టీడీపీకి ఇక్కడ చిత్తడేనటగా…!!

telugudesamparty-in-chithoor-constiuency

చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఈసారి ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో కన్పిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానం టిక్కెట్ ను నిరాకరించింది. సత్యప్రభ పై ఉన్న అసంతృప్తితోనే ఆమెకు టిక్కెట్ దక్కలేదంటున్నారు.సత్యప్రభ స్థానంలో ఏఎస్ మనోహర్ ను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన జంగాలపల్లి శ్రీనివాసులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇక్కడ సీనియర్ నేత సీకేబాబు చివరి నిమిషంలో టీడీపీలో చేరడం కొంత కలసి వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

గ్రూపు విభేదాలే….

చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు సొంత జిల్లా. అయితే ఇక్కడ పార్టీలో సఖ్యత లేకపోవడమే శాపంగా మారింది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పార్టీలో అనేక గ్రూపులున్నాయి. ఈ గ్రూపు విభేదాలే చిత్తూరు నియోజకవర్గంలోనూ వేళ్లూనుకున్నాయి. అవే పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న ఆందోళన టీడీపీ నేతల్లో పోలింగ్ తర్వాత కూడా కన్పిస్తుండటం విశేషం. జడ్పీఛైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లాపార్టీ అధ్కక్షుడు పులివర్తి నానిలు వేర్వేరు గ్రూపులుగా ఉన్నారు. వీరంతాకలసి పనిచేయాల్సిందిపోయి వర్గాలుగా విడిపోవడంతో పార్టీకి ఈ ఎన్నికల్లో నష్టం చేకూరిందన్నది అంచనా.

బీసీలు గుర్రుగా….

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సత్యప్రభ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులును దాదాపు ఆరువేల ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికలలో సీకే బాబు వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా సీకే బాబు టీడీపీకి మద్దతిచ్చినా పెద్దగా ఉపయోగం ఏదీ ఉండదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు వరకూ ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీ ఓటర్లు టీడీపీ వైపే ఉన్నారు. అయితే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో వీరు టీడీపీ పట్ల ఆగ్రహంగా ఉండి, ఈ ఎన్నికల్లో వైసీపికి మద్దతుగా నిలిచారన్న టాక్ విన్పిస్తోంది. అంతేకాకుండా చిత్తూరు మేయర్ సీటును బీసీకి రిజర్వ్ చేస్తే సర్టిఫికేట్ ను చూపి కాపు సామాజిక వర్గానికి కేటాయించడంపై కూడా బీసీలు గుర్రుగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు సుమారు 75వేల మంది వరకూ ఉంటారని అంచనా.

వైసీపీకే ఎడ్జ్ ఉందట….

ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న జంగాలపల్లి శ్రీనివాసులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే ఇక్కడ జనసేన కూడా పోటీచేస్తుండటంతో కాపు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయినా తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గం వారి ఆధిపత్యాన్ని ఇతర సామాజిక వర్గాలు సహించలేకపోవడంతో అంతా ఒక్కటై వైసీపీ వెంట ఉన్నారన్నది పోలింగ్ అనంతరం జరుగుతున్న ప్రచారం. ఇదే నిజమైతే ఖచ్చితంగా ఈసారి చిత్తూరుస్థానాన్ని వైసీపీ గెలుచుకునే అవకాశాలున్నాయి. మరి జంగాలపల్లి శ్రీనివాసులుకు ఈసారిైనా అదృష్టం వరిస్తుందో.? లేదో.? చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 32384 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*