజీల లేఖ కూడా వచ్చింది. ఈ లేఖల సారాంశం బట్టి చూస్తే ఏజెన్సీలో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని దానికి టీడీపీ నాయకులు, మంత్రులు కారణమని. ఇందులో మంత్రి కుటుంబం ప్రస్తావన కూడా ఉండడం గమనార్హం.
ఆ ముసుగులో బాక్సైట్ ను….
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాక్సైట్ తవ్వకాలకు మద్దతుగా నిలవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయపాత్రుడు లైటరైట్ ఖనిజం ముసుగులో భారీఎత్తున బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని మావోలు ఆరోపిస్తున్నారు. అలాగే బడా టీడీపీ నాయకులెందరో ఇందులో భాగస్వాములుగా ఉన్నారని అంటున్నారు. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.
హిట్ లిస్టులు ఉండవు…..
మావోయిస్టులకు ఎటువంటి హిట్ లిస్టులు ఉండవని, ప్రజా ద్రోహానికి ఎవరు పాల్పడినా వారిని ప్రజా కోర్టులో నిలబెట్టి శిక్షిస్తామని కూడా ఆ లేఖలో పేర్కొనడం బట్టి చూస్తూంటే రేపటి ఎన్నికలు టీడీపీ నేతలకు పెను సవాల్ అని చెప్పకతప్పదు, ఏజెన్సీ ముఖద్వారం నర్శీపట్నంలో ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడుకు, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆయన వారసుడు విజయ్ కి మావోల లేఖలు కలవరం కలిగిస్తున్నాయని చెప్పాలి. ఇక పాడేరు ఎమ్మెల్యె గిడ్డి ఈశ్వరి విషయంలో కూడా మావోలు పరోక్ష వ్యాఖ్యలు తగిలేలా ఉన్నాయి. ప్రజలు సేవ చేయాలని ఎన్నుకుంటే కోట్లు తీసుకుని పార్టీలు మారడం తప్పు అని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీని బెంబేలెత్తించేలాగానే ఉన్నాయి.
ఆ జీవో రద్దు చేయాలి…
అదే విధంగా మావోయిస్టులు మరో డిమాండ్ కూడా చేస్తున్నారు. జీవో నంబర్ 97 ను పూర్తిగా రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఆ జీవో బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో జారీ చేశారు. దాని ప్రకారం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చెందుకు ఆస్కారం ఉంది. అయితే అప్పట్లో వైసీపీ, ఇతర పార్టీలు ఆందోళన చేయడంతో జీవోను పక్కన పెట్టారు కానీ రద్దు చేయలేదు. మొత్తానికి చూసుకుంటే ఓ వైపు ఎన్నికలు ముంచుకువస్తూంటే మరో వైపు మావోల వరస లేఖలు అధికార పార్టీని హడలెత్తిస్తున్నాయనే చెప్పుకోవాలి.
Leave a Reply