పీతల ఫిట్టింగ్ కు బలవుతారా…??

telugudesamparty-in-chinthalapudi-constiuency

చింతలపూడి నియోజకవర్గంలో గెలుపోటములు నువ్వా? నేనా? అన్నట్లు ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను మార్చివేశాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయఢంకా మోగించింది. రిజర్వ్ డ్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలుపొందింది. ఈసారి కూడా తమ కంచుకోటలో పాగా వేయాలని తెలుగుదేశం ప్రయత్నిస్తుండగా, బద్దలు కొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అభ్యర్థులను మార్చడం రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.

పీతలకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో…

గత ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా బుర్ల దేవిప్రియ బరిలో ఉన్నారు. దేవిప్రియపై పీతల సుజాత దాదాపు పదిహేను ఓట్ల మెజారిటీతో గెలిచారు. గెలిచిన వెంటనే ఆమెకు మంత్రి పదవి లభించింది. మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్థి బాటలో నడిపించేందుకు ప్రయత్నించారు. అయితే పీతల సుజాత నియోజకవర్గంలో తనకంటూ ఒక స్ట్రాంగ్ గ్రూపును ఏర్పరచుకున్నారు. పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లతో పీతలసుజాతకు పొసిగేది కాదు.దీంతో పీతలకు మంత్రి పదవి మధ్యలోనే ఊడింది.

ప్రచారానికి దూరంగా…..

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో పీతల సుజాతకు టిక్కెట్ ను చంద్రబాబునాయుడు తిరస్కరించారు. ఆమె స్థానంలో కర్రా రాజారావుకు ఇచ్చారు. కర్రా రాజరావు అభ్యర్థిత్వంపై చింతలపూడి టీడీపీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేశారు. వయసుమీరిన వారికి టిక్కెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మాజీ మంత్రి పీతల సుజాత వర్గం టీడీపీ అభ్యర్థికి సహకరించడం లేదు. పీతల సుజాత ప్రచారానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు జిల్లాకు వచ్చినా ఆమె జాడ లేదు. పీతల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం అక్కడ టీడీపీ గెలుపుపై ప్రభావం చూపుతుందంటున్నారు.

వైసీపీ దీ అదే పరిస్థితి…..

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీఆర్ ఎలీజాను పార్టీ అధిష్టానం ఖరారుచేసింది. ఈమె కూడా కొత్త అభ్యర్థి కావడంతో కాస్త తంటాలు పడుతున్నారు. వైసీపీలోని అందరినీ కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు. ఇలా టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ సొంత పార్టీ నుంచే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని టీడీపీ అభ్యర్థి ధీమాగా ఉండగా, జగన్ చరిష్మా తనను గెలిపిస్తుందని వైసీపీ అభ్యర్థి విశ్వాసంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 34089 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*